బరువు ఎక్కువైతే మీ నావ మునుగుతుంది
♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అక్రమం
♦ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో అధికార విపక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. విపక్షానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో 63 మంది సభ్యులు ఉన్నా.. అక్రమంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. బరువెక్కువైతే మీ నావ మునిగిపోతుంది జాగ్రత్త’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో గుండెపై చేయి వేసుకుని చెప్పండి.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని’ చిన్నారెడ్డి వ్యాఖ్యానించగా.. మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో లిమిటెడ్ ప్రజాస్వామ్యం నడుస్తోంది. వెబ్‌సైట్‌ను మూసేసి.. జీవోలు అందకుండా చేస్తున్నారు. టీవీ చానళ్లపై నిషేధం విధించారని’ చెన్నారెడ్డి దుయ్యబట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో.. అశాస్త్రీయ విభజనతో ఏపీ తీవ్ర ఇబ్బందులు పడుతుందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి.. తెలంగాణ పురోగతి, అభివృద్ధి నూతన శకానికి నాంది పలికేలా ఉందని పేర్కొన్నారు. ఒకే గవర్నర్..రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి’ అని చిన్నారెడ్డి విమర్శించారు.
గోదావరి జలాలపై కుదుర్చుకున్న ఒప్పందం కొత్తదేమీ కాదని..గతంలోనూ ఒప్పందాలు జరిగాయన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంటు, కరువుకు సంబంధించిన అం శాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు. రైతులు వ్యవసాయాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకునేలా ప్రత్యేక వ్యవసాయ విధానం రూపొందించాలి అని చిన్నారెడ్డి సూచించారు.
2018 నాటికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు: వేముల
‘మిషన్ భగీరథ ద్వారా 2018 డిసెంబర్ నాటికి ప్రతీ ఇంటికి స్వచ్ఛమెన మంచినీరు అందిస్తామ’ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ‘గవర్నర్ ప్రసంగం.. మామూలు ప్రసంగంలా లేదు.. గుడిలో వినిపించే వేదోచ్ఛారణలా రాష్ట్ర అభివృద్ధి మంత్రాన్ని పఠించార’ని ఆయన కితాబునిచ్చారు. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. ఓటమి పాలైన పార్టీల నాయకులు.. ఈవీఎంల టాంపరింగ్ అంటూ ప్రజలను అవమాన పరుస్తున్నా’రని విమర్శించారు. ‘పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామ’న్నారు. మూసీపై 40 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రామిక పెట్టుబడులు తదితర అంశాలను ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావించారు.
మాపై ప్రజలకు నమ్మకముంది: కొప్పుల
‘మా పట్ల ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే అన్ని ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ‘తెలంగాణ కాటన్ దొర’గా ఆయన అభివర్ణించారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చను ఈశ్వర్ ప్రారంభించారు. ‘21 నెలల్లో ప్రజల నమ్మకాన్ని పొందగలిగింది. ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కనపెట్టి రాజకీయ పార్టీల పునరేకీకరణకు ముందుకు రావాలని’ కొప్పుల సూచించారు. 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండడంతో.. సీఎం కేసీఆర్‌ను తమ పెద్దకొడుకుగా భావిస్తున్నారన్నారు.