సాక్షి,సిటీబ్యూరో/గచ్చిబౌలి: వందలాది మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు. వేలకొద్దీ వాహనాల రాకపోకలు ,ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఎక్కడికక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలతో నగరంలో మంగళవారం హడావిడి నెలకొంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న హెచ్‌ఐసీసీ, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ మెట్రో స్టేషన్, తదితర ప్రాంతాలు అతిథులు, సందర్శకులతో కళకళలాడాయి. మరోవైపు మిగతా నగరమంతా వెలవెలపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. నగరమంతటా ఇవాంక రాక, మెట్రో రైలు ప్రారంభోత్సవ అంశాలే చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆ దేశ సలహాదారు ఇవాంక ట్రంప్‌ను నగరానికి స్వాగతిస్తూ అక్కడక్కడా బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ బీజేపీ పలుచోట్ల ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేసింది. అతిథుల భద్రత దృష్ట్యా మోహరించిన ప్రత్యేక భద్రతా బలగాలతో రహదారులు నిండిపోయాయి. హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి నలువైపులా భారీ బందోబస్తు కనిపించింది. నిత్యం ఐటీ సంస్థల కార్యకలాపాలతో, ఐటీ నిపుణులతో సందడిగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మంగళవారం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.సైబరాబాద్‌లోని విదేశీ అతిథులు బస చేసిన 18 హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 150 దేశాలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు, అధికారులతో సందడిగా కనిపించింది.హెచ్‌ఐసీసీ ప్రాంతంలో కారు పాస్‌లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించారు. పాస్‌లు లేని వారు కాలినడకనే హెచ్‌ఐసీసీకి వెళ్లారు.
స్కూళ్లు, ఐటీ సంస్థలకు సెలవు
సదస్సు నేపథ్యంలో ప్రముఖుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు వర్క్ టూ హోమ్‌కు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద నుంచే విధులు నిర్వహించారు. మరి కొన్ని సంస్థల్లో ఉదయం 8 గంటలకే వచ్చి విధుల్లో చేరారు. మొదటి షిఫ్టు విధులను మధ్యాహ్నం 2 గంటలలోపే ముగించారు. ప్రధాని మోదీ, ఇవాంకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసుల సూచన మేరకు కొన్ని సంస్థలు సాయంత్రం విధులను రద్దు చేశాయి. అలాగే హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లు చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు ఒక్క పూటకే పరిమితమయ్యాయి. శేరిలింగంపల్లి, తదితర చోట్ల ప్రభుత్వ స్కూళ్లు మాత్రం యథావిధిగా పని చేశాయి.
దుకాణాలు బంద్ ..
జీఈఎస్ సదస్సు, ప్రధాని, ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలో న్యాక్ నుంచి హైటెక్స్ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపుల అన్ని దుకాణాలను ముసివేయించారు. హైటెక్స్ నుంచి ఫలక్‌నామా వెళ్లే మార్గంలో హైటెక్స్, చార్మినార్ మెటల్ కమాన్, కొత్తగూడ, గచ్చిబౌలి మార్గంలో కూడా దుకాణాలను మూసివేయించారు.
కనిపించని జనసంచారం
ఒకవైపు అతిథుల రాకతో హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలు కళకళలాడగా నగరంలోని మిగతా ప్రాంతాలు వెలవెలాబోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, కోఠీ, ఆబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యకలాపాలు స్తంభించాయి. జనం సైతం అవసరమైతే తప్ప రోడ్లపైకి రాలేదు. దీంతో సాధారణ ట్రాఫిక్ రద్దీకి భిన్నంగా పలు ప్రాంతాల్లో జనసంచారం సైతం చాలా తక్కువగా ఉంది.
స్తంభించిన జనజీవనం..
జీఈఎస్ ప్రతినిధులకు కేంద్రం విందు ఏర్పాటు చేసిన ఫలక్‌నుమా ప్యాలెస్ మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఎక్కడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించారు. షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు మూసి ఉంచారు. రోడ్లకు ఇరువైపులా జనం రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సాధారణ జనజీవనానికి భిన్నమైన వాతావరణం నెలకొంది.
నేడు గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: జీఈఎస్‌లో పాల్గొన్న అతిథులకు తెలంగాణ సర్కారు బుధవారం రాత్రి గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నార్సింగి, రామ్‌దేవ్‌గూడ వైపుల నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను బాపూఘాట్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ కింది భాగం, ఫతేదర్వాజా మీదుగా పంపిస్తారు. షేక్‌పేట్‌నాలా వైపు నుంచి గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాలను గోల్కొండ గోల్ఫ్ క్లబ్ నుంచి జమాలీ దర్వాజా మీదుగా పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment