ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’ | Mission Bhagiratha Drinking Water Telangana | Sakshi
Sakshi News home page

ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’

Published Mon, Oct 17 2016 12:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’ - Sakshi

ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’

‘మిషన్’పై సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించే కార్యక్రమం ఎస్సీ కాలనీల నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దళిత వాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు సహా ప్రతి ఇంటికీ తప్పక నీరు చేరేలా చూడాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని, అందువల్ల మంచినీటి పథకం వారితోనే ప్రారంభం కావాలన్నారు. ఆ తర్వాతే మిగతా ఇళ్లకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. 2017 డిసెంబర్ నాటికి  అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా జలాలు సరఫరా అయ్యేలా పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నీటిని అందించాలన్నారు.

నల్లాల బిగింపు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యచరణతో పనులు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్డీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సీఈ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు, మోటర్ల ఫిట్టింగ్ తదితర పనులన్నీ 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి పర్యటనలు...
అన్ని జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది అయినందున మంత్రులు, కలెక్టర్లు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. రైల్వే క్రాసింగ్‌లు దాటుకుని, అటవీ అనుమతులు సాధించి, ప్రైవేటు భూముల యజమానులను ఒప్పించి రికార్డు సమయంలో పైపులైన్లు నిర్మించడాన్ని దేశమంతా గుర్తించి అభినందిస్తుందని సీఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు జరగాలని, ఎక్కడైనా పనులు నెమ్మదిగా సాగితే వెంటనే వర్కింగ్ ఏజెన్సీతో మాట్లాడాలని సూచించారు.

అవసరమైన విద్యుత్‌ను నిరంతరంగా అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పది శాతం నీటిని తాగునీటికి రిజర్వ్ చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని, ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లోనూ కొంత కేటాయిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో పనులు చేసిన ఏజెంట్లకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే విధానం కూడా ఉన్నందున దాన్ని వినియోగించుకోవాలన్నారు.
 

బీహెచ్‌ఈఎల్ ద్వారా కొనుగోళ్లు...
మిషన్ భగీరథకు అవసరమయ్యే ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద ఎత్తున మోటర్లు, పంపింగ్ సామగ్రి అవసరమున్నందున బీహెచ్‌ఈఎల్ ద్వారానే వాటిని సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో బీహెచ్‌ఈఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్ భగీరథలోనూ అలాగే జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థతో పని వల్ల అనవసర రాద్ధాంతాలేవీ ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు. బీహెచ్‌ఈఎల్ సీఎండీ అతుల్ సోమ్టితో సీఎం ఫోన్లో మాట్లాడారు. మిషన్ భగీరథ కోసం 50 హెచ్‌పీ నుంచి 1000 హెచ్‌పీల వరకు మోటర్లు కావాలని, వాటిని సమకూర్చాలన్నారు. దీనిపై ప్రభుత్వాధికారులు, బీహెచ్‌ఈఎల్ ప్రతినిధులు త్వరలో సమావేశమై స్పష్టమైన అవగాహనకు రావాలని సీఎం ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement