కొత్త ఏడాదికి మంచినీటి కానుక | Drinking water will be supplied through the Integrity Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదికి మంచినీటి కానుక

Published Fri, Aug 25 2017 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

కొత్త ఏడాదికి మంచినీటి కానుక - Sakshi

కొత్త ఏడాదికి మంచినీటి కానుక

ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌:  కొత్త సంవత్సర కానుకగా వచ్చే జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అం దించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకోసం ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఇంటేక్‌ వెల్స్‌ నుంచి నీటిని తీసుకుని.. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా మంచినీటిని పంపింగ్‌ చేయాలని చెప్పారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్‌ ఏజెన్సీలు రేయిం బవళ్లు పనిచేసి అయినా లక్ష్యాన్ని చేరుకోవా లని సూచించారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిషన్‌ భగీరథపై గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇది జీవన్మరణ సమస్య
మిషన్‌ భగీరథ రాష్ట్ర ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. అనుకున్న సమయంలో ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించటం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందిం చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాలు చేసి మరీ మిషన్‌ భగీరథ పనులు చేస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎవరూ తీసుకోని సవాల్‌ స్వీకరించా మని.. దానికి తగినట్లు పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు.

రూ.43 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని ఇకపై స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షిం చాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం 19 ఇంటెక్‌వెల్స్‌లో ఇప్పటికే 16 పూర్త య్యాయని, మిగతావి త్వరలోనే పూర్తవుతా యని అధికారులు వివరించారు. 50 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 27 పూర్తికావచ్చాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 49,238 కి.మీ.కు గాను 43,427 కి.మీ. (88 శాతం)  పైపులైన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు.

ముప్పై ఏళ్ల ముందస్తు ప్లాన్‌ ఇది..
రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్‌ భగీరథ రూపొందించామని.. అప్పటికి ప్రజలకు సరిపడే నీటిని అందించేలా ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరోసారి మదింపు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని... ప్రతి జిల్లాలో మం త్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. ఇంటేక్‌ వెల్స్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యే నాటికే వాటికి కావలసిన విద్యుత్‌ సరఫరా, సబ్‌స్టేషన్ల నిర్మాణం జరగాలన్నారు. ఆ పనుల పర్య వేక్షణకు ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ముగ్గురు అధికారులను నియమించాలని సూచించారు.

తాగునీటికి ప్రాధాన్యం
జలాశయాల నీటిని వాడుకునే విషయంలో మంచినీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్‌ భగీరథకు కేటాయిస్తామని.. అందుకు చట్టం కూడా తెచ్చామని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని తీసుకోగల కనీస మట్టం (ఎండీడీఎల్‌) ఉండేలా చూసుకోవాలని.. దీనిపై నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల ఆపరేషన్‌ మాన్యువల్‌ను మార్చాలని సూచించారు. రాష్ట్రంలో 19 ప్రాంతాల్లోని నీటి వనరుల్లో కేవలం దుమ్ముగూడెం వద్ద మాత్రమే 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని.. మిగతా 18 నీటి వనరులలో నిరంతరం నీరు అందుబాటులో ఉండేందుకు ఇది ఎండీడీఎల్‌ పాటించడం అవసరమని పేర్కొన్నారు.

వర్కింగ్‌ ఏజెన్సీలకు గొప్ప అనుభవం
పథకం వర్కింగ్‌ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించాలని... ఈ పథకం వర్కింగ్‌ ఏజెన్సీలకు కూడా ప్రతిష్టాత్మకమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోందని, సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి 1.5 శాతం ఇన్సెంటివ్‌ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాప్యం చేస్తున్న వర్కింగ్‌ ఏజెన్సీల నుంచి పనులను తప్పించడానికి ప్రభుత్వం వెనుకాడదని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు.

మూడు కీలక పథకాలూ విజయవంతం
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు మూడు అని.. ఒకటి నిరంతర విద్యుత్‌ సరఫరా, రెండోది రైతులకు సాగునీరు అందివ్వడం, మూడోది ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘‘విద్యుత్‌ రంగంలో అద్భుత విజయం సాధించాం. 45 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. త్వరలోనే వంద శాతం పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.

సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. పనులు అనూహ్యంగా జరుగుతున్నాయి. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు సమకూరుస్తున్నాం. మొత్తం ఏడాదికి రూ.58 వేల కోట్ల వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుండే గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి.. అదే సమయంలో ఇంటింటికీ మంచినీరు అందుతుంది..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

జీఎస్టీ తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి
జీఎస్టీ వల్ల తమపై అధిక భారం పడుతుందని సమీక్ష సందర్భంగా వర్కింగ్‌ ఏజెన్సీలు ప్రస్తావించాయి. పరికరాలు, మెటీరియల్‌ కొనుగోలు సందర్భంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందని.. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌... ప్రజోపయోగ పనులపై జీఎస్టీ తగ్గించాలంటూ కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమా వేశంలో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిం చకుంటే వర్కింగ్‌ ఏజెన్సీలకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement