కేసీఆర్తో ఏకాంతంగా మాట్లాడిన మోదీ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీలో జరిగిన డీజీపీ, ఐజీపీల సదస్సులో శనివారం మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 26/11 ముంబై దాడులను ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. పోలీసులు తీవ్రవాదులతో ధ్యైర్యంగా పోరాడారని కొనియాడారు. అలాగే విధి నిర్వహణలో 33,000 మందికి పైగా పోలీసులు అమరులైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
డీజీపీ, ఐజీపీలతో సదస్సు వినూత్నంగా జరిగిందని తెలిపిన మోదీ.. ఇక్కడ చర్చించిన విషయాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్ పెంపుందించుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే మానవ ప్రవర్తన, సైకాలజీలకు సంబంధించిన విషయాలు ట్రైనింగ్‌లో భాగం కావాలన్నారు. పోలీసులకు నాయకత్వ లక్షణాలు ముఖ్యన్నారు. 'ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్' మొబైల్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. అలాగే.. ఇంటలిజెన్స్ బ్యూరోలో అత్యుత్తమ సేవలందించిన వారికి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను మోదీ అందజేశారు.
రెండు రోజుల పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు సీఎంతోపాటు గవర్నర్, మంత్రులు, డీజీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, గవర్నర్‌లతో మోదీ కాసేపు ఏకాంతంగా మాట్లాడారు.