కుట్రలు ఛేదించినం
♦ వృద్ధి బాట పట్టినం: సీఎం కేసీఆర్
♦ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలె
♦ బమ్మెర, రాఘవాపురాల్లో సీఎం పర్యటన
సాక్షి, జనగామ: ‘‘తెలంగాణ ఏర్పడినంక రాజకీయ అస్థిరతను సృష్టించి తెలంగాణను దెబ్బ తీయాలని కొన్ని శక్తులు కుట్రలు చేసినై. నాలుగు రోజులకో, పది రోజులకో ఈ ప్రభుత్వం పడిపోతదంటూ తర చూ స్టేట్‌మెంట్లు వచ్చినై. మీరంతా చూసిండ్రు. ఆ కుట్రలను ఛేదించి ఇప్పుడు అభివృద్ధి బాట పట్టినం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఆదర్శ గ్రామ మైన రాఘవాపురం, సహజ కవి పోతన జన్మస్థల మైన బమ్మెర గ్రామాల్లో సీఎం శుక్రవారం పర్యటించా రు. రాఘవాపురంలో మిషన్ భగీరథ నల్లా నీటిని ప్రారంభించారు. 30డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బమ్మెరలో పోతన సమాధి, వ్యవసాయ బావులను పరిశీలించారు. రాఘవాపురం, బమ్మెరల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు.
పోతనను కూడా సొంతం చేసుకునేం దుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నించారని సీఎం దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ బిడ్డయిన పోతనది కడప జిల్లా ఒంటిమిట్ట అని చాలా దుర్మార్గంగా మాట్లాడిండ్రు. మహాకవి శ్రీనాథునికి, పోతనకు చుట్టరికముంది. అందుకే కాకతీయుల హయాంలో శ్రీనాథుడు ఇక్కడికి వచ్చిపోయిండంతే. ఇట్ల సమైక్య రాష్ట్రంలో ఏదీ మనది కాకుండా పోయింది. మనుషు లు మనుషులు కాకుండా పోయిండ్రు. కవులు కవులు కాలేదు. నీళ్లు నీళ్లు కాకుండా పోయినై. దేవుళ్లు దేవుళ్లు కాకుండా పోయిండ్రు. అన్నీ నిరాదరణకు గురైనై. అందుకే ఒక ఉప్పెనలా విప్లవం పొంగింది. పోతన వారసులం గనుకనే మనకా పౌరుషముంది’’ అన్నారు.
ఇతర కవులంతా తమ రచనలను రాజుల కు అంకితమిచ్చి భోగభాగ్యాలు అనుభవిస్తే పోతన మాత్రం ‘నా కావ్య కన్యకను రాజులకిచ్చి పడుపు కూడు తినే దౌర్భాగ్యం వద్దు’అంటూ వ్యవసాయం చేసుకుంటూనే జీవనం సాగించిన మహాకవి అని ప్రస్తుతించారు. ‘‘అలతి అలతి పదాలతో తేటతెలుగు కవిత్వాన్ని, మహాద్భుతంగా మహా భాగవతాన్ని తెలుగువారికి అందించిన పోతన వారసులం మన మంతా. అది మరిచిపోవద్దు’’అని సూచించారు. బమ్మెరను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. జనగామ జిల్లాలో చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి రూ.40 కోట్లు కేటా యిస్తున్నట్టు ప్రకటించారు.
బమ్మెరకు రూ.7.5 కోట్లు, పెంబర్తికి రూ.5కోట్లు, వల్మీడికి రూ.5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, జఫర్‌గఢ్ కోటకు రూ.6 కోట్లు, ఖిలాషాపూర్ కోటకు రూ.4.5కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.2కోట్లు ప్రకటించారు. బమ్మెరకు బైపాస్ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి రూ.176కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పా రు. పాలకుర్తిలో మహిళా డిగ్రీ కళాశాలతో పాటు నియోజకవర్గానికి అదనంగా 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రక టించారు. రాఘ వాపురం చిన్న గ్రామమైనా అభివృద్ధిలో గంగదేవిపల్లి తో పోటీపడడం అభినంద నీయమన్నారు.
దయాకర్ పదవి వద్దన్నడు...
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బాగుచేసు కోవడం కోసం టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించానని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎర్రబెల్లిని పిలిపించి మాట్లాడిన. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తానొక్కడినే కాక అందరమూ వస్తమని చెప్పి దయాకర్ లీడ్ తీసుకుని వచ్చారు. అలా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చిండ్రు. సీనియర్ నాయకుడైన దయాకర్‌రావుకు టీఆర్‌ఎస్‌లో కీలక పదవి ఇద్దా మనుకున్నం. ఆయన మాత్రం తనకు పదవి వద్దని, తన నియోజకవర్గానికి రూ.100 నుంచి రూ.150కోట్ల అభివృద్ధి పనులు కావాలని అడిగిం డ్రు.
ఈ విషయాన్ని మీ నియోజకవర్గంలోనే చెప్పాలని నేనిక్కడికి వచ్చిన’’అని వివరించారు. సభలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు అజ్మీరా సీతారాం నాయక్, పసునూరి దయాకర్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్లు శ్రీదేవసేన, ఆమ్రపాలి, ప్రీతి మీనా, ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.
ఎప్పుడూ నాకే ఫస్ట్ ప్రైజు
బమ్మెర సభలో ప్రసంగం సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక్కసారిగా తన కాలేజీ రోజుల్లోకి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను సభికులతో పంచుకున్నారు. ‘‘నాకు ఒక జ్ఞాపకం వస్తున్నది. మెదక్ జిల్లా సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా గురువు పరాశరం గోపాలకృష్ణమూర్తి తెలుగు సాహిత్యంపై పోటీలు పెట్టెటోళ్లు. అప్పట్ల తెలుగు పద్యం గానీ, వ్యాసం గానీ, రచనల్లో గానీ నాకే ఫస్ట్ ప్రైజు వచ్చేది. నా సోదరులు, తోటోళ్లంతా ‘ఏందీ అన్యాయం సార్? ఎప్పుడూ చంద్రశేఖర్‌కే ఫస్ట్ ప్రైజా?’అంటే ఆయన ‘నాకు నచ్చిన గ్రంథం’ అంశంపై వ్యాసరచన పోటీ పెట్టిండ్రు.
అయితే పోటీలున్న విషయం 45 నిమిషాల ముందే గుర్తుకు వచ్చింది. వెంటనే కాలేజీకి పోయిన. కానీ పెన్ను మరిచిపోయాను. మా దోస్తు వినోద దగ్గర పెన్ను అడుక్కున్న. పోతన కవిత్వంపై సి.నారాయణరెడ్డి రాసిన మందార మకరందం పుస్తకం సదివిన. 30 నిమిషాల్ల వ్యాసం రాసిచ్చిన. మళ్లా నాకే ఫస్ట్ ప్రైజొచ్చింది. దాంతో అంతా పంచాయతీ పెట్టిండ్రు. కాలేజీ ప్రిన్సిపాల్ రంగారెడ్డిని, తెలుగు హెడ్‌ను పిలి చిండ్రు. ‘మిగతా వాళ్లంతా నవలల గురించి రాస్తే చంద్రశేఖర్ మాత్రమే పోతన గురించి రాసిండు.
అందుకే బహుమతి తనకిచ్చినం’అని సార్లు చెప్పిం డ్రు’’అంటూ సభికుల చప్పట్ల మధ్య సీఎం గుర్తు చేసుకున్నారు. ‘సత్కవుల్ హాలికులైన నేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై’, ‘ఇందుగలడందులేడను సందేహం వలదు.. ఎందెందు వెదికిచూసినా అందందే గలడు దానావాగ్రణి వింటె’అంటూ పోతన పద్యాలను స్వయంగా పాడి వినిపించి సభికులను అలరించారు.