పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్‌ | Internet to every house in the towns | Sakshi
Sakshi News home page

పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్‌

Published Sat, Sep 2 2017 2:21 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్‌ - Sakshi

పట్టణాల్లోనూ ఇంటింటికీ ఇంటర్నెట్‌

- ‘భగీరథ’ పైప్‌లైన్లతో పాటే ఆప్టిక్‌ ఫైబర్‌: కేటీఆర్‌
- ఇంటింటికీ ఇంటర్నెట్‌తో విప్లవాత్మక మార్పులు
- నిర్ణీత సమయానికే మిషన్‌ భగీరథ పూర్తి
- వారానికోసారి అర్బన్‌ భగీరథపై సమీక్ష
 
సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా చేపట్టిన టీ–ఫైబర్‌ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామని ఐటీ, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వాటర్‌ పైప్‌లైన్‌తో పాటు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్‌ వేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌తో పాటు, వాటర్‌ వర్క్స్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనుల్లో ప్రతి పైప్‌ లైన్‌ వెంట ఇంటర్నెట్‌ లైన్లు వేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక అంచనాలు సిద్ధం చేయాలన్నారు. టీ–ఫైబర్‌ ద్వారా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులొస్తాయని వివరించారు.

మిషన్‌ భగీరథ, టీ–ఫైబర్‌ పనులపై శుక్రవారం హైదరాబాద్‌ బేగంపేటలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ (పబ్లిక్‌ హెల్త్‌) అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలతో మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో భాగంగా కార్పొరేషన్లలో పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు నగరాలకు ప్రత్యేకంగా నిధులూ ఇచ్చామని పేర్కొన్నారు. అర్బన్‌ మిషన్‌ భగీరథ ప్రాజెక్టుతో పాటు టీ–ఫైబర్‌ ప్రాజెక్టు సమన్వయం చేసుకునేందుకు ఐటీ, మున్సిపల్‌ శాఖలు కలసి పనిచేయాలన్నారు. ఇందుకోసం జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 
 
డక్ట్‌ వ్యయం ప్రభుత్వానిదే..
గతంలో వేసిన పైపులైన్లు తవ్వాల్సిన అవసరం లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్‌ వేయాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌తో పాటు, ఇంటర్నెట్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ మ్యాపుల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల న్నారు. ఇప్పటికే రూరల్‌ మిషన్‌ భగీరథలో డక్ట్‌ వేయడానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గద ర్శకాలను పాటించాలని ఏజెన్సీలను కోరారు. పైప్‌లైన్లతో పాటు డక్ట్‌ వేసేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఈ మేరకు లిఖితపూర్వకంగా ఈఎన్‌సీ (పీహెచ్‌) ఆదేశాలు జారీ చేస్తారన్నారు.

అర్బన్‌ భగీరథ కోసం మున్సిపల్‌ శాఖ సన్నద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం నిర్మాణాలు, ప్రణాళిక రూపకల్పన, నిధుల సమీకరణ అంశాల వివరాలను మంత్రికి అధికారులు అందజేశారు. ప్రాజెక్టు కోసం టెండర్లు పూర్తయ్యాయని, పలు చోట్ల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేస్తే వచ్చే వేసవికి పట్టణ, నగర ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని, ఇందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు పనిచేయాలని మంత్రి చెప్పారు. వారానికోసారి అర్బన్‌ భగీరథ పనులపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement