
ఆశల బడ్జెట్
⇒ నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్
⇒ కేటాయింపులపైనే అందరి దృష్టి
⇒ ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల కొరత
⇒ జిల్లా సమస్యలపై మనోళ్ల సత్తాకు వేదిక
⇒ నిధులు.. ప్రోత్సాహామిస్తేనే అభివృద్ధి
⇒ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు
జిల్లాను కరువు కమ్మేసింది. బ్యాంకు రుణాలు అందక.. పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చేదారిలేక రైతాంగం ఆత్మహత్యకు ఒడిగడు తోంది. కడుపు నింపని ఉపాధి హామీ పనులు.. పొట్టకూటి కోసం పల్లె జనం ఊరు వదిలి వలసబాట పడుతోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటారుు. నిధులు లేక తాగు, సాగునీటి పథకాలు పడకేసారుు. ఏజెన్సీలో తాగునీటి ఎద్దడి తాండవం చేస్తోంది. పౌష్టికాహార లోపంతో గర్భిణులు, బాలింతలు ప్రాణం కోల్పోతున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడి 22 నెలలు గడుస్తుండగా.. నాలుగు వేల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారుు.
గిరిజన యూనివర్సిటీ జిల్లాలోనే ఏర్పాటు చేయూలని ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం అనేక సమస్యలతో సతమతం అవుతూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయిస్తారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. జిల్లా నుంచి రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాకు ఏ మేరకు నిధులు తీసుకొస్తారో నేడు తెలిసిపోతుంది.
సాక్షి, మంచిర్యాల : జిల్లానే కాదు.. రాష్ట్రాన్నీ కుదిపేస్తున్న సిర్పూర్ పేపర్ మిల్లు సమస్యపై ఈ బడ్జెట్‌లో ప్రస్తావన వస్తుందా..? రాదా..? అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. 80 ఏళ్లకు పైనే చరిత్ర కలిగిన పేపర్ మిల్లుకు నష్టాల సాకుతో యాజమాన్యం తాళం వేసింది. అందులో పని చేసే 4వేల కార్మికులు.. వారిపై ఆధారపడ్డ కుటుంబాలు ఒకే సారి రోడ్డునపడ్డారు. తాజాగా.. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 4న పేపర్‌మిల్లును సీజ్ చేసింది. దీంతో మిల్లు ఎప్పుడు తెరుచుకుంటుందోనని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన కార్మికుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో వేచి చూడాలి.
రైతుకు ఇవ్వాలి భరోసా..
జిల్లాను కరువు కాటేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంతో పంట ఎండిపోయి.. దిగుబడి తగ్గి.. పంట నష్టపోయి.. చేసిన అప్పులు తీర్చలేక ఈ ఏడాది 94 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో పత్తి దిగుబడి 50శాతానికి పడిపోయింది. రబీలో 20 శాతమే వరిసాగైంది. మరోపక్క.. ఈ ఆర్థిక సంవత్సరం రైతులకు రూ.2556 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకర్లు రూ.1786 కోట్లే ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం కేంద్రమైన కరుణిస్తుందని రైతన్న ఆశపడ్డాడు. కానీ కరువు జిల్లాల జాబితాలో కేంద్రం ఆదిలాబాద్‌ను విస్మరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు ఎలాంటి భరోసా కల్పిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
తండాల దశ మారేదెన్నడో..?
ఐదొందల జనాభా ఉన్న గిరిజన గూడెలను పంచాయతీలుగా అప్‌గ్రే డ్ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో 238 గూడెలను గుర్తించిన జిల్లా యంత్రాగం అధికారంలో వచ్చిన టీ-సర్కార్‌కు ఏడాది క్రితమే నివేదికలు అందజేసింది. అయినా ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. తమ గూడేలు పంచాయతీలుగా ఎప్పుడు అప్‌గ్రేడ్ అవుతాయోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు. మరోపక్క.. పౌష్టికాహారం అందక గర్భిణులు.. బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏజెన్సీ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. వారికి కలుషిత నీరే దిక్కయింది. మరోపక్క.. గిరిజన యూనివర్సిటీ వరంగల్‌కు కేటాయించడంతో సుమారు రెండు నెలల నుంచి జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌లోనే ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని గిరిజనులు ప్రజాప్రతినిధులు.. అధికారులను ఘోరావ్ చేశారు. ఉట్నూరులోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ హామీ ఇచ్చారు.
మిషన్ భగీరథ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథకు ఈ బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తారోనని అన్ని వర్గాలు, పార్టీలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఇంటింటికి తాగునీరందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి గత బడ్జెట్‌లో రూ.4వేల కోట్లకు పైనే నిధులు కేటాయించినా.. పనుల ప్రగతి మాత్రం ఆశించిన మేరకు జరగడం లేదు. బావుల నిర్మాణం.. పలు ప్రాజెక్టుల నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా కోసం చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. శ్రీరాంసాగర్, కొమురం భీం, కడెం, గడ్డెన్న వాగు నుంచి తాగు నీరందించేందుకు కేటాయించిన నిధుల్లో 30శాతం కూడా ఖర్చు కాలేదు. నత్తనడకన జరుగుతున్న పనులు వేగిరం చేయడంతోపాటు ఈ బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించాలనే డిమాండ్ ఉంది.
గ్రామజ్యోతి
పల్లె ప్రగతే ల క్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకంతో గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు రూపొందించిన పంచాయతీ అధికారులు రూ.800 కోట్లతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో ఎన్ని ఎక్కువ నిధులు విడుదలయితే.. గ్రామాలు అంత అభివృద్ధి చెందుతాయి. పథకం ఐదేళ్లకు సంబంధించింది కాబట్టి.. ఏడాదికి రూ.800 కోట్ల చొప్పున అధికారులు దశలవారీగా నివేదికలు పంపనున్నారు.
దళితబస్తీ
భూమి లేని దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబస్తీ పథకం అమలు జిల్లాలో అంతంత మాత్రం గానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 4వేలకు పైగా మంది దరఖాస్తులు చేసుకుంటే.. ఇప్పటి వరకు మూడొందలకు మందికి మించి లబ్ధి చేకూరలేదు. ఇప్పటి వరకు అధికారులు సుమారు రూ.3వేల కోట్లతో 840 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దళితులకు అందజేశారు. అర్హులైన దళితులందరికీ లబ్ధి చేకూరాలంటే.. జిల్లాకు ఎక్కువ నిధులు అవసరముంది.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు..
డబుల్ బెడ్ రూం పథకం అర్హుల్లో ఆశలు రేకెత్తించింది. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తొలి విడతగా ఒక్కో నియోజకవర్గానికి నాలుగొందల చొప్పున జిల్లాకు 4వేల ఇళ్లు మంజూరు చేసింది. ఈ బడ్జెట్‌లో డబుల్ బెడ్‌రూంకు నిధులు కేటాయిస్తేనే పనులు అడ్డంకులు లేకుండా పూర్తయ్యే వీలుంది. అయితే.. ఏ మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి.