
టీఆర్‌ఎస్ సాధించిన విజయమిది: కేటీఆర్
- బాలారిష్టాలను అధిగమించడానికే ఏడాది పట్టింది
- ఇప్పటిదాకా 62వేల ఉద్యోగాలను భర్తీ చేశాం
- ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
- డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పుంజుకుంటుంది
- కేంద్రం నుంచి కొన్ని అంశాల్లో సహకారం అందుతోంది
- 2019 ఎన్నికల్లో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్‌తోనే పోటీ
- ప్రజలు దీవిస్తే మరో ఐదేళ్లు కొనసాగుతామని వెల్లడి
- మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి
సాక్షి, హైదరాబాద్
రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఒక సుస్థిరత సాధించామని, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌పై భరోసా కల్పించామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నేరాల సంఖ్య తగ్గిందని, పెట్టుబడులు పెరిగాయని, హైదరాబాద్ బ్రాండ్‌ఇమేజ్ పెంచామని చెప్పారు. కొత్త రాష్ట్రాలు కుదురుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నాయని వివరించారు. తెలంగాణకు తొలి ఎనిమిది, తొమ్మిది నెలల పాటు అధికారులే లేరని, బాలారిష్టాలను అధిగమించడానికే ఏడాది పట్టిందని వెల్లడించారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయిన సందర్భంగా కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు, విపక్షాల విమర్శలు, వచ్చే రెండున్నరేళ్లకు పెట్టుకున్న లక్ష్యాలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేటీఆర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
సంక్షేమంలో ముందున్నాం
‘‘యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోంది. మిషన్ భగీరథపై అధ్యయనానికి 8 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి వెళ్లారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. సమగ్ర కుటుంబ సర్వే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శి అయింది. సంక్షేమ రంగంలో ఎవరూ చేయలేని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. మేనిఫెస్టోలో చెప్పని వాటినీ అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సన్న బియ్యం వంటివి అలాంటివే. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొంత మందకొడిగా జరుగుతోంది. ఇతర నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లే గృహ నిర్మాణంలో ఉండడంతో కొంత సమస్య ఎదురైంది. వేగం పెంచేందుకు రూ.5 వేల కోట్లు అందుబాటులో పెట్టాం. దళితులకు మూడెకరాల భూమి పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమిస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానంతో సరిపెట్టం. చెల్లప్ప, సుధీర్ కమిటీల నివేదికలను ముందు పెట్టి కేంద్రాన్ని ఒప్పిస్తాం.
ఒక్క రాత్రిలో విశ్వనగరం కాదు
హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలంటే కనీసం ఏడెనిమిదేళ్ల సమయం పడుతుంది. రాత్రికి రాత్రే విశ్వనగరం కాదు. రెండేళ్లలో గుర్తించదగిన రీతిలోనే అభివృద్ధి చేసి చూపుతాం. మెట్రో రైలు వాస్తవానికి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి కావాలి. ఏడాది ఆలస్యంగా 2018లో అందుబాటులోకి వస్తుంది. 2017 మే నాటికి మొదటి దశ అందుబాటులోకి వస్తుంది. సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు అభివృద్ధి చేస్తాం. నాలుగు స్కైవేల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నాం.
పరిశ్రమలకు ఊతం
పారిశ్రామిక రంగంలో దూకుడుతో పనిచేస్తాం. టీఎస్ ఐపాస్ ద్వారా మెరుగైన పారిశ్రామిక విధానం తెచ్చాం. కేవలం ఇరుగు పొరుగు రాష్ట్రాలతోనే కాదు మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్‌స వంటి దేశాలతోనూ పోటీ పడుతున్నాం. ఇప్పటికే నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ హామీ విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 2 వేల కిలోమీటర్లు కేబుల్స్ వేశాం. మొత్తం 50 వేల కిలోమీటర్లు వేయాల్సి ఉంది. ఇలా భూగర్భంలో కేబుల్స్ వేస్తోంది దేశంలో తెలంగాణ ఒక్కటే. ఫార్మా సిటీని కూడా 2018 వరకు ప్రారంభిస్తాం. కేంద్రం కొన్ని విషయాల్లో సహకరిస్తోంది. కానీ ఐటీఐఆర్, పోలవరం, హైకోర్టు విభజన వంటి విషయాల్లో ఇబ్బందిగానే ఉంది. జాతీయ రహదారుల విషయంలో సానుకూలత వచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి - సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తాం. ఇప్పటిదాకా 62 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.
నోట్ల రద్దుతో రాష్ట్రం కుదేలు
నోట్ల రద్దు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్లు పెరుగుతాయనుకున్నాం. కానీ దీనితో రిజిస్ట్రేషన్లు కుదేలు అయ్యారుు. నెలకు రూ.1,500 కోట్ల నుంచి రూ. 2వేల కోట్ల దాకా ఆదాయానికి గండిపడినట్లే. రద్దును మొదట్లో వ్యతిరేకించాం, వాస్తవమే. ఇక తప్పదని తేలాక దానికి అనుగుణంగా వెళుతున్నాం. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ముందు ముందు అందరూ ఆదాయపన్ను పరిధిలోకి వస్తే దేశ ఆదాయంతో పాటు మన వాటా కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఐటీ శాఖ తరపున టీఎస్ వ్యాలెట్‌ను సిద్ధం చేస్తున్నాం. అయితే తొందర పడడం లేదు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. సిద్ధిపేట ఫలితాలు చూశాక టీఎస్ వ్యాలెట్‌పై ముందడుగు వేస్తాం. రాష్ట్రంలో అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు కృషి చేస్తున్నాం.
కోదండరాం స్థాయి తగ్గించుకుంటున్నారు..
‘‘కోదండరాం తన స్థాయి తానే తగ్గించుకుంటున్నారు. ఎవరు టెంట్ వేస్తే వారి దగ్గరకు వెళుతున్నారు. ములుగు ప్రత్యేక జిల్లా కావాలంటూ రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకున్నారు. జయశంకర్ పేరున జిల్లా ఉండడం ఇష్టం లేదా? జయశంకర్, కేసీఆర్‌లతో వేదిక పంచుకున్న కోదండరాం చివరకు రేవంత్ స్థాయికి పడిపోయారా? ఆయన ప్రతిపక్షాల ఉచ్చులో పడ్డారు. సీఎం అధికారిక నివాసం కేసీఆర్ సొంతానికి కట్టుకున్నారా? అది రాష్ట్ర ప్రజలదే. ఎవరు సీఎం అయితే వారుంటారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు విలాసాలకు ఖర్చు పెడితే నిలదీయండి. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు కట్టరు. అన్నీ ఒకేసారి చేస్తూ పోవడం తప్పా.
‘ఓటుకు నోటు’లో ఎలాంటి రాజీ లేదు
కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలి. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై దృష్టి పెట్టాం. ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా దృష్టి పెడతాం. ‘ఓటుకు నోటు’కేసులో ఎలాంటి రాజీ లేదు. అది కోర్టులో ఉన్న విషయం. ఇక పార్టీల మార్పిడి ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన విషయం. ఆయా పార్టీల నేతలు వారి రాజకీయ భవిష్యత్‌ను ఆలోచించుకునే వస్తరు. ఒత్తిడికి గురిచేసి తెస్తే తప్పు. 2019 ఎన్నికల్లో మాకు పోటీ అవసాన దశలో ఉన్న కాంగ్రెస్‌తోనే ఉంటుంది. మేం అసలు అధికారంలోకి వస్తం, మంత్రులమవుతం అనుకోలేదు. ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో విలీనం అవుతం అనుకున్నం. కేసీఆర్‌ను ప్రజలు దీవించారు. ఐదేళ్ల కోసం ఎన్నికయ్యాం. ప్రజలు దీవిస్తే మరో ఐదేళ్లు కొనసాగుతం.