రూ. 34 కోట్ల ప్రాజెక్టు.. 28 కోట్లకే!
సాక్షి, హైదరాబాద్: అంతన్నారు. ఇంతన్నారు. మీ సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. సగం మేర నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిధులు లేవంటూ అసంపూర్తిగా వదిలేస్తున్నారు. అంతేగాక తక్కువ ధరకే ఆ ప్రాజెక్టులను కాంట్రాక్టర్లకే అప్పగించేయడానికి రంగం సిద్ధం చేస్తూ మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను కల్ల చేస్తున్నారు. ఇది స్వగృహ ప్రాజెక్టుల దుస్థితి. ఇపుడు ఆ స్వగృహాలను బేరం పెట్టి సొమ్ము లు చేసుకుందామన్నా అది అడవి లాంటి పరిస్థితే కనబడుతోంది. తొలిగా అమ్మకం పెట్టిన నల్లగొండ పట్టణంలోని ప్రాజెక్టులో రూ.25 కోట్ల ఖర్చుతో 250 ఇళ్లను సగంమేర నిర్మించారు.
ప్రస్తుతం దాని విలువ రూ.34 కోట్లని అధికారులు తేల్చారు. ఇప్పుడు దీనిని డిమాండ్ లేని ప్రాజెక్టుగా తేల్చి బహిరంగవేలం ద్వారా నిర్మాణ సంస్థకు రూ.28 కోట్లకు ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫైలు కూడా ప్రభుత్వ పరిశీలనతో ఉంది. అస్తవ్యస్త నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకుపోయి మరో గత్యంతరం లేక కాంట్రాక్టర్లకే ఆ ప్రాజెక్టులను కట్టబెట్టాల్సిన పరి స్థితి నెలకొంది. బహిరంగవేలం ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వగృహ కార్పొరేషన్ బకాయిపడ్డ కాంట్రాక్టర్లకు ముట్టజెప్పాల్సి వస్తోంది. దీనికి గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాతో శ్రీకారం చుట్టాల్సి రావటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా స్వగృహ ప్రారంభించిన 21 ప్రాజెక్టుల్లో పదింటిని డిమాం డ్ లేనివిగా గుర్తించి వాటిని ఉన్నవి ఉన్నట్టుగా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ఆ సంస్థ నిర్ణయించింది.
దీనిలో భాగంగా ఇటీవల న ల్లగొండలోని ప్రాజెక్టుకు వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిని చేజిక్కించుకోవడానికి స్వగృహ కాంట్రాక్టర్ తప్ప ఎవరూ ముందుకు రాలేదు. రూ.34 కోట్ల విలువైన ఆ ప్రాజెక్టుకు ఆ కాంట్రాక్టర్ రూ.28 కోట్లు కోట్ చేశారు. ఆ కాంట్రాక్టర్‌కు కార్పొరేషన్ దాదాపు రూ.10 కోట్లు బకాయిపడటంతో ఈ ప్రాజెక్టును ఆయనకు కేటాయించటం మేలని భావిస్తున్న అధికారులు ఫైల్‌ను సర్కారుకు పంపారు. మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ ధర కోట్ చేయటానికి ముందుకొచ్చే పరిస్థితి లేనందున, తాజా వేలంలో ఒకే బిడ్ దాఖలైనా దానికి ఆమోదం తెలపటమే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే స్విస్‌చాలెంజ్ తరహాలో మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి.. ఎవరైనా ఎక్కువ కోట్ చేస్తారేమో పరిశీలిస్తామని, ఎవరూ రాకుంటే ఆ కాంట్రాక్టర్‌కే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఓ అధికారి చెప్పారు.