సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు అంశం రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా వివాదం రాజేసింది. ఈ పథకానికి జాతీయ అవార్డు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది.
కేసీఆర్ సర్కార్ పేర్కొన్నట్లుగా జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకాన్ని తాము మదింపు చేయలేదని.. తెలంగాణలో 100% నల్లాల ద్వారా క్రమబద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొందని వివరించింది. కేవలం ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్–2022 కింద జాతీయ జల్ జీవన్ మిషన్ నిబంధనలను అనుసరించి రోజుకు 55 లీటర్ల తలసరి తాగునీరు అందుతోందో లేదోనని పరిశీలించడంతోపాటు నీటి నాణ్యత బీఎస్‌ఐ 10,500 ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదోనని మాత్రమే పరిశీలించామని కేంద్ర జలవనరుల శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా 8% నివాసాలకు నిత్యం తలసరి 55 లీటర్లకన్నా తక్కువ తాగునీరు అందుతోందని, మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జాతీయ జల్‌జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లు వివరించింది.
అవార్డు ఆ విభాగంలోనే..
గ్రామీణ గృహసముదాయాలకు క్రమబద్ధమైన నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసిన ఆదివారం బహూకరిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ వివరణ ఇచ్చింది. నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం పనితీరు మదింపు కోసం స్వీకరించే అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనని స్పష్టం చేసింది. 100% నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన గ్రామ పంచాయతీల ద్వారా ధ్రువీకరణ జరగలేదని తెలిపింది.
పదేపదే అబద్ధాలెందుకు?: ఎర్రబెల్లి
‘గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నది మిషన్ భగీరథ ద్వారానే. తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందుతోందని మీ జలజీవన్ మిషన్ వెబ్‌సైట్‌లోనూ ఉంది. గ్రామీణ గృహసముదాయాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే అది మిషన్ భగీరథకు కాకుండా మరి దేనికి వచ్చినట్లు అవుతుంది?’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేంద్రం తీరును తప్పుబడుతూ శనివారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. గ్రామ పంచాయతీలన్నీ ధ్రువీకరించాలని తీర్మానాలు చేయలేదని కొత్త మెలిక పెట్టడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అబద్ధాలు పదేపదే చెప్పడం వల్ల అవి నిజాలు కావనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment