కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం | Mission Bhagiratha pipeline works | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం

Published Wed, Oct 19 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం

కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం

70 శాతం పూర్తయిన ప్రధాన పైప్‌లైన్‌ పనులు
 
బాన్సువాడ : మిషన్‌ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్‌లైన్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్‌లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్‌లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్‌లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్‌ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు.
 
మిషన్‌ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్‌ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌ రూరల్, నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు  కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్‌బెడ్‌ పనులు పూర్తయ్యాయి. పైప్‌లైన్, ఇంటెక్‌వెల్‌ పనులు జరుగుతున్నాయి. 
 
వాస్తవానికి నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దే హసన్‌పల్లిలో ఫిల్టర్‌ బెడ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్‌లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్‌లైన్‌ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌ ద్వారా నిజాంసాగర్‌కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్‌లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్‌లైన్‌ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్‌స్టోరేజీ వాటర్‌ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్‌ వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పైప్‌లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్‌మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్‌రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్‌రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్‌ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్‌లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్‌ ఓపెన్‌ చేస్తే నిజామాబాద్‌ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
సాగుతున్న పైప్‌లైన్‌ పనులు
ప్రధాన పైప్‌లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్‌లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్‌లను డంప్‌ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్‌లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement