మహిళతోనే మార్పు | Change with woman itself says Ivanka Trump | Sakshi
Sakshi News home page

మహిళతోనే మార్పు

Published Wed, Nov 29 2017 3:08 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Change with woman itself says Ivanka Trump - Sakshi

హైదరాబాద్, సాక్షి బిజినెస్‌ బ్యూరో :మహిళతోనే మార్పు సాధ్యమని అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ ఉద్ఘాటించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని, సమాజంపై దాని ప్రభావం ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. మహిళలు తమ సంపాదనను తిరిగి తమ కుటుంబాలు, సంబంధీకులపైనే ఇన్వెస్ట్‌ చేస్తారని పేర్కొన్నారు. ‘మహిళలకు సాధికారత కల్పించని మానవ పురోగతి అసంపూర్ణమేనని నమ్ముతున్న ప్రధాని మోదీని మనస్పూర్తిగా అభినందిస్తున్నా’ అంటూ కొనియాడారు. మంగళవారమిక్కడ ‘అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు– జీఈఎస్‌ 2017’ను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘‘తమ సొంత పరిశ్రమ, పనితనంతో భారతీయులు 13 కోట్ల మందికిపైగా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తెచ్చారు. ఇది చరిత్రాత్మకం. మోదీ సారథ్యంలో ఇది మరింత ముందుకెళుతుందని ఆశిస్తున్నా. 2030 నాటికి 50 కోట్ల మంది మధ్య తరగతికి చేరాలన్న లక్ష్యానికి తగ్గట్టు భారతదేశమంతటా కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంజనీర్లు ఆధునిక అద్భుతాలు సృష్టిస్తున్నారు. భారతీయ అంతరిక్ష నౌకలు చంద్రుణ్ణి, అంగారకుడిని చేరుతున్నాయి. అందుకే భారతీయులు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఉద్వేగంగా అన్నారు.

అందుకే.. మీరు పారిశ్రామికవేత్తలు
‘‘మీరొక ఆలోచనతో ఆరంభిస్తారు. తదుపరి రోబోను సృష్టించడానికో, మరో యాప్‌ను ఆవిష్కరించడానికో, మరో మందు కనిపెట్టడానికో రేయింబవళ్లు పనిచేస్తారు. ఆ సమయంలో కొందరు మిమ్మల్ని భయపెడతారు. మీరు అతిపెద్ద రిస్కు తీసుకుంటున్నారని, దానివల్ల వచ్చే లాభం మాత్రం చిన్నదని చెబుతారు. కానీ మీరు వైఫల్యానికి భయపడరు. మీ భవిష్యత్తును మీరు సొంతం చేసుకోవాలనుకుంటారు. అందుకే మీరు ఈ రోజు ఇక్కడున్నారు. అందుకే మీ అందరికీ నా శుభాభినందనలు’’ అని ఇవాంకా వివరించారు. భారత్‌లో పని విషయంలో మగ– ఆడ మధ్య తారతమ్యాలు లేకుండా సమానత్వం వస్తే వచ్చే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 150 బిలియన్‌ డాలర్ల మేర పెరుగుతుందని అంచనా వేశారు.

తొలిసారి.. మహిళల మెజారిటీ
‘మహిళకు ప్రాధాన్యం.. అందరికీ పురోగతి’ పేరిట ఇక్కడ జరుగుతున్న సదస్సులో 1,500 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని, తొలిసారి మహిళలు మెజారిటీ సంఖ్యలో హాజరవటం ఇదే తొలిసారి అని ఇవాంక అన్నారు. ‘‘పురుషుల ఆధి పత్యం ఉన్న పరిశ్రమలో నేను గతంలో పారిశ్రామికవేత్తగా, ఎగ్జిక్యూటివ్‌గా దగ్గర్నుంచి అన్నీ చూశా. పనిలో తమను తాము నిరూపించు కోవాలంటే మహిళలు మగవారి కన్నా ఎక్కువ పనిచేయాలి. మా నాన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక నేను మహిళలతో సహా అమెరికన్ల కోసం పనిచేసే అవకాశం వచ్చింది. అందుకే వ్యాపారాల్ని వదిలిపెట్టా. మహిళలు తమ కుటుంబాలకు ప్రాధాన్యమిస్తూనే కెరీర్‌ను కూడా చూసు కునేలా మేం పాలసీలు రూపొందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2014–16 మధ్య మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10% పెరిగింది. అమెరికాలో మహిళలు నడిపించే సంస్థల సంఖ్య 45% పెరిగింది. ఇంకా చెప్పాలంటే వాటిలో 8–10% మైనారిటీ మహిళలవే’’ అని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 1.1 కోట్ల మందికిపైగా మహిళలకు సొంత వ్యాపారాలున్నా యని, వారు 90 లక్షల మందికి పని కల్పించారని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామిక వేత్తలు, మగవారి మధ్య సమానత్వం వస్తే జీడీపీ 2% పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహిళలు ఇప్పటికీ పరిశ్రమలు ఆరంభించడానికి, నిధులు పొందటానికి నానా తిప్పలూ పడుతున్నారని అంగీకరించారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 70% మహిళలు చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలే నడుపుతున్నారు. వారికి నిధుల్లేవు. హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ ప్రకారం అమెరికాలోనూ చిత్రమైన పద్ధతి నడుస్తోంది. ఇన్వెస్టర్లు మగవారికైతే వారెలా లాభపడతారో చెబుతున్నారు. మహిళలకైతే వారెలా నష్టపోతారో వివరిస్తున్నారు. అందుకే గతేడాది ఫండింగ్‌లో మహిళలకు 3% మాత్రమే దక్కింది’’ అని వివరించారు.

మార్పు అంటే... ప్రధాని, హైదరాబాద్‌
టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్రమోదీ.. మార్పు సాధ్యమేనని నిరూపించారని ఇవాంక అన్నారు. హైదరాబాద్‌ అధునాతన టెక్నాలజీని సంతరించుకుందని, ఇప్పుడిక్కడి టెక్నాలజీ కేంద్రాలు సిటీకి మారుపేరైన బిర్యానీని కూడా మరిపిస్తున్నాయని చమత్కరించారు. ‘‘మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇక్కడే చదివారు. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని టి–హబ్‌ వచ్చే ఏడాది కొత్త కేంద్రాన్ని ఆరంభిస్తోంది. ఈ ముత్యాల నగరానికి గొప్ప నిధి ఇక్కడి ప్రజలే. తమ ఆశలు, ఆకాంక్షల్ని ఎన్నడూ వదిలిపెట్టకుండా మెరుగైన భవిష్యత్తు కోసం శ్రమించే స్వాప్నికులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఉన్నారిక్కడ. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామికవేత్తల విప్లవం కొనసాగుతోంది. ఇక్కడే కాదు.. అమెరికాలో, మొత్తం ప్రపంచమంతటా ఇదే ఉంది. అందుకే ఈ ఉత్సవాలు. పారిశ్రామికవేత్తలిప్పుడు నియమాల్ని తిరగరాస్తున్నారు. వారు ఆరంభించిన ప్రాజెక్టులు, నిర్మించిన వ్యాపారాలు సమాజాల్ని ముందుకు నడిపిస్తున్నాయి’’ అని అన్నారు.

చట్టాలు ఇంకా మారాలి..
మహిళలు, పురుషుల విషయంలో చట్టాలు ఒకేలా లేవని ఇవాంక పేర్కొన్నారు. ఈ విష యంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చాలా వరకూ మార్పులు చేశాయని, అయినా ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నారు. ‘‘కొన్ని దేశాల్లో మహిళలు భర్తల అనుమతి లేకుండా పనిచేయలేరు.  మహిళలు బయట పనిచేసేందుకు వారి కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డొస్తున్నాయి’’ అని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక సహకారం (వెఫి) పేరిట ప్రపంచ బ్యాంకుతో కలిసి ఈ ఏడాది బిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ఇవాంక తెలిపారు. గడిచిన దశాబ్దంలో యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement