
ముంచెత్తిన వాన
నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో కుండపోత
- నీటమునిగిన పంటపొలాలు... తెగిన కల్వర్టులు.. రాకపోకలు బంద్
- లోతట్టు ప్రాంతాలు జలమయం.. జలదిగ్బంధంలో పలు కాలనీలు
నల్లగొండ/మహబూబ్‌నగర్: అల్పపీడన ప్రభావంతో మంగళవారం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా హుజూ ర్‌నగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, హాలియా నియోజకవర్గాల్లో పంట పొలాలు నీటమునిగాయి. హుజూర్‌నగర్‌లో 180 మి.మీటర్ల వర్షం కురవడంతో ఆవాస కాలనీలు, కోదాడ రోడ్డులోని దద్దనాల చెరువు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో ఉన్న పాలేరు వాగు, మూసీ నదిలోకి భారీగా వరదనీరు చేరింది. వర్షాలకు కల్వర్టులు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆలగడప సమీపంలో మూసీనదిలో మిషన్‌భగీరథకు సంబంధించిన రూ.30 లక్షల విలువైన మెటీరియల్ కొట్టుకుపోయి పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, పులిచింతల మునకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేళ్లచెర్వు మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ చేయడంతోపాటు మంగళవారం తెల్లవారు జామునుంచి కురిసిన భారీ వర్షానికి పులిచింతల జలాశయంలో ఉదయం వరకు ఉన్న 9 టీఎంసీలు నీటి నిల్వ.. మధ్యాహ్నం ఇన్‌ఫ్లో పెరగడంతో 10 టీఎంసీలకు చేరింది. దీంతో మునక గ్రామాలైన నెమలిపురి, వెల్లటూరు, అడ్లూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేయించేసేలా ప్రజలను రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారులు ఒప్పించారు.
తమకు రావాల్సిన ప్యాకేజీ రాలేదని అది ఇస్తేనే ఖాళీ చేస్తామని కొందరు గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం ఖాళీ చేయించేందుకు ప్రజలను ఒప్పించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. లింగాల మండలం దారారం చీకటి చెరువు, రాయవరం దావకుంట, పెద్దకుంట, దారారం సమీపంలో ఊరకుంటలు అలుగులు పారుతున్నాయి. బిజినేపల్లి శివారులోని నల్లవాగు పొంగింది. కొల్లాపూర్ మండలం రామాపురం వాగు తెగిపోవడంతో కొల్లాపూర్-పెబ్బేరుకు రాకపోకలు బంద్ అయ్యాయి.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మునగాల/ చిలుకూరు: నల్లగొండ జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మునగాల మండలం నేలమర్రికి చెందిన రాంపంగు బాలకృష్ణ(27), చిలుకూరు మండలం రామాపురానికి చెందిన మీసాల వీరబాబు (34), ఇదే గ్రామానికి చెందిన బారు భిక్షంలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు.
కొల్లాపూర్‌లో 16 సెం.మీ. కుండపోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో అత్యధికంగా 16 సెం.మీ. వర్షం కురవగా, నాగర్‌కర్నూలులో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, మక్తల్‌లలో 7 సెం.మీ., తిమ్మాపూర్, మధిరల్లో 5 సెం.మీ., చెన్నూరు, అశ్వారావుపేట, తిమ్మాజీపేటలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో 3 సెం.మీ., రామన్నపేటలో 2 సెం.మీ., మిర్యాలగూడలో 1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.