-ఒకే విధమైన ప్రెషర్ కోసం ఫిక్స్‌డ్ ఫ్లో వాల్వ్ టెక్నాలజీ వినియోగం
సాక్షి, హైదరాబాద్
మిషన్ భగీరథ పనులను మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో గజ్వేల్ సెగ్మెంట్ పనులను ఎంఈఐఎల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 24 నెలల సమయం ఉండగా, నిర్ణీత సమయం కన్నా ముందుగానే ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 66,837 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 1,520కిలోమీటర్ల మేర పైప్‌లైన్ల నిర్మాణం పూర్తిచేసింది. ఎల్లంపల్లి వద్ద గోదావరి పైప్‌లైన్ నుంచి కొండపాక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకు రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకునే ఈ ప్రాజెక్ట్‌లో అన్ని కుళాయిలకు ఒకే రకమైన నీటి సరఫరా ఉండేలా ఫిక్స్‌డ్ ఫ్లో వాల్వ్ అనే అధునాతన టెక్నాలజీని వినియోగించారు. రూ.548కోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా కోమటిబండ వద్ద 1.40కోట్ల లీటర్ల సామర్థ్యంతో గ్రాండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దీనికి అనుబంధంగా 1.50లక్షలు, 5.50లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించింది.