కోటి ఇళ్లకు నల్లా నీరు | drinking water to 1 crore homes | Sakshi
Sakshi News home page

కోటి ఇళ్లకు నల్లా నీరు

Published Mon, Sep 19 2016 2:42 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

కోటి ఇళ్లకు నల్లా నీరు - Sakshi

కోటి ఇళ్లకు నల్లా నీరు

2017 డిసెంబర్‌కల్లా  అన్ని గ్రామాలకు తాగునీరు
మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి సంతృప్తి
జరుగుతున్న పనులపై కేసీఆర్ సమీక్ష
‘తాగునీటి’పై ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేలా మిషన్ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు కోటి ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. నదుల నుంచి నీరు గ్రామాలకు చేరే నాటికి అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. మిషన్ భగీరథలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 66,800 ఇళ్లకు నల్లాల ద్వారా నీరందిస్తున్నామని, గతంలో చేసిన ప్రయత్నాలతో సిద్ధిపేట నియోజకవర్గంలోనూ తాగునీరు అందుతోందని సీఎం చెప్పారు.

క్యాంపు కార్యాలయంలో ‘భగీరథ’పై ఆదివారం కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పైపులైన్ల నిర్మాణం జరగాలని చెప్పారు.  వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుతుందని, అప్పటివరకెల్లా పల్లెల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇళ్లలో నల్లాలు బిగించే పనులు జరగాలని చెప్పారు. ‘భగీరథ’ పనులను చేపట్టే ఏజెన్సీలే పదేళ్ల వరకు నిర్వహించే నిబంధన పెట్టినందున పనుల్లో నాణ్యత ఉంటున్నదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు.

తాగునీటి కోటాపై ప్రత్యేక జీవో...
నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి పది శాతం నీటిని వాడుకోవాలనే విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున, దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పాత ప్రాజెక్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీటిని... ఎక్కడ వాడుకోవాలనే విషయంలో స్పష్టత కావాలని, అందుకు ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావును ఆయన ఆదేశించారు. నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

మున్సిపాలిటీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ శాఖ తరఫున తాగునీటి సరఫరా జరుగుతోందని, కొత్తగా నగర పంచాయతీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారానే నీటి సరఫరా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ‘భగీరథ’ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హనుమంతు షిండే, జలగం వెంకట్రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సీఈలు సురేశ్‌కుమార్, జగన్మోహన్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement