మిషన్ భగీరథకు ‘బోర్డెక్స్’ సాంకేతికత!
నీటి నిర్వహణకు బోర్డెక్స్ సహకారం తీసుకుంటామన్న ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నిర్వహణకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ మెట్రోపాలిటన్ యంత్రాంగం అంగీకరించిందని రాష్ట్ర తాగునీటి సరఫరా కార్పొరేషన్ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రశాంత్‌రెడ్డి.. గురువారం బోర్డెక్స్ మెట్రోపాలిటన్ అధికారులు, సాంకేతిక సంస్థల ప్రతి నిధులతో సమావేశమయ్యారు.
అంతకుముందు మెట్రోపాలిటన్ నిర్వహించే మురు గునీటి శుద్ధి కేంద్రం, వరదనీటి మానిటరింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ మురుగునీటి శుద్ధికేంద్రం నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి, దాని నుంచి విద్యుదుత్పత్తి జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. నగరం మధ్యలో ఉన్నా కూడా ఎలాంటి దుర్గంధం రాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యవస్థను మూసీ నది శుద్ధిలో ఉపయోగించే అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్తానని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.