
సాక్షి, వికారాబాద్: మిషన్ భగీరథ పథకంలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అధికారులు. తాజాగా బిల్లులు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని తాండూరులో మంగళవారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువయ్య మిషన్ భగీరథ కాంట్రాక్టర్. అతనికి రూ.20 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది.
అందుకోసం నెలరోజులుగా డబ్ల్యూఎస్‌డీఈ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లులు చెల్లించడానికి ముందు తమ జేబులు తడపాలని శ్రీనివాస్ కోరాడు. రూ.30 వేలు ముట్టచెపితేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ డీఈ శ్రీనివాస్‌కు రూ.30 వేలు డబ్బులు ఇవ్వబోయాడు. అతను వారించి వర్కింగ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని సూచించడంతో అతనికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment