విద్యుత్ వెలుగుల్లో హైటెక్స్ స్వాగత ద్వారం..
సాక్షి, హైదరాబాద్: మహిళలు ముందుంటే.. అందరికీ శ్రేయస్సే.. భాగ్యనగరం వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) ఈ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయనుంది! నవ యువనారి శక్తిని ప్రపంచానికి చాటనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంక ట్రంప్ రాకతో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అంతరిక్ష రంగంలో తమదైన ముద్ర వేసిన అనౌషే అన్సారీ, షింబోంజిలే సాంబో, ఎమ్‌ఐటీ ప్రొఫెసర్లు, భారత్‌కు చెందిన అను ఆచార్య, రాధికా అగర్వాల్ వంటి దిగ్గజాలు ఎందరో సదస్సులో మాట్లాడనున్నారు.
దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు రానుండగా వారిలో 127 దేశాల నుంచి మహిళల ప్రాతినిధ్యం ఉండనుంది. అందులో పది దేశాల నుంచి అందరూ మహిళా ప్రతినిధులే కావడం విశేషం. ఈసారి పురుషుల కంటే మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉండనుంది. మొత్తం ప్రతినిధుల్లో 52.5 శాతం వారే ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన జీఈఎస్ సదస్సుల్లో పురుషుల కంటే మహిళా ప్రతినిధులు ఎక్కువగా ఉండటం ఇదే తొలిసారి. అలాగే ప్రతినిధుల్లో 5 శాతం మంది యువతీయువకులే! వీరంతా 30 ఏళ్లలోపు వారే. కనిష్టంగా 13 ఏళ్ల నుంచి గరిష్టంగా 84 ఏళ్ల వయస్సున్న పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. మహిళలపై రకరకాల ఆంక్షలు అమల్లో ఉన్న అఫ్గానిస్థాన్, సౌదీ అరేబియాతోపాటు ఇజ్రాయిల్ నుంచి మహిళా ప్రతినిధులు సదస్సుకు రానుండటం హైలైట్.
ఎనిమిదో సదస్సు.. ఎన్నో విశిష్టతలు
జీఈఎస్ ప్రారంభమైనప్పట్నుంచీ ఏటా జరుగుతున్న సదస్సులో ఇది ఎనిమిదోవది. దక్షిణాసియా దేశాల్లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ఎన్నో ప్రాధాన్యతలున్నాయి. ఏటా ఒక్కో ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సులో ఈసారి మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సదస్సుకు అమెరికా ప్రభుత్వంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ ఏర్పాట్లు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్నారు. హెల్త్ లైఫ్‌సైన్సెస్, ఎనర్జీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ–ఫైనాన్సియల్ టెక్నాలజీ, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్ నాలుగు రంగాలపైనే సదస్సు ఫోకస్ చేయనుంది. స్టార్టప్‌లు ప్రారంభించిన ఔత్సాహికులు, నవ పారిశ్రామికవేత్తలకు ఊతమివ్వాలనేదే జీఈఎస్ లక్ష్యం. సదస్సుకు హాజరయ్యే 1,500 మంది ప్రతినిధుల్లో 1,200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ల యజమానులుంటారు. మిగతా 300 మంది ఔత్సాహికులకు ఆర్థికంగా సాయం అందించే పెట్టుబడిదారులు. మొత్తం ప్రతినిధుల్లో దాదాపు మూడో వంతు మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచే రానున్నారు. కొలంబియా, ఫూర్టోరికో జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల బృందానికి ఇవాంక ట్రంప్ సార«థిగా హాజరవనున్నారు.
వంద స్టార్టప్‌ల అధునాతన షో
భారత్‌లో దేశం నలుమూలాల నుంచి దాదాపు అయిదు వందల మంది సదస్సులో పాలుపంచుకుంటారు. దేశంలో పేరొందిన నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తులను తయారు చేసిన వంద స్టార్టప్ కంపెనీలకు సదస్సులో ప్రత్యేక చోటు కల్పించారు. డీఐపీపీ ఎంపిక చేసిన వంద స్టార్టప్‌లు తొలి రోజున ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ ఉత్పత్తులు, సేవలపై అత్యంత అధునాత స్క్రీన్లపై ప్రదర్శన ఇవ్వనున్నాయి.
35 మంది విజేతలకు ప్రత్యేక అవకాశం
సదస్సు ఏర్పాట్లు ప్రారంభమైనప్పట్నుంచీ ఇప్పటివరకు హ్యాకథ్లాన్ మొదలు పిచ్ కాంపిటేషన్లు నిర్వహించారు. ఓటింగ్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. దేశంలో 500 మంది ఔత్సాహికులు తమ ఆవిష్కరణలు, ఆలోచనలు, కొత్త స్టార్టప్‌లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతంగా ఉన్న ఆలోచనలను పంచుకున్న 35 మందిని ఎంపిక చేశారు. వీరంతా తమ ఐడియాలను, ఆవిష్కరణలను ప్రపంచ పెట్టుబడిదారులతో సదస్సులో పంచుకునే అవకాశం కల్పించారు. కాగా, సదస్సుకు హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు అబ్బురపరిచేలా అతిథ్యం ఇవ్వటంతో పాటు అవాంఛనీయ సంఘటనలేవీ చోటుచేసుకోకుండా కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.
అందరూ దిగ్గజాలే..
జీఈఎస్‌లో వివిధ రంగాలకు చెందిన పలువురు దిగ్గజాలు తమ అనుభవాలు పంచుకుంటారు. వారిలో కొందరి ఆసక్తికరమైన నేపథ్యాలివీ..
అనౌషే అన్సారీ: మహిళలపై ఆంక్షలు అమల్లో ఉన్న ఇరాన్ నుంచి అంతరిక్షం వరకు ఎదిగిన మేధావి ఈమె. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కలిగిస్తే పెనుమార్పులు చోటు చేసుకుంటాయనే అంశంపై ఈ ఇరానియన్–ఆమెరికన్ వ్యోమగామి ప్రసంగించనున్నారు.
షింబోంజిలే సాంబో: దక్షిణాఫ్రికాకు చెందిన ఈమెను కెరీర్ ఆరంభంలో ఓ ఫ్లైట్ అటెండెంట్‌గా కూడా పనికిరాదంటూ అందరూ తిరస్కరించారు. ఇప్పుడు ఆమె సొంత విమాన సంస్థ (ఏవియేషన్ కంపెనీ) స్థాపించారు. ఆమె ప్రసంగం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– అత్యంత ప్రతిభావంతులైన ఎమ్‌ఐటీ ప్రొఫెసర్లు కార్లో రాటీ, డేనియెల్లే వుడ్‌లు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికరంగంలో సమీప భవిష్యత్తులో రానున్న సాంకేతిక విప్లవాలను సదస్సులో వివరిస్తారు.
– భారత్‌కు చెందిన అను ఆచార్య, రాధికా అగర్వాల్ వంటి పారిశ్రామికవేత్తలు సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనపై మాట్లాడతారు.
– ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన కెరియర్ పూర్తిగా వదిలేసి, క్రీడా పారిశ్రామికవేత్తగా పేరు గడించిన ఛాత్రి సిత్యోడ్‌టాంగ్ తన అనుభవాలను వివరిస్తారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, బాడ్మింటన్ రంగానికి వన్నె తెచ్చిన పుల్లెల గోపీచంద్‌తో ఛాత్రి వేదికను పంచుకోనున్నారు.
– న్యూయార్క్‌లోని అత్యున్నత రేటింగ్‌తో రెస్టారెంట్లను విజయవంతంగా నడుపుతున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన అనుభవాలను వివరిస్తారు.
– యూనీ కార్న్ స్టార్టప్ (అంటే ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న సంస్థ)గా ఓయో రూమ్స్‌ను నెలకొల్పిన కేవలం 24 ఏళ్ల వయసున్న రితేష్ అగర్వాల్ తన సక్సెస్ స్టోరీ వివరిస్తారు.
– ‘త్రీ ఇడియట్స్’సినిమాలోని ఫున్‌సుఖ్ వాంగ్డూ పాత్రకు అసలు రోల్ మోడల్, ఇంజనీరు సోనమ్ వాంగ్‌చుక్ ప్రసంగిస్తారు. లడాఖ్‌కు చెందిన ఈయన ఒక ఇంజనీరు నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
– అడ్వర్టయిజింగ్ రంగంలో నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీయూష్ పాండేతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment