‘మిషన్ భగీరథ’పై మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్
► తర్వాత ఇంటింటికీ కచ్చితంగా మంచి నీరు అందిస్తాం
► పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళుతున్నాం
► విపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. వచ్చే సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ప్రతి జనావాసానికీ మంచి నీరు అందేలా చూస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కచ్చితంగా నీరందిస్తామని తెలి పారు. మంగళవారం అసెంబ్లీలో ‘మిషన్ భగీ రథ’పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. గొప్పఆలోచనల వెనుక తీవ్ర గాయాలుంటాయని, సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అయిన గాయాలకు మందు పూసే విధంగా దేశానికే ఆదర్శవంతంగా ‘మిషన్ భగీరథ’ను ముందుకు తీసుకెళుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో తాగునీటి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మంచి నీటి పథకాలేవీ పనిచేయడం లేదని.. బోర్లు, ఇతర మంచినీటి పథకాలకు నీటి లభ్యత లేక నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచించినట్టుగా కృష్ణా, గోదావరిల నుంచి తెలంగాణ వాటాగా వచ్చే 1,200 టీఎంసీల నీటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ ఇబ్బంది ఉండదన్నారు.
అపోహలు వద్దు: మిషన్ భగీరథ విషయంలో అపోహలు అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అయినా అపోహలు ప్రజాక్షేత్రంలో లేవని, ప్రతిపక్షాల మనసులో మాత్రమే ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేసిన పనుల్లోనూ కాంట్రాక్టర్లు తక్కువకు, ఎక్కువకు టెండర్లు వేశారని గుర్తు చేశారు. గతంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తే.. తాము తెలంగాణ కాంట్రాక్టర్లను తయారుచేసే పనిలో ఉన్నామని చెప్పారు. గతంలో జరిగిన పనులపై కూడా తాము అనుమానాలు వ్యక్తం చేయగలమని, అయితే తమకు సంస్కారం అడ్డువస్తోందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ విషయంలో తాము తక్కువ (లెస్)కు టెండర్లు ఇస్తే రూ.122 కోట్ల ప్రజాధనం మిగిలిపోయిందనేది కాంగ్రెస్ నేతల బాధ అని, నల్లాల్లో నీళ్లు వస్తే తమ పని అయిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఆదాయమూ వస్తుంది: గతంలో ఉన్న మంచినీటి పథకాల కోసం తవ్విన పైపులైన్లను, ఇతర నిర్మాణాలను మిషన్ భగీరథ కోసం ఉపయోగించుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు. ‘మిషన్ భగీరథ’ద్వారా వచ్చిన నీళ్లను పరిశ్రమలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సరఫరా చేయడం ద్వారా ఏటా రూ.1,900 కోట్ల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకెళుతున్నామని.. కేశవాపూర్, మల్కాపూర్‌ల వద్ద 20 టీఎంసీల చొప్పున రిజర్వాయర్లను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనలో ఇదో వినూత్న పథకమని హడ్కో అభినందించిందని, మన్ కీబాత్‌లో ప్రధాని మోదీ కూడా మిషన్ భగీరథను అభినందించారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌తో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించాయన్నారు. పూర్తిస్థాయి అవగాహనతో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తూ మిషన్ భగీరథను ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా దానిని పూర్తి చేసి తీరుతామని చెప్పారు.