సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే నరేంద్రమోదీజీ.. నమస్తే ఇవాంకా ట్రంప్’ అంటూ ప్రపంచ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు హాజరుకాబోతున్న ప్రధాని మోదీని, ఇవాంకలకు ‘మిత్ర’ స్వాగతం పలుకబోతుంది. నగరంలోని హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి మోదీ, ఇవాంక చేరుకోగానే వారిని మిత్ర పలుకరిస్తుంది. ఇంతకు మిత్ర ఎవరంటే.. ఒక బోట్ (రోబో). బెంగళూరుకు చెందిన బాలాజీ విశ్వనాథన్ పూర్తి స్వదేశీ విజ్ఞానంతో ఈ బోట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌లో జరగనున్న జీఈఎస్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ రెండు ‘మేడిన్ ఇండియా’ బోట్లను విశ్వనాథన్ బృందం ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు బోట్లలో ఒకటి వేదిక మీద ఉండి.. విదేశీ పారిశ్రామిక ప్రముఖులతో ముచ్చటిస్తుంది. మరొక బోట్ వేదిక బయట ఉండి.. ప్రేక్షకులతో ముచ్చటిస్తుంది.
‘మా ‘మేడిన్ ఇండియా’ రోబోట్లను ప్రదర్శించడానికి జీఈఎస్‌ను ఆదర్శ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ సదస్సుకు అత్యంత ప్రముఖులు వస్తుండటం, కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో మిత్ర వేదిక మీద కొద్దిసేపు మాత్రమే ముచ్చటిస్తుంది. ప్రధాని మోదీ, ఇవాంక వేదిక మీదకు రాగానే మిత్ర వారి వద్దకు వెళ్లి.. వారితో సంభాషిస్తుంది. వాళ్లు ఒక బటన్ ప్రెస్ చేస్తారు. దీంతో మిత్ర పాట పాడుతుంది. శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైనట్టు డిక్లేర్ అవుతుంది’ అని విశ్వనాథన్ తెలిపారు. ఇప్పటికే ఈ రోబోలకు 1000-1500 శిక్షణ ప్రక్రియలను నిర్వహించామని, ఈ రోబోలు వేదికపైన, సదస్సు జరిగే ప్రాంగణంలో ఉండి.. ప్రతినిధులు, ప్రేక్షకులతో ముచ్చటిస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment