
గోదావరిఖని(రామగుండం) : గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లకు, గుడిసె ప్రాంతాలకు గోదావరినది ఒడ్డున ఉన్న ఫిల్టర్‌బెడ్ ద్వారా తాగునీటిని అందించిన యాజమాన్యం ఇక నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని తీసుకోబోతున్నది. రామగుండం మండలం కుక్కలగూడూరు–మద్దిర్యాల నుంచిరామునిగుండాల గుట్టపై నిర్మించిన సంప్ వరకు వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని గోదావరిఖనిలోని శారదానగర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్ వరకు గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తారు. అక్కడి నుంచి సింగరేణి సంస్థ గంగానగర్‌లోని సింగరేణి ఫిల్టర్‌బెడ్ వరకు పైపుల ద్వారా నీటిని మళ్లించి కార్మికుల క్వార్టర్లకు తాగునీటిని అందించనున్నది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది.
సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో..
సింగరేణి సంస్థ తన పరిధిలో ఉన్న ఆర్జీ–1 డివిజన్‌లోని గోదావరిఖనిలో 7,300 క్వార్టర్లు, ఆర్జీ–2 డివిజన్‌లోని ౖయెటింక్లయిన్‌కాలనీలో 5,600 క్వార్టర్లు, ఆర్జీ–3 డివిజన్‌లోని సెంటినరీకాలనీలో మరో ఐదు వేల క్వార్టర్లకు గోదావరిఖని ఇంటెక్‌వెల్ నుంచి నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. దీనికితోడు మొన్నటి వరకు నడిచిన సింగరేణి పవర్‌హౌస్‌కు కూడా నీటిని అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా సుందిళ్ల వద్ద బ్యారేజీని నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గోదావరినదిలో సుందిళ్ల నుంచి గోలివాడ పంప్‌హౌస్ వరకు నీరు నిల్వ ఉండనున్నది. పట్టణంలోని మురికినీరంతా నిల్వ నీటిలో చేరనుండడంతో ఆ నీటిని శుద్ధి చేసే పరిస్థితి లేకుండా పోతుంది. కాగా ప్రభుత్వం ఇంటింటికి తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా రామగుండం కార్పొరేషన్ పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నది. ఇదే క్రమంలో కార్పొరేషన్‌కు వచ్చే నీటి నుంచి సింగరేణి క్వార్టర్లకు కూడా 20 మిలియన్ లీటర్స్ ఫర్‌డే (ఎంఎల్‌డీ) తాగునీటిని అందించాలని సింగరేణి యాజమాన్యం విన్నవించింది. సెంటినరీకాలనీ ఏరియాకు మంథని నుంచినీటిని కేటాయిస్తున్న నేపథ్యంలో గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ ఏరియాల క్వార్టర్లతో పాటు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, భూగర్భ గనులకు కూడా ఈ నీటినే వాడేందుకు సింగరేణి సిద్ధమైంది.
దీంతో ఈ నెల 12న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో సింగరేణి ఆశించిన మేరకు 20 ఎల్‌ఎల్‌డీ నీటిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇక శారదానగర్ నుంచి గంగానగర్ వరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన మేరకు పైపులైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
కాలనీల ప్రజలు కొత్త కనెక్షన్లు తీసుకోవాల్సిందే...
సింగరేణి క్వార్టర్ల ఏరియాకు నీటిని సరఫరా చేసేందుకు పైపులు బిగించగా, పలుకార్మిక కాలనీలలో ఆ పైపులకే కనెక్షన్లు ఇచ్చుకుని అక్రమంగా నీటిని వినియోగిస్తున్నారు. ఇలా సింగరేణి నీటిని వాడుతున్న కనెక్షన్లు 22 వేల వరకు ఉంటాయి. కాలనీలకు సుమారుగా 6 ఎంఎల్‌డీ నీటిని సింగరేణి సరఫరా చేసేది. కాగా... మిషన్ భగీరథ ద్వారా నీటిని ఉపయోగించే క్రమంలో ఈ కనెక్షన్లకు నీటి సరఫరా నిలిచిపోనున్నది. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 45 వేల నివాసుండగా, అందులో 16 వేల నల్లా కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుతం అమృత్ స్కీమ్ కింద అనేక కాలనీలలో తాగునీటి పైపులైన్లను అమర్చిన నేపథ్యంలో మిగిలిన ఇళ్ళకు నల్లా కనెక్షన్లు తీసుకునే వీలుంది. త్వరలో సింగరేణి అందించే నీటి సరఫరా నిలిచిపోతున్న క్రమంలో ఆయా ఇళ్ళ యజమానులు అనివార్యంగా కార్పొరేషన్ నుంచి కొత్తగా నల్లా కనెక్షన్లను పొందాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment