సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్ విభాగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విజిలెన్స్ పనితీరుపై అసంతృప్తితో ఉంది. పలు కేసుల్లో అధికారులు తప్పుడు నివేదికలిచ్చారని ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వ విభాగాల్లో అంతర్గత విచారణలు, ప్రాజెక్టులు, పథకాల అమల్లో ఉన్న లొసుగులపై ఎప్పటికప్పుడు నివేదికివ్వాల్సిన విజిలెన్స్ విభాగం అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగేళ్లు కుడా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేసిన ప్రధాన దర్యాప్తుల్లో ఏ ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ పనితీరులో డొల్లతనం ఉందా? లేక విజిలెన్స్ పంపిన నివేదికలపై చర్యలకు ప్రభుత్వంలో జాప్యం జరుగుతోందా.. అన్న విషయాలపై సందిగ్థత నెలకొంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే నివేదికివ్వాలని విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతి లేదని పేర్కొంటూ తప్పుడు నివేదికలు పంపించినట్టు తెలిసింది. దీనితో ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో నాణ్యతాలోపాలు తదితర అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే అందులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారని విచారణలో బయటపడింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు, మిల్లర్ల అక్రమాలు, ఎరువులు, విత్తనాల కంపెనీలు, డీలర్ల మోసాలపై తప్పుడు నివేదికలు పంపించారని ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన జాయింట్ వెంచర్లు, నిర్మాణాలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు భూముల అమ్మకాలు జరిపిన వ్యవహారంపై నివేదికిస్తే ఇప్పటికీ కమిషన్ గానీ, ప్రభుత్వంగానీ చర్యలు తీసుకోలేదని విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 8 ప్రధాన వ్యవహారాల్లో నివేదికిచ్చినా.. ఎందుకు స్పందించరంటూ అంతర్గతంగా ఎదురుదాడికి సైతం దిగినట్టు తెలుస్తోంది.
నిజాలు బయటపెట్టిన ఏసీబీ...
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పోస్టింగ్ కోసం కొంతమంది అధికారులు కొద్దిరోజుల క్రితం జరిగిన బదిలీల్లో లక్షలు ఖర్చు పెట్టినట్టు ఏసీబీ విచారణలో బయటపడింది. ఇటీవలి దాడుల్లో ఓ మిల్లర్ నుంచే రూ.లక్ష లంచం తీసుకున్నట్టు గుర్తించారు. రైసుమిల్లులు, ఫర్టిలైజర్లు, విత్తన కంపెనీలు, రేషన్ బియ్యం, కల్తీ, అక్రమ వ్యాపారాల్లో ప్రతి దాంట్లో కమీషన్ పద్ధతిలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. విజిలెన్స్ విభాగాన్ని ఎత్తేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక తరహాలో అవినీతి నిరోధక శాఖలోనే విజిలెన్స్‌ను విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని హోంశాఖ, ఏసీబీ అధికారులను ఆదేశించినట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఏసీబీలోనే మరో యూనిట్ విజిలెన్స్ వింగ్‌గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ సీనియర్ ఐపీఎస్ ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.
‘విజిలెన్స్’పై సర్కారు గుర్రు
Published Tue, Jun 5 2018 2:18 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment