
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ నల్లాతో రక్షిత మంచినీటిని అందించే తొలి రాష్ట్రం తెలంగాణే అవుతుందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి ఎస్.ఎస్ అహ్లూవాలియా అన్నారు. 2022 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అయితే అంతకంటే ముందే తెలంగాణ ఆ ఘనతను సాధించడం అభినందనీయమన్నారు. మిషన్ భగీరథ పనులను పరిశీలించడానికి బుధవారం రాష్ట్రానికి వచ్చిన అహ్లూవాలియా ముందుగా మిషన్ భగీరథ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్‌ను సందర్శించారు. ఆ రెండు చోట్ల కేంద్ర మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథపై తెలంగాణ ఎంపీలు తనకు తరచూ సమాచారం అందిస్తుంటారని తెలిపారు.
నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా తనకు భగీరథ స్వరూపం, లక్ష్యాలపై పూర్తి అవగాహన కలిగిందన్నారు. అపరిశుభ్ర తాగునీరు, పరిసరాలతో దేశంలో ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, అధికారుల పట్టుదలతో ఈ డిసెంబర్ చివరినాటికి అన్ని ఆవాసాలకు నీళ్లు అందుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే ప్రతిఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాన్ని నెరవేర్చే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందన్నారు.
కేసీఆర్‌ను కేంద్రమంత్రులంతా డైనమిక్ సీఎం అంటూంటారని, మిషన్ భగీరథతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న తర్వాత ఎవరైనా ఆ మాట నిజమనే అంటారన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న విధానాల నుంచి ఎంతో కొంత నేర్చుకునే తాను తిరిగి ఢిల్లీ వెళతానన్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పాటు నీటిశుద్ధి కేంద్రాల్లో జరిగే వృథాను అరికట్టడం కూడా ముఖ్యమన్నారు. మిషన్ భగీరథలో దీని గురించి ఏమైనా ఆలోచించారా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి భగీరథలో తాము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వృథాను రెండు మూడు శాతానికే పరిమితం చేశామన్నారు. ఇక ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లతో సమానమైన ప్రెజర్‌తో అందరికి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ రెండు అంశాలను అహ్లూవాలియా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సురేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment