ఇప్పటికే ఇంటింటికి తాగునీటికి అందించడానికి మిషన్ భగీరథను ప్రారంభించగా నగర పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు నల్లా
రూ.2 లక్షల ఆదాయం లోపు వారికి అవకాశం
నగర పంచాయతీ పరిధిలో అమలు
పరకాల : ఇప్పటికే ఇంటింటికి తాగునీటికి అందించడానికి మిషన్ భగీరథను ప్రారంభించగా నగర పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు నల్లా నీళ్లు అందించడానికి ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వడానికి ఆదేశాలను జారీ చేసింది. నగర పంచాయతిలో 4081 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగర పంచాయతీలో దారిద్రరేఖకు దిగువనున్న వారికి రూ. 1కే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. దీని కోసం అధికారులు కసరత్తును చేస్తున్నారు. నగర పంచాయతీలో సొంత ఇళ్లును కలిగి ఉండి రూ. 2 లక్షల ఆదాయం లోపు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించారు.
తహసీల్దార్ నుంచి ధ్రువీకరించిన ఆదాయం (మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికెట్)ను పంచాయతీ కార్యాలయంలో సమర్పిస్తే తక్షణమే నల్లా క నెక్షన్ ఇచ్చేందుకు అధికారులు బిల్ కలెక్టర్లకు సూచించారు. అర్హులైన వారికి నల్లా కనెక్షన్ విషయంలో అవగాహన కల్పించి కనెక్షన్ తీసుకునేలా ప్రయత్నించాలని కమిషనర్ పరమేష్ సిబ్బందికి చెప్పారు. గతంలో రూ.200 ఉండగా ఇప్పుడు రూపాయికే కనెక్షన్ ఇస్తున్నారు. రూపాయికే కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.