సాక్షి, హైదరాబాద్: ఇక్కడ మహిళలు మైనారిటీ కాదు.. తొలిసారి మెజారిటీలోకి వచ్చారు. ఇదీ... మంగళవారం నుంచి హైదరాబాద్ వేదికగా మొదలు కాబోతున్న ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు–జీఈఎస్ 2017’ ప్రత్యేకత. ఇదొక్కటేనా!! అమెరికా ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ సదస్సు.. దక్షిణాసియాలో జరగటం ఇదే ప్రథమం. అంతేకాదు! 10 దేశాల నుంచి వస్తున్న బృందాల్లో మహిళలు తప్ప పురుషులు లేనేలేరు. ఇలాంటి ప్రత్యేకతలెన్నో మూటగట్టుకున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ఆరంభమవుతోంది. హెచ్‌ఐసీసీలో మూడ్రోజులపాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు.
ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి దాదాపు 1700 మంది ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సులో.. తమ ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని మారుస్తున్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారు. సోమవారం సాయంత్రానికే వీరిలో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్–అమెరికా ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సయుక్త సదస్సు కావటంతో ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అతిథులకు ఘనమైన ఆతిథ్యమిచ్చేందుకు రాష్ట్ర సర్కారు భాగ్యనగరాన్ని అందంగా ముస్తాబు చేసింది. నీతి ఆయోగ్ నిర్వహణ ఏర్పాట్లకు సారథ్యం వహించింది. 2010 వాషింగ్టన్‌లో తొలిసారి సదస్సు నిర్వహించిన అమెరికా... తర్వాత ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీలో నిర్వహించింది. ఎనిమిదో సదస్సుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 52.5 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే హాజరవుతుండటంతో సదస్సు ప్రపంచ మహిళా చరిత్రలో మైలురాయిగా నిలువనుంది.
వేదికపై ముగ్గురి ప్రసంగాలు
హైదరాబాద్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. అక్కణ్నుంచి నేరుగా సదస్సుకు హాజరవుతారు. ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతోపన్యాసం చేస్తారు. భారత్, అమెరికా జాతీయ పతాకాలను ఎగరేస్తారు. తర్వాత అమెరికా ప్రతినిధిగా ఇవాంకా ట్రంప్, చివరగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది ముగిసిన వెంటనే వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై ప్లీనరీ సెషన్ మొదలవుతుంది. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ మోడరేటర్‌గా వ్యవహరించే ఇందులో... ప్యానెల్ స్పీకర్లుగా ఇవాంక, ఎస్సారెస్ ఏవియేషన్, పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, స్కాండినెవియా బ్యాంక్ ఛైర్మన్ మార్కస్ వ్యాలెన్‌బర్గ్ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్ ఆన్ వర్క్‌ఫోర్స్ డెవెలప్‌మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. ప్యానెల్‌లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, డెల్ సీసీవో కరెన్ క్వింటోస్ ఉంటారు.
అమెరికా, భారత్ భారీ అంచనాలు
మహిళలు నిలదొక్కుకుని, ఆర్థిక సాధికారతను సాధిస్తే... అక్కడి సమాజాలు, ఆయా దేశాలు వృద్ధి సాధిస్తాయని చెప్పాలనేది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ దిశగా భారత్, అమెరికా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటి, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ఇప్పటికే మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం సదస్సుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. దేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు మరో మెట్టును అధిగమించేందుకు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వస్తారని ఆశాభావంతో ఉంది. ‘ది ఇండియా ఎడ్జ్‘ పేరుతో దేశంలో ప్రఖ్యాతి సాధించిన వంద స్టార్టప్ కంపెనీలకు ఈ సదస్సులో పాలుపంచుకునే అరుదైన అవకాశం కల్పించింది. ఈ స్టార్టప్‌లన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయని, దీంతో కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు భారత్ గమ్యస్థానంగా నిలుస్తుందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలను ఈ సదస్సుకు ఆహ్వానించింది. దేశ విదేశాల నుంచి 200 మంది మీడియా ప్రతినిధులు రానున్నారు.
ఇక్కడి అవకాశాలను చాటుదాం
ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా సదస్సుపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ అవకాశం భవిష్యత్తులో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు తెచ్చి పెడుతుందని, శిఖరాగ్ర సదస్సు ద్వారా ఇక్కడున్న అపారమైన వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment