మా విభాగాన్ని రద్దు చేయండి | Vigilance Department Proposal to the government | Sakshi
Sakshi News home page

మా విభాగాన్ని రద్దు చేయండి

Published Wed, Feb 8 2017 3:25 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Vigilance Department Proposal to the government

  • సర్కారుకు విజిలెన్స్‌ ఉన్నతాధికారుల ప్రతిపాదన
  • కర్ణాటక తరహాలో ఏసీబీలోనే విజిలెన్స్‌ విభాగం ఏర్పాటుకు  ప్రభుత్వం మొగ్గు  
  • సాక్షి, హైదరాబాద్‌: అవినీతిపై నిరంతరం యద్ధంచేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను కాపాడాల్సిన విజిలెన్స్‌ శాఖలోనే అవినీతి రాజ్యమేలడం ఆ విభాగ ఉన్నతాధి కారులను కలవరంలో పడేసింది. నిఘా, అమలు పటిష్టంగా పాటించాల్సిన అక్కడి అధికారులే ఏసీబీకి పట్టుబడటం ప్రభుత్వ పెద్దలను ఆగ్రహానికి గురిచేసింది. తమ విభాగంలోని అవినీతి అధికారుల ఆగడాల నేపథ్యంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రద్దు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం సంచలనం రేపుతోంది.

    ప్రతిష్టాత్మక విచారణల్లో డొల్లతనం
    మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనుల్లో అవినీతి, అక్రమాలపై నివేదికివ్వాలని ప్రభు త్వం ఆదేశిస్తే.. కాంట్రాక్టర్లతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులే కుమ్మక్కై కమీష న్లు వసూలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో నాణ్యత లోపాలపై విచారణ కు ఆదేశిస్తే అందులోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారని బయటపడింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు రీజియన్లున్నాయి. ఒక్కో రీజియన్‌కు ఏటా రూ.60 కోట్లకు పైగా జరిమానా వసూలు టార్గెట్‌ పెట్టడమే అవినీతికి ప్రధాన కారణమవుతోందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

    నిజాలు బయటపెట్టిన ఏసీబీ...
    విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ఆర్‌వీవోలుగా పోస్టింగ్స్‌ పొందేందుకు కొంతమంది అధికారులు లక్షలు ఖర్చుపెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఏకంగా ఒక్క మిల్లర్‌ నుంచే రూ.లక్ష లంచం వచ్చినట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో రైసుమిల్లులు, ఫర్టిలైజర్లు, సీడ్స్‌ కంపెనీలు, రేషన్‌ బియ్యం మాఫియా, కల్తీ మాఫియా, చెక్‌పోస్టులు.. ఇలా ప్రతీ దాంట్లో విజిలెన్స్‌ సిబ్బంది కమీషన్‌ పద్ధతిలో వసూలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించారు. ఏళ్ల పాటు విజిలెన్స్‌లో పాతుకుపోయిన అధికారులు వ్యవస్థను భ్రష్టు పట్టించారని నివేదించారు. విజిలెన్స్‌ విభాగం అవినీతిని తట్టుకోలేకే సివిల్‌ సప్లై ఉన్నతాధికారులు గతంలోలా తమ విభాగంలోనే ఇటీవల ప్రత్యేకంగా మళ్లీ విజిలెన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

    కర్ణాటక తరహాలో మేలు
    ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో నిఘా, అమలు విధానాన్ని కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లోని ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విజిలెన్స్‌ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కీలక భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement