సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ) వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు-2017 ప్రారంభం అయ్యింది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ-అతిథి ఇవాంక ట్రంప్ చేతుల మీదుగా రోబో మిత్రా ద్వారా సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు లోగోను ఆవిష్కరించారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే ఈ సమ్మిట్ కోసం సుమారు 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 300 మంది పెట్టుబడిదారులు హాజరయ్యారు.
అమెరికా, భారత్ నీతి ఆయోగ్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు హోదాలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ సదస్సుకు హాజరయ్యారు. నేడు, రేపు సదస్సులో పాల్గొననున్న ఇవాంక.. వ్యాపారరంగంలో మహిళలకు అవకాశాలు పెంచటం అనే అంశంపై ప్రసంగించనున్నారు. భారత్ లో స్టార్టప్స్‌కు సువర్ణావకాశంగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ 8వ సదస్సును పేర్కొంటున్నారు.
ఇక ‘ఉమెన్ ఫస్ట్’ థీమ్‌తో మహిళా శక్తికి అగ్రపీఠం వేస్తూ ఈసారి సదస్సును నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో 52 శాతం మంది మహిళా డెలిగెట్స్ పాల్గొంటుండటం విశేషం. ఉపాసన కొణిదెల, నారా బ్రహ్మిణి, సానియా మీర్జా , మంచు లక్ష్మీ, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. బ్రేక్ ఔట్లు, మాస్టర్ క్లాసులు, వర్క్ షాపులతో సమ్మిట్ సందడిగా సాగనుంది. 52 అంశాలపై చర్చ.. విశిష్ట అతిథుల అమూల్యమైన సందేశాలు... ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment