వీడిన మంకుపట్టు!
Published Mon, Feb 27 2017 2:09 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
► సాక్షి కథనానికి స్పందించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్
► వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
► నట్లు, బోల్టులు సమకూర్చిన అధికారులు
► శరవేగంగా సాగుతున్న నెల రోజులుగా నిలిచిన పనులు
నారాయణపేట : ఎల్‌అండ్‌టీ, మిషన్ భగీరథ అధికారులు మంకుపట్టు వీడారు. నెల రోజులుగా నిలిచిన సమస్యకు పరిష్కారం లభించింది. కలెక్టర్ ఆదేశాలకు ముందు అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... మిషన్ భగీరథ పథకం కింద పైప్‌లైన్ వేసేందుకు రోడ్డుమార్గన కాలువ తవ్వకాలు చేస్తుండగా సత్యసాయి పైప్‌లైన్ పలుప్రాంతాల్లో ధ్వంసమైంది. దీంతో నెలరోజులగా మంచినీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో తమకు సామాగ్రిని అందించాలని కోరడంతో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎల్‌అండ్‌టీ నిర్వాహకులకు దాదాపు 10వేల విలువ చేసే సామాగ్రిని అందించారు. కానీ పైప్‌లైన్ జాయింట్ వేసే దగ్గర బిగించే నట్, బోల్ట్‌లను అందించలేదు. ఆ కాస్త మీరు తెచ్చుకోలేరా అని ఒకరిపై ఒకరు వేసుకుంటూ నెలరోజులు ఎవరికి వారు మొండిగా వ్యవహరించారు. దీంతో మరమ్మతుల్లో జాప్యం నెలకొంది. ఈ పరిస్థితితో నీటిసమస్య తీవ్రమై ఆయా గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోయారు.
ప్రత్యామ్నాయం లేకపోవడంతో సమస్యను సాక్షి దృష్టికి తెచ్చారు. ఈ మేరకు నట్టు, బోల్టులపై మంకుపట్టు! శీర్షికన శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్ రోనాల్డ్‌రోస్ స్పందించారు. ఇటు మిషన్ భగీరథ, అటు సత్యసాయి యంత్రాంగాన్ని కదిలించారు. అసలే ఎండకాలం.. అందులో నీటిసమస్య తీవ్రంగా ఉంది. నీటిని ప్రజలకు అందించే విషయంలో చిన్నపాటి సమస్యను పరిష్కరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ఆశాఖ అధికారులు వెంటనే సత్యసాయి, మిషన్‌భగీరథ అధికారులతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో పైప్‌లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేపట్టారు. సింగారం చౌరస్తా నుంచి అప్పక్‌పల్లి వరకు 8 లీకేజీలకు సంబంధించి జాయింట్ వేసేందుకు పూర్తి సామాగ్రిని మిషన్ భగీరథ అధికారులు అందజేశారు. అలాగే రెండు పైపులు ధ్వంసం కావడంతో వాటి స్థానంలో నూతన పైపులను వేసి జాయింట్ వేసినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. అప్పక్‌పల్లి లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు చేపట్టి శనివారం రాత్రి ట్రయల్‌రన్ చేశారు.
అయితే జాజాపూర్ హనుమాన్ మందిర్ దగ్గరలో మరో లీకేజీ బయటపడింది. దీంతో ఆ పైప్‌లైన్ పూర్తిచేసే పనిలో సత్యసాయి సిబ్బంది నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో శాసన్‌పల్లి, పేరపళ్ల, జాజాపూర్, అప్పక్‌పల్లి, సింగారం గ్రామాలకు తాగునీరు అందనుందని సత్యసాయి అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సాక్షికి ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ఆయాగ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement