సద్వినియోగం చేసుకుందాం | let us take advantage of GES | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకుందాం

Published Tue, Nov 28 2017 1:19 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

let us take advantage of GES - Sakshi

ప్రపంచంలోని దాదాపు నూట యాభై దేశాల పారిశ్రామిక ప్రతినిధులను సాద రంగా ఆహ్వానించి, ఆత్మీయ ఆతిథ్యాన్నిచ్చి ఎనిమిదవ ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు(జీఈఎస్‌)ను విజయవంతం చేయడానికి భాగ్యనగరి సర్వసంసిద్ధమై ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటూ జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సదస్సుకు తగ్గట్టు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పకడ్బందిగా సకాలంలో సక్రమంగా పూర్తి చేయడానికి ప్రశంసనీయమైన కృషి చేసింది. అంతే కాదు, అదే సమయానికి హైదరాబాద్‌ ప్రజలకు మెట్రో రైలు సేవలను కానుకగా అందించడం విశేషం.

అమెరికా, ఇతర దేశాలలోని ప్రైవేటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు, ప్రత్యేకించి కొత్తగా ఏర్పాటుచేసే స్టార్టప్‌ సంస్థలకు పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యాలు, సమాచారం తదితరాలను సమకూర్చడానికి తోడ్పడే ధ్యేయంతో 2010 నుంచి ఈ వార్షిక సదస్సులను నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రేరణను, పెట్టుబడులకు నూతన అవకాశాలను కల్పించడానికి కొత్త ఆర్థిక వృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. దేశదేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు అమెరికా ద్రవ్య, సాంకేతిక, నైపుణ్య సంస్థలను, అనుభవజ్ఞులను ఈ సందర్భంగా కలుసుకో గలుగుతారు. తద్వారా వారి మధ్య ఆదాన ప్రదానాలకు, కొత్త భాగస్వామ్యాలకు అవకా శాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో అవ సరమైన అనుభవజ్ఞుల, నిపుణుల సలహాలు, సహాయసహకారాలు, పెట్టుబడులు సమకూరుతాయి.

హైదరాబాద్‌ నగరం పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, సంస్థలకు నెలవైన సాంకేతిక కేంద్రం. అంతే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఉబర్‌ తదితర ప్రముఖ అమెరికన్‌ సంస్థలున్న నగరం. జీఈఎస్‌కు తగిన వేదిక. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్‌లు కలసి ప్రారంభించనున్న ఈ ఏడాది సదస్సును ‘మహిళలకు ప్రథమ స్థానం, అందరికీ సౌభాగ్యం’ అనే శీర్షికతో నిర్వహిస్తుండటం విశేషం. అందుకు తగ్గట్టే సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల్లో 52 శాతానికి పైగా మహిళలే. ఈ సదస్సుకు ముందే రంగాలవారీగా దేశంలోని వివిధ నగరాల్లో సుప్రసిద్ధ అమెరికన్‌ సంస్థలు, నిపుణులు, అనుభవజ్ఞులు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో, ఆవిష్కర్తలతో గోష్టులు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు, దాదాపు రెండేళ్ల క్రితం తాను ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా కార్య క్రమానికి ఊపును ఇస్తుందని ప్రధాని మోదీ ఆశిస్తున్నారు. 1,500 మంది ప్రతి నిధులలో 400 మంది భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు. కాగా, ఇవాంకా ట్రంప్‌ నేతృత్వంలోని 400 మంది అమెరికన్‌ మదుపరులు, వ్యాపార నిపు ణుల బృందం హాజరవుతోంది. వివిధ వర్క్‌షాప్‌లు, గోష్టులు తదితర రూపాల్లో సాగే ఈ సదస్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఆవిష్కర్తలకు అమెరికా సంస్థ లతో కలసి పనిచేసే, వాటి సహాయసహకారాలను అందుకునే అవకాశాలను కల్పి స్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్యవైద్య సేవలు–జీవ విజ్ఞానశాస్త్రాలు, డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ– ద్రవ్యసాంకేతికత, విద్యుత్తు–మౌలిక సదుపాయాలు, మీడియా–వినోదం అనే నాలుగు రంగాలపైన సదస్సు దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ కార్యక్రమాన్నంతటినీ అమెరికాతో కలసి మన నీతి ఆయోగ్‌ నిర్వహిస్తోంది. మన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రత్యేకించి స్టార్టప్‌ సంస్థలు అందివచ్చిన ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిద్దాం.

లైసెన్స్‌లు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు తదితర అంశాల్లో అడ్డం కులను తొలగించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యో గితను పెంచాలనేది ఈ పథకం లక్ష్యం. దీనికి మంచి స్పందన లభించింది 4,200 రిజిస్టరయిన స్టార్టప్‌ సంస్థలతో ప్రపంచంలో మన దేశం 3వ స్థానానికి చేరింది. 2016లో స్టార్టప్‌ హబ్‌ మొదలయ్యాక స్టార్టప్‌లకు నిధులను, పన్నుల మినహాయిం పులు, రాయితీలను కల్పించడం, తదితర  సహాయ సేవలను అందిస్తోంది. స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎస్‌ఐడీబీ) స్టార్టప్‌లలో మదుపులు పెట్టడం కోసం రూ. 10,000 కోట్లను ఎనిమిది వెంచర్‌ కేపిటల్‌ ఫండ్స్‌కు కేటాయించింది. అయినా మన స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో మూణ్ణాళ్ల ముచ్చటగా ముగుస్తుండటం శోచనీయం. దీంతో ఈ పథకం ఆచరణయోగ్యతే చర్చనీయాంశంగా మారుతోంది.

మన స్టార్టప్‌లలో 90 శాతం ఐదేళ్లు తిరిగేసరికి విఫలమౌతున్నాయనే ఆందోళన కరమైన చేదు వాస్తవాన్ని ఐబీఎమ్‌ తాజా సర్వే వెల్లడించింది. మన స్టార్టప్‌లు నిధుల లభ్యత, ప్రభుత్వపరమైన అడ్డంకుల వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మాట నిజమే. కానీ మన స్టార్టప్‌ పారిశ్రామికవేత్తలు స్థానిక అవసరాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన సంస్థ లను అనుకరించడమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణమని ఐబీఎమ్‌ సహా పలు వురు నిపుణులు నిర్ధారించారు. ఉబర్‌ వంటి సంస్థలు విజయవంతం అవుతున్నా, మన స్టార్టప్‌లు నగరాల్లో తీవ్ర సమస్యగా ఉన్న రవాణా వంటి రంగాలవైపు దృష్టి సారించడం లేదు. ఆవిష్కరణ అంటేనే అంత వరకు లేని కొత్త వస్తువు, సేవ లేదా మార్కెట్‌ను కనుగొనడం. అదే కొర వడితే స్టార్టప్‌లు మూలనపడక తప్పదు. స్థానిక ప్రజల అవసరాలపై ఆధారపడిన ఆవిష్కరణలకు మార్కెట్‌ కొరత ఉండక పోవ డమే కాదు, నిపుణ శ్రామికుల కొరత ఉండదు. అవసరమైతే కొద్దిపాటి శిక్షణతో ఉపయోగించుకోగలిగిన విద్యా వంతులైన నిరుద్యోగ యువతకు కొదవ లేదు. ఈ సదస్సుకు హాజరవుతున్న పలువురి విజయగాథలు, అనుభవజ్ఞులు, నిపుణుల నుంచి మన నవ పారిశ్రామికవేత్తలు నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ఆ అంత ర్జాతీయ స్థాయి సాంకేతికతను, నైపుణ్యాలను, పెట్టుబడులను స్థానిక అవసరా లను తీర్చే ఆవిష్కరణల కోసం, స్థానిక శ్రమపై ఆధారపడగల ఉత్పత్తి పద్ధతులను పెంపొందింప చేయడం కోసం ఉపయోగించగలిగేతేనే మన స్టార్టప్‌లు విజయ వంతం అవుతాయి. అప్పుడే ఈ సదస్సుకు సార్థకత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement