
ప్రజల సహకారంతో ‘భగీరథ’
అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో ప్రజల సహకారం తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి శాఖ సమష్టి భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్మాణం విజయవంతంగా ముందుకు సాగుతోందని, ఈ తరహాలోనే గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పైప్‌లైన్ల పనులు జరపాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై బుధవారం తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ప్రధాన కార్యాలయంలో సీఎస్ సమీక్ష జరిపారు.
గ్రామాల్లో అంతర్గతంగా చేపట్టే భగీరథ పనుల్లో సెర్ప్ సిబ్బందిని ఉపయోగించుకునేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్‌ను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో అంతర్గత పైప్‌లైన్ పనులు ప్రారంభమవుతాయని, ఈ పనులకు వాడే పైపుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భగీరథ పథకానికి అవసరమైన నిధుల సమీకరణ, నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డిని ఆదేశించారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.