ఇంటింటికీ రక్షిత జలాలను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం అవినీతిమయంగా మారిందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని రాజీవ్‌స్మారక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథ పనుల్లో 50శాతం అవినీతి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే నీటి వసతులు లేని ప్రాజెక్టులను చేపడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమివ్వకుండా, వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టుల పేరుతో కేటాయించి, టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం అనుచర వర్గానికి కాంట్రాక్టులను కట్టబెడుతోందన్నారు.
రెండేళ్లలో అవినీతి పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయన్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని కావడం లేదన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. డబల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభమే కాలేదన్నారు. రుణమాఫీ ఊసే లేదన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ, హైదరాబాద్‌లోని భూములను కొన్ని సంస్థలకు అప్పగించి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, కొండ యాదగిరి, నయీంషరీఫ్, బోయ రామచంద్రం, తిరుపతి రవీందర్, చింతల వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పల్సం సత్యం, చింతపల్లి వెంకట్‌రెడ్డి, జేకే.దశరథ, రాజయ్య, రఘుపతి, జానిబాబు తదితరులు పాల్గొన్నారు.