
రేగోడ్ (మెదక్): రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయలేని సీఎం కేసీఆర్, మిషన్ భగీరథ పథకానికి మాత్రం రూ.50 వేల కోట్ల అప్పు చేశారని కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ నుంచి సుమారు యాభైమంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మిషన్ భగీరథకు అంత అప్పు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఈ పథకం పైపుల కొనుగోళ్లలో ఎంత కమీషన్ ముట్టిందని నిలదీశారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని ప్రజలు ఎన్నో కలలుకన్నారని, అయితే వాటన్నిటినీ కేసీఆర్ కాల రాశారని అన్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని దామోదర మండిపడ్డారు. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే ఉంటుందని తెలిపారు. సిం గూరు నుంచి ఎన్నడూ జరగని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం 16 టీఎంసీల నీళ్లను అక్రమంగా తరలించిందని అన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు లక్ష ఎకరాల్లో నష్టం జరిగిందని తెలిపారు.