మిషన్ స్లో
► ముందుకు సాగని భగీరథ ఇంట్రావిలేజ్ పనులు
► ఓహెచ్‌ఎస్సార్ ట్యాంకుల నిర్మాణాలకు స్పందన సగమే
► 756లో 389 ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు ఫైనల్
► మిగిలిన 50 శాతం ప్యాకేజీ పనులపై అధికారుల కుస్తీ
► మూడు మాసాల నుంచి కాంట్రాక్టర్ల కోసం గాలింపు
► బతిమిలాడి మరీ పనులకు ఒప్పిస్తున్న వైనం
► పైపులైన్ పనులకు ఇప్పుడి ప్పుడే సిద్ధమైన యంత్రాంగం
నల్లగొండ : భగీరథుడు శ్రమిస్తే కానీ దివి నుంచి గంగమ్మ భువకి రాలేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం శరవేగంగా సాగాలంటే భగీరథుడి రూపంలో ఏదైనా శక్తి రావాల్సిందేనా.. అంటే అధికారుల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తోంది. మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన ప్రధాన పైపులైన్ పనులు వేగంగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. వాటికి అనుసంధానంగా గ్రామాల్లో చేయాల్సిన అంతర్గత పైపులైన్ పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు.
మూడు మాసాలు కావొస్తున్నా..
అంతర్గత పనులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించి మూడు మాసాలు కావొ స్తున్నా టెండర్ల ప్రక్రియ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. అదేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంతర్గత పనులు మొదలు పెట్టడంతో కాంట్రాక్టర్లు కరువయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రధాన పైపులైన్ ని ర్మాణాల ధరలకు, అంతర్గత పైపులైన్ నిర్మాణాల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 50 శాతం పనులకు మాత్రమే కాంట్రాక్టర్ల నుంచి స్పందన వచ్చింది. మిగతా 50 శాతం పనులకు కాంట్రాక్టర్లు దొరక్కపోవడంతో వారి కోసం పొరుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే 20 మంది కాంట్రాక్టర్లను పొరుగు రాష్ట్రం నుంచి రప్పించిన అధికారులు మిగతా 50 శాతం పనులకు ఎక్కడి నుంచి రప్పించాలో తెలియక అయోమయంలో పడ్డారు.
ఇదీ పరిస్థితి....
మూడు జిల్లాల్లో అంతర్గత పనుల్లో భాగంగా ముందుగా గ్రామాల్లో ఓహెచ్‌ఎఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 2,424 ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. ఈ మొత్తం పనులను 756 ప్యాకేజీలుగా ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 800 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారు. కానీ, టెండర్ల దశకు వచ్చేనాటికి 389 మంది కాంట్రాక్టర్లు మాత్రమే పోటీలో నిలిచారు. దీంతో 389 ప్యాకేజీలకు టెండర్లు పూర్తి చేశారు. టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో నిర్మించాల్సిన ట్యాంకులు 1,263. కాగా మిగతా 367 ప్యాకేజీలకుగాను నిర్మించాల్సిన 1,161 ట్యాంకుల పైన సందిగ్ధత నెలకొంది. ప్రతి వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అధికారులకు సైతం ఏంచేయాలో పాలుపోవడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లను రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. ట్యాంకుల నిర్మాణాలకు వినియోగించే స్టీలు, ఇసుక అతి తక్కువ ధరలకే ఇప్పిస్తామని అధికారులు ప్రకటించారు కూడా. అయితే మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ ధరలకు అంతర్గత పనుల్లో లీటరు రేటు ప్రకారం ఖరారు చేసిన ట్యాంకుల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఆ రెండు నియోజకవర్గాల్లోనే పోటీ..
టెండర్లు పూర్తయిన 389 ప్యాకేజీల్లో పనుల కోసం ఎక్కువ మంది పోటీ పడిన కాంట్రాక్టర్లు మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. అధికార పార్టీలో గ్రూపులు కూడా అందుకు ఒక కారణమని తెలుస్తోంది. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్యాంకులు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు అంత తేలిగ్గా ముందుకు రావడం లేదు. దీంతో అధికారులే పూనుకుని ఆయా నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లను బతిమాలడి మరీ పనులకు ఒప్పిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు లేని ప్రాంతాల్లో టెండర్లు ప్రక్రియ సాఫీగానే సాగుతోందని, కొన్ని చోట్ల మాత్రమే రాజకీయపరమైన ఒత్తిళ్లుతీవ్రంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
గడువు ఆరు మాసాలే..
ఈ ఏడాది డిసెంబర్ నాటికి భగీరథ పనులన్నీ పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మే రకు పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే డిసెంబర్ నాటికి 25 శాతం పనులు మాత్రమే పూర్తవుతాయని అంటున్నారు. ఈ మేరకు జిల్లాలో మిషన్ భగీరథ లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పైపులైన్ పనులకు సన్నద్ధం..
ట్యాంకుల సమస్య పరిష్కారం కాకముందే పైపులైన్ పనులకు యంత్రాగం సన్నద్ధమవుతోంది. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 4,217 కి.మీ మేర పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో 2,700 కి.మీ మేర పైప్‌లైన్‌లు నిర్మించి 3.26 లక్షల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. అలాగే సూర్యాపేట జిల్లాలో 1,150 కి.మీ పైపులైన్ వేసి లక్షా 26 వేల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. యాదాద్రి జిల్లాలో 367 కి.మీ పైపులైన్ వేయడంతో పాటు లక్షా 14 వేల నల్లాలు ఏర్పాటు చేయాలి. వారం, పది రోజుల్లో పైపులు వస్తాయని అధికారులు అంటున్నా రు. అదే జరిగితే గ్రామాల్లో పైపులైన్లు వేసేందుకు తవ్వకం పనులు ప్రారంభిస్తారు. దీని కంటే ముందు పైప్‌లైన్ పనులను కూడా ప్యాకేజీలు మార్చి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన వారికే అప్పగిస్తారు. ఇదంతా జరిగేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
త్వరలో టెండర్లు పిలుస్తాం
డిసెంబర్ నాటికి ఇంట్రావిలేజ్ పనులు పూర్తవుతాయి. 50 శాతం ప్యాకేజీల పనులకు కాంట్రాక్టర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. టెండర్ల దాఖలుకు ప్రతి వారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. ఏదేని సమస్య ఎదురైనట్లయితే ఇప్పుడున్న కాంట్రాక్టర్లతోనే మిగితా 50 శాతం పనులు కూడా చేపడతాం. పైపులకు ఆర్డర్ ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. – పాపారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ