
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో రక్షిత తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ‘అర్బన్ మిషన్ భగీరథ’ప్రాజెక్టు పనులను వచ్చే ఆగస్టులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో పైపు లైన్ల కోసం తవ్వుతున్న రహదారులను పూడ్చేయాలని చెప్పా రు. మంగళవారం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జరిపిన మంత్రి.. పట్టణాల వారీగా పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనేక పట్టణాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా పనులు పూర్తి చేస్తామని మంత్రికి కాంట్రాక్టర్లు తెలిపారు. సివిల్ (నిర్మాణ) పనులు కొలిక్కి వచ్చాయని, వర్షాలు ఆరంభమైనా ఆటంకాలు ఉండకపోవచ్చని చెప్పారు. వచ్చే ఆగస్టు నాటికి పైపు లైన్ల నిర్మాణం పూర్తవుతుందని, పనులు ఆలస్యమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
కొత్త పురపాలికలకు సిబ్బంది
ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెరిగిన మున్సిపాలిటీలు, పట్టణాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన మేరకు సిబ్బందిని అనుమతించాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించారు. టీయూఎఫ్‌ఐడీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో పట్టణాల్లో చేపట్టనున్న పనుల డీపీఆర్‌లను మంత్రి పరిశీలించారు.
ఆ పనులకు సంబంధించిన టెండర్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇందుకు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఆదేశించారు. ప్రత్యేక నిధులతో చేపట్టే కార్యక్రమాలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని టెండర్లలో గడువు విధించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటవనున్న పురపాలికల్లో మౌలిక వసతులు, మానవ వనరులను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment