
'చంద్రబాబుకు మోదీ లాలీపప్ ఇచ్చారు'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..స్పెషల్ కేటగిరీ ఇవ్వలేం కాబట్టి పోలవరాన్ని మీరే నిర్మించుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ లాలీపాప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. పోలవరంతో ముంపునకు గురయ్యేవి గిరిజన గ్రామాలే కావున ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు భూసేకరణ- 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు.
మల్లన్నసాగర్ కోసం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్నవి భూస్వామ్య జమీందారీ రోజులు కావని..ఇవి ప్రజాస్వామ్య రోజులని కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేలకోట్ల అవినీతికి కేసీఆర్ సర్కార్ పాల్పడుతోందన్నారు. ఆ అవినీతి సొమ్ముతో ఇతర పార్టీల నేతలను కొంటున్నారని ఆయన మండిపడ్డారు. సొంత కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌కు శ్రద్ధ లేదని అన్నారు.