గర్భిణులు.. బాలింతలు.. శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన కోడిగుడ్ల సరఫరా జిల్లాలో పక్కదారి పట్టింది. సిండి‘కేట్లు’గా మారి కాంట్రాక్టులు దక్కించుకున్నవారు సొంత లాభమే చూసుకుంటున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) అమలవుతున్న 18 ప్రాజెక్టుల్లో గుడ్ల సరఫరా ప్రహసనంగా మారింది...!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :స్త్రీ, శిశు సంక్షేమశాఖ స్త్రీలు, శిశువులకు ఎంత మేలుచేస్తుందో చెప్పలేం కానీ, ఈ శాఖను, ఈ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలను నమ్ముకుని మాత్రం పదులసంఖ్యలో కాంట్రాక్టర్లు, కొందరు ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలయ్యే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకుల నుంచి మొదలుపెడితే.. జిల్లాలో పైస్థాయిలో ఉన్న ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం వరకు పిల్లల నోళ్లు కొడుతూ వెనకేసుకుంటున్న వారే అధికం. జిల్లావ్యాప్తంగా ఉన్న 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న ఐదు ఏజెన్సీల పనితీరుపై పలుఆరోపణలు ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఆ ఐదు ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుడ్ల సరఫరాలో నిబంధనలు పాటించడం లేదని, నిర్ణీత సైజు, బరువుతో కూడిన గుడ్లు కాకుండా చిన్నసైజు గుడ్లు సరఫరా చేయడం, నెలలో 30 రోజులు కాకుండా, మధ్యలో అప్పుడప్పుడు కొన్ని రోజులు ఎగ్గొట్టడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీలకే నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా గడువున్న ఏజెన్సీల కాంట్రాక్టులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆ నోటీసుల్లో ఆదేశించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టులు (18), ఇందిరమ్మ అమృత హస్తం అమలవుతున్న 6 ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా గుర్తించిన 17 మండలాల పరిధిలోని స్కూలు పిల్లలకు వెరసి 1.50 లక్షల మంది లబ్ధిదారులకు రోజూ 1.50 లక్షల కోడిగుడ్లు సరఫరా కావాలి. దీనికోసం కాంట్రాక్టు దక్కించుకున్న దేవీ ట్రేడర్స్, నైసా ట్రేడర్స్, శాంభవి ట్రేడర్స్, న్యూవెల్‌కమ్ ట్రేడర్స్, భూపతి ఎంటర్ ప్రైజెస్ అనే ఐదు ఏజెన్సీల పనితీరుపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ స్పందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాలి. ఈ సైజులో ఉన్న గుడ్లనే సరఫరా చేయాలి. కానీ, కాంట్రాక్టర్లు తమ మిగులుబాటు కోసం కేవలం 30 గ్రాముల బరువున్న గుడ్లను అందిస్తున్నారు.
కోళ్లు పెట్టే తొలిగుడ్లు కేవలం 30 గ్రాముల బరువే ఉంటాయని, వీటి ధర కేవలం రూ.1.50 కావడంతో కాంట్రాక్టర్లు వీటినే సేకరించి సరఫరా చేసి సొమ్ములు మిగిలించుకుంటున్నారు. 50 గ్రాములు ఉన్న కోడిగుడ్డు ధర రూ. 3.50 ఉండడంతో ఈ రూపంలోనే వారికి ఒక్కోగుడ్డుపై ఏకంగా రూ.2 మిగులుతోంది. ఇది కాకుండా, మధ్యమధ్య అసలు గుడ్లే సరఫరా చేయడం లేదు. కాగా, ఇదే ప్రాజెక్టుల్లో కొన్నింటికి మహిళా సంఘాలు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాయి. వీరు సరఫరా చేస్తున్న గుడ్లు 50 గ్రాముల నుంచి 60 గ్రాముల బరువు ఉంటున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్ అటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న సరఫరాను, కాంట్రాక్టర్ల పనితీరును బేరీజు వేసి షోకాజు నోటీసులు ఇచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అధికారులపై ఒత్తిడి పెట్టి కాంట్రాక్టులు సంపాదించిన కొందరు కాంట్రాక్టర్ల పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. ఉన్నతాధికారులు మరింతగా దృష్టి సారిస్తే, కాంట్రాక్టర్ల చేతివాటం మరింతగా బయటపడే అవకాశాలు ఉన్నాయి.
కోడిగుడ్లా...గోలీ కాయలా!
Published Tue, Sep 2 2014 3:13 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement