అడ్డూఅదుపులేని రేషన్‌బియ్యం అక్రమాలు
సన్నబియ్యం సరఫరాలో దొడ్డుబియ్యం,
కొత్తరకాలు కలిపినా కళ్లప్పగించి చూస్తున్న వైనం
రేషన్ దుకాణాలనుంచి నెలవారీ మామూళ్లు
తనిఖీలకు వెళ్లరు, లారీల వెంట ఎస్కార్ట్‌లను పెట్టరు
గోదాంల నుంచే పక్కదారి పడుతున్న బియ్యం
చౌటుప్పల్ : రేషన్‌డీలర్లు తామంతట తామే ముందుకు వచ్చి ఇదిగో అవినీతి చేశామని చెబితే తప్ప జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేట్టు లేదు. రేషన్‌డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు కలిసి, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నా పట్టడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే సన్నబియ్యంలోనూ రీసైక్లింగ్ బియ్యం, సన్నరకాలు కలిపి సరఫరా చేసినా, బాబోయ్ ఈ అన్నం తినలేమంటూ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా కాలు కదపడం లేదు. అధికార యంత్రాంగం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా, చేష్టలుడిగి చూస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అప్పుడే సిన్నబోయిన సన్న భోజనం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే
విద్యార్థులకు సన్నబియ్యం(సూపర్ ఫైన్ బియ్యం)తో పెడుతున్న భోజనం అప్పుడే సిన్నబోయింది. సన్నబియ్యంలో రీసైక్లింగ్ దొడ్డు బియ్యం, సన్నబియ్యం రకాలను కలిపి సరఫరా చేయడమే దీనికి కారణం. ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో కూడిన భోజనం పథకాన్ని ప్రారంభించింది. అంతకుముందు దొడ్డు బియ్యంతో పెట్టేవారు.
రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యాన్నే పాఠశాలలకు, హాస్టళ్లకు డీలర్ల ద్వారా సరఫరా చేసేవారు. సన్నబియ్యం సరఫరాలో అక్రమాలు జరగనీయొద్దని ఈ నెల నుంచి నేరుగా ఎంఎల్‌ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. అవసరమైన సన్నబియ్యం సేకరణను కూడా రైస్‌మిల్లర్ల నుంచే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు. జనవరి మాసంలో సన్నబియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసిన మిల్లర్లు, రెండో నెలలోనే అక్రమాలకు తెరలేపారు. రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యాన్ని సివిల్‌సప్లయ్, ఎఫ్‌సీఐల ద్వారా సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లు, మధ్యాహ్న భోజన సన్నబియ్యాన్ని కూడా వారే సరఫరా చేస్తున్నారు. రేషన్ డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్‌ఎస్ గోదాంల ఇన్‌చార్జ్‌లు అంతా కుమ్మక్కై, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ లారీల కొద్దీ బియ్యాన్ని తీసుకెళ్లి, మిల్లులో మళ్లీ నూర్పిడి చేసి, మళ్లీ సివిల్‌సప్లయ్‌కే సరఫరా చేయడం ఒక ఎత్తయితే, సన్నగా మరపట్టి, సూపర్‌ఫైన్ బియ్యంలో కలిపి అమ్మడం మరొక ఎత్తు. మిక్సింగ్ బియ్యంతో వండిన అన్నం ముద్దగా, చితికినట్లు అవుతుండడంతో, విద్యార్థులు తినలేం బాబోయ్ అంటున్నారు. గత నెల 14వ తేదీన ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీకి వచ్చారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన సన్నబియ్యంలో దొడ్డు బియ్యం కలిసి ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపినా, ఇంత వరకు అతీగతీ లేదు. జిల్లా అధికారుల్లోనూ చలనం లేదు.
లారీల కొద్దీ బియ్యం పక్కదారి..
గతంలో రేషన్ దుకాణాలనుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఈ క్రమంలో పట్టుబడుతుండేవారు. కానీ, కొంతకాలంగా నేరుగా గోదాంల నుంచే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన చౌటుప్పల్ మండలం తంగడపల్లి వద్ద రేషన్ బియ్యం సరఫరా చేసే లారీని ఆపి, ఈ తంతును ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో, అప్పటి చౌటుప్పల్ గోదాం ఇన్‌చార్జ్‌ని సస్పెండ్ చేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనే రాకపోవడంతో, ప్రస్తుతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
రేషన్ దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు..?
రేషన్ దుకాణాల నుంచి నెలనెలా సివిల్‌సప్లయ్, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ప్రాంతానికో రేటును పెట్టి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయకట్టు మండలాల్లో రేషన్ దుకాణానికి సరఫరా అయ్యే బియ్యానికి క్వింటాల్‌కు రూ.10చొప్పున, నాన్‌ఆయకట్టు మండలాల్లో క్వింటాల్‌కు రూ.14చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.
అధికారులే గోధుమలను అమ్మేశారు..
రేషన్ బియ్యంలాగే గోధుమలు కూడా నెలనెలా లారీల కొద్దీ పక్కదారి పడుతున్నాయి. కొన్నిచోట్ల డీలర్లే అమ్ముకుంటుంటే, మరికొన్ని చోట్ల డీలర్లతో నిమిత్తం లేకుండా అధికారులే డీలర్ల పేర డీడీలు కట్టి, కాంట్రాక్టర్లు, గోదాం ఇన్‌చార్‌జలతో కుమ్మక్కై గోదాంకు తేకుండానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. సాక్షి దినపత్రికలో అక్టోబర్ మాసంలో ‘గోధుమలది అదే దారి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులు విచారించి, రిపోర్టులు పంపమని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయన నామమాత్రంగానే తనిఖీ చేశారు. ఆ కొద్ది కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడంతో, విషయం మరుగున పడిపోయింది.
అడ్డుకట్ట వేయలేరా..?
Published Mon, Mar 2 2015 2:40 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement