ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి లేదు | Do not ACB official notices | Sakshi
Sakshi News home page

ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి లేదు

Published Wed, Jun 17 2015 1:45 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి లేదు - Sakshi

ఆ అధికారం తెలంగాణ ఏసీబీకి లేదు

 ఏపీ మంత్రులు ప్రత్తిపాటి, రావెల, అచ్చెన్నాయుడు
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే ఆధారాలను బహిర్గతం చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కె.అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్రంలో మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కలిపి 87 కేసులు నమోదయ్యాయని, ఆ కేసుల విచారణకు సీఐడీ చీఫ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు విభాగం(సిట్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విభాగం తనకు నోటీసులు జారీ చేస్తుందనే సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు మంగళవారం తన నివాసంలో ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.
 
 అనంతరం సచివాలయానికి చేరుకుని అందుబాటులో ఉన్న మంత్రులు యనమల, ప్రత్తిపాటి, అచ్చెన్నాయుడు, రావెల, గంటా, నారాయణ, మృణాళిని, పరిటాల సునీత, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, సీఎస్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, నిఘా విభాగం అదనపు డీజీపీ అనురాధలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ప్రత్తిపాటి, అచ్చెన్నాయుడు, రావెల విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఓటుకు నోటు కేసుపై ఎన్నికల కమిషన్‌కు మాత్రమే విచారణ చేసే అధికారం ఉందని చెప్పారు.
 
  కేసు విచారణ చేసే అధికారం లేని ఏసీబీ విభాగం చంద్రబాబుకు ఎలా నోటీసులు జారీ చేస్తుందని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో విచక్షణాధికారాలను వినియోగించుకుని శాంతిభద్రతలను పరిరక్షించడంలో గవర్నర్ పూర్తిగా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రులకు భద్రత కల్పించ డానికి హైదరాబాద్‌లో ఏపీ పోలీసుస్టేషన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement