పైప్‌లైన్లతో సమాంతరంగా ఫైబర్ కేబుల్స్
ఫైబర్‌గ్రిడ్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పైప్‌లైన్లతో సమాంతరంగా ఫైబర్‌గ్రిడ్ కేబుల్స్‌ను వేయాలని ఐటీ మంత్రి కె.తారక రామారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ఫైబర్‌గ్రిడ్ పనులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులను చేపట్టిన వర్క్ ఏజెన్సీలతోనూ ఆగస్టు 2న సమావేశం నిర్వహించి రెండు రకాల(పైప్‌లైన్లు, కేబుల్స్) పనులు సమన్వయంగా జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఫైబర్‌గ్రిడ్‌లో ఉపయోగించే పరికరాలను పరిశీలించారు.
మిషన్ భగీరథ పైపులతో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే తీరును ఐటీ(ఎలక్ట్రానిక్స్) డెరైక్టర్ సుజయ్.. మంత్రికి వివరించారు. ఫైబర్‌గ్రిడ్ పనులు చేపట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయని, అది పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా లభించే ప్రయోజనాలన్నీ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం సాఫ్ట్‌నెట్(మనటీవీ)కు సంబంధించిన అంశాలపైనా మంత్రి సమీక్షించారు. సాఫ్ట్‌నెట్ పేరును తక్షణం మార్చాలని సీఈవో శైలేశ్‌రెడ్డిని ఆదేశించారు. మనటీవీ ఛానల్ ద్వారా యువతకు, విద్యార్థులకు రైతులకు, గృహిణులకు ఉపకరించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సూచించారు.
‘పురపాలన’పై రేపు సమీక్ష
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం సమావేశం కానున్నారు. కరీంనగర్‌లో ప్రతీమ కాంప్లెక్స్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశంలో కీలకంగా 8 అంశాలను చర్చించనున్నారు. ఆదర్శ వార్డు/ఆదర్శ మునిసిపాలిటీ నిర్మాణంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ప్రజెంటేషన్‌తో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం ఆయా పురపాలికల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను స్థానిక మేయర్లు, చైర్మన్లు ఇతరులతో పంచుకోనున్నారు. అనంతరం పారిశుద్ధ్యం, హరిత హారం, నీటి సరఫరా, వర్షాకాల కార్యాచరణ, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పురపాలికల ఆదాయం పెంపు వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు.