
ఇవి నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశువులు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించే పశువులపై మున్సిపల్ సిబ్బంది ఎంసీఎన్ అని రాస్తారు. దీంతో వాటిని సదరు పశువుల యజమానులు మళ్లీ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అవే పశువులు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే వాటిని కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని గోశాలకు తరలిస్తారు లేదా అడవిలో వదిలేస్తారు. గేదెలు, మేకల వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ చెప్పేందుకు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఇలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్.
అవ్వకెంత కష్టం..
చేతితో చిల్లిగవ్వలేదు.. ఉన్న ఒక్క కొడుకు బతుకుతెరువు కోసం వెళ్లి వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్‌లో ఉంటున్న కన్న కూతురును చూడాలనిపించింది ఈ అవ్వకు. అయితే, ప్రయాణానికి డబ్బులు లేవు.. కానీ కూతురును చూడాలనే కోరిక ముందు ఇదేమీ కష్టం అనిపించలేదు. దీంతో ఇలా కాలినడకన నెత్తిన బట్టలమూటతో బయలుదేరి వెళ్తూ సాక్షి కెమెరాకు కనిపించింది.
– సాక్షి ఫోటోగ్రాఫర్, మంచిర్యాల
వినూత్న యంత్రం.. పనిలో వేగం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన రైతు ముత్తినేని సత్యం పవర్ వీడర్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి మరింత సులభంగా సాగు పనులు చేస్తుండడం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. పత్తి, మిరప పంటల సాగు చేసే సత్యం రూ.55 వేలతో పవర్ వీడర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. స్వతహాగా మెకానిక్ అయిన ఆయన యంత్రానికి కొన్ని మార్పులు చేశాడు. నడుస్తూ పనిచేయాల్సిన పవర్ వీడర్‌ను బైక్‌లా మార్చేందుకు ముందు భాగంలో మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వెనుక భాగంలో ట్రాక్టర్ మాదిరి గొర్రు పైకి.. కిందకు లేపేలా బిగించాడు. దీంతో ఎన్ని ఎకరాలైనా సరే.. కూర్చుని మరీ పత్తి, మిరప తోటలో గుంటుక తీయడం, కలుపు తీయడం సులభమవుతోందని తెలిపాడు. పత్తి, మిరప, కూరగాయల సాగు చేసే రైతులకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని సత్యం వెల్లడించాడు.
ఉప్పొంగిన ‘భగీరథ’
మహబూబ్‌నగర్ మండలంలోని మన్యం కొండ స్టేజీకి సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ వాల్వ్ నుంచి గురువారం నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ఎత్తున నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీనిపై మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణను వివరణ కోరగా.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డి గూడెంలోని వాల్వులు కొంత కాలంగా లీక్ అవుతున్నాయని, వాటికి మరమ్మతు చేయడానికి వీలుగా మన్యంకొండ వద్ద నీరు విడిచామని తెలిపారు. నీరు మొత్తం ఖాళీ అయితేనే వాల్వు మరమ్మతు చేయడానికి వీలవుతుందని, నీరు ఖాళీ అయ్యాక తాను వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలను సరిచేయించానని ఆయన వివరించారు.
– జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)
Comments
Please login to add a commentAdd a comment