సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : మాటలు కోటలు దాటతాయి గానీ చేతలు గడప కూడా దాటవన్నట్లుంది రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఈ దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించినా కేంద్రం మాత్రం వీటికి పైసా విదిల్చడం లేదు. పురోగతిలో ఉన్న ఈ ప్రాజెక్టు, పథకాల అమలుకు కేంద్ర సాయం కోసం ఎదురుచూసి విసుగెత్తిన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు దృష్టి సారించింది. ఆ దిశగా అవసరమైన వనరు లను గుర్తించే పనిలో పడింది. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు తగిన ఆర్థిక సహాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రం కోరినట్లుగా తగినన్ని నిధులు కేటాయిస్తే మిగతా ప్రాజెక్టులకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.30 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.15 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అయ్యే ఖర్చు దీనికి అదనం. వీటితో పాటు చిన్నా చితకా ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు అవసరం. ప్రాజెక్టులు, పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణం పొందింది. దీంతో మళ్లీ రుణానికి వెళ్లడం కంటే సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది.
భూముల వేలం ద్వారా రూ.10 వేల కోట్లు!
ఈ ఏడాది ప్రాజెక్టులు, ఇతరత్రా పనులు చేపట్టడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను భూములను వేలం వేయడం ద్వారా రాబట్టుకోవాలని భావిస్తోంది. కోకాపేటలో హెచ్‌ఎండీఏకు ఉన్న 140 ఎకరాలు, రాయదుర్గంలో టీఎస్‌ఐఐసీకి ఉన్న 180 ఎకరాలను వేలం వేస్తే రూ.10 వేల కోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కోకాపేట, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు రాజధానిలో అత్యంత విలువైన ప్రాంతాలు. వేలం వేస్తే ఎకరాకు కనిష్టంగా రూ.30 కోట్లు గరిష్టంగా రూ.40 కోట్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ భూములు వేలం వేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తాయని తద్వారా ప్రభుత్వానికి వచ్చేఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని భూమి బ్యాంక్‌లుగా నిర్ధారించింది. ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన వాటిని అభివృద్ధి చేసి పారిశ్రామిక, గృహ అవసరాలకు వినియోగించాలని నిర్ణయంతీసుకుంది.
కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి
కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించనే లేదు. మూడేళ్లుగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. కేంద్రం పట్టించుకోకపోయినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని బ్యాంక్‌ల కన్సార్టియం ద్వారా నిధులు సేకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.80 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇటీవలే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తి స్థాయిలో నీటిని తోడటం ప్రారంభిస్తే తెలంగాణలోని సగం జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు పట్ల కేంద్రం స్పందించిన తీరు పూర్తి నిరాశజనకంగా ఉందని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
నీతి అయోగ్ సిఫారసు చేసినా..
మిషన్ భగీరథ బాగుందని ప్రశంసించిన నీతి అయోగ్ ఈ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు దోహదపడేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు కూడా రూ. ఐదు వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే, కేంద్రం మాత్రం ఇప్పటివరకూ ఈ పథకాలకు గానీ, ప్రాజెక్టులకు గానీ పైసా విదల్చలేదు. నీతి అయోగ్ సిఫారసు చేసినా రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులు, పథకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
మా ప్రయత్నం మేం చేస్తున్నాం
‘‘మేం ప్రాజెక్టులు చేపడుతున్నాం, వాటిని పూర్తి చేసేందుకు త్రికరణశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. కేంద్రం తగిన తోడ్పాటు అందిస్తే బాగుండేది. అయినా మేము ఎక్కడా వెనకడుగు వేయకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం’’–టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment