ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకంలో భాగంగా తొలిసారిగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేస్తోంది. జాతరలోని ప్రధాన ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా నీటిని అందించనుంది.
రోజుకు 20 లక్షల లీటర్లు
దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే వారం రోజులపాటు రోజుకు 20 లక్షల లీటర్ల చొప్పున తాగునీటిని అందించనున్నారు. ఇందుకుగాను ఇంగ్లిష్ మీడియం పాఠశాల వెనుకాల 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. నీటిని భక్తులు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు క్యూలైన్లు, చిలుకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగువంటి ప్రధాన ప్రాంతాల్లో నల్లాల ద్వార సరఫరా చేయనున్నారు. దీంతోపాటు ఆలయం లోపలి భాగంలో ఉన్న క్యూలైన్లలో 50 డ్రమ్ములను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చనున్నారు. ఇందుకుగాను ఈ కూడళ్లను కలిపి 6 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్న సరఫరా చేసే నీటిని భక్తులు తాగునీటికి కాకుండా అన్ని రకాల అవసరాలకు వినియోగిస్తే పరిస్థితి ఏమిటని అధికారులు పునరాలోచిస్తున్నారు.
నేడు ట్రయల్ రన్
మిషన్ భగీరథ పథకంలో భాగంగా వాజేడు మండలం పూసూరు వద్ద మెయిన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నీళ్లను రొయ్యూరు సమీపంలో ట్యాంకుకు మళ్లిస్తారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అందిస్తారు. అయితే మిగతా మండలాలు కాకుండా ప్రస్తుతం కేవలం మేడారం జాతరకు వచ్చే భక్తులకు నీళ్లను అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నీళ్లను ఇతర పాయింట్లకు వెళ్లకుండ రొయ్యూరు నుంచి చిన్నబోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారానికి మళ్లించనున్నారు. ఇందుకోసం అధికారులు గురువారం పూసూరు మెయిన్ పాయింట్ నుంచి ట్రయల్‌రన్ చేయడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మేడారానికి నీరందేలా చేసి 25వ తేదీలోపు జాతర పరిసరాల్లో ట్రయల్ రన్ చేయాలని భావిస్తున్నారు. మహాజాతర 31న ప్రారంభం కానున్న దృష్ట్యా లోపాలను ముందే సవరించుకోవాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment