32టీఎంసీల నీటి నిల్వతో పులిచింతల ప్రాజెక్టు
శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల నుంచి 33,650 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ తెలంగాణ 12,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తోంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 6.890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కాగా, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 13.10 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 874.30 అడుగులకు చేరుకుంది.
పులిచింతలకూ వరద ప్రవాహం..
మరోవైపు నాగార్జునసాగర్ దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో అధికంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోందని ఏఈ రాజశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 61,628 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ పనులు జరుగుతున్నందున 53 మీటర్ల లోతు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 50 మీటర్లకు మించి నీరు నిల్వ ఉంచే అవకాశం లేదన్నారు. అందువల్ల ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.5871 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలంటే పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇందుకు మరో 20 రోజులు పడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment