ration dealers corruption
-
తవ్వేకొద్దీ అవినీతి
సాక్షి, నరసరావుపేట( గుంటూరు): పట్టణంలో రేషన్ డీలర్ల అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రేషన్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించి నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. మరి కొందరు దుకాణదారులు బియ్యాన్ని నల్లబజారుకు తరలించి.. షాపులకు తాళాలు వేసుకుని పరారవుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఒక వైపు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేసి అంతటా పారదర్శకత తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపడుతుంటే.. మరో వైపు కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీల్లో రేషన్ డీలర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వెళ్లిన ప్రతి చౌకదుకాణంలో ఏదో ఒక లోపం కనిపిస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. సోమవారం రేషన్ షాపులపై దాడులు నిర్వహించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందల క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు పక్కదారి పట్టించడాన్ని గుర్తించారు. ఐదుగురు డీలర్లపై కేసులు నమోదు చేయటంతో పాటు క్రిమినల్ కేసులకు సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని డీలర్లు గత కొన్నేళ్లుగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో అనేక మంది కార్డుదారులు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు ప్రభుత్వం మారటంతో చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల రొంపిచర్లలో అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రేషన్ బియ్యం నరసరావుపేట చౌకడిపోల నుంచి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆర్డీవో కె. శ్రీనివాసరావు పట్టణంలోని అన్ని చౌకదుకాణాలను తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేయగా ఉండాల్సిన నిల్వ రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార ఏ ఒక్క చౌకదుకాణంలో అందుబాటులో లేవు. మరోవైపు అధికారులు తనిఖీలతో అక్రమార్కులు డిపోలకు తాళాలు వేసుకొని అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. తమ అవినీతి బండారం ఎక్కడ బయట పడుతుందోనని ఏ ఒక్క డీలర్ అధికారులకు సహకరించడం లేదు. ఐదు షాపులపై కేసులు : డీటీ నిమ్మతోటలోని 44వ నంబర్ చౌకదుకాణంపై అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టి 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దీంతో సోమవారం మిగిలిన చౌక డిపోలను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ డీటీ అశోక్, వీఆర్వోలు పట్టణంలోని పలు దుకాణాలకు వెళ్లి స్టాక్ రిజష్టర్లను పరిశీలించారు. అక్కడ ఉండాల్సిన నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. షాపు నంబర్ 12లో 37 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పంచదార, 2.8 క్వింటాళ్ల కంది పప్పు, అదే విధంగా షాపు నంబర్ 15లో 17.28 క్వింటాళ్ల బియ్యం, 31 కేజీల పంచదార, షాపు నంబర్ 16లో 40.4 క్వింటాళ్ల బియ్యం, 1.21 క్వింటాళ్ల పంచదార, షాపు నంబర్ 18లో 43.87 క్వింటాళ్ల బియ్యం, 1.14 క్వింటాళ్ల పంచదార వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. 19 నంబర్ షాపు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, సబంధిత డీలర్లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు డీటీ తెలిపారు. క్రిమినల్ చర్యలకు సిఫారసు.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు సిఫారసు చేయనున్నట్లు డీటీ అశోక్ తెలిపారు. వందలాది క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్ల విచారణలో తేలిందన్నారు. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అరుగురు డీలర్లపై 6(ఎ) కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
రేషన్ ఇక సులువు
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుంది. వేలిముద్రలు ఈపాస్ యంత్రాల్లో సరిపోలకపోవడంతో రేషన్ దుకాణం వద్ద గంటలతరబడి నిలబడాల్సి వచ్చేది. ఇక నుంచి ఐరిస్‌తో సమస్య తీరనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈపాస్ విధానం నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈవిధానం ద్వారా గతంలో జరిగిన బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం ఈపాస్ విధానం సక్సెస్ అయింది. ఈ తరుణంలో తలెత్తిన వేలిముద్రల సమస్య కొంత ఇబ్బందులకు గురి చేసింది. ఈపాస్ విధానంతో పరికరంపై వేలిముద్ర తీసుకొని బియ్యం సరఫరా చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు కూలీ, వ్యవసాయ, వయసు పైబడడంతో ఈపాస్ పరికరంపై వేలిముద్రలు సరిగా పడకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూశాఖ వీఆర్వోల వేలిముద్రలతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయడం మొదలెట్టింది. ఈ తరుణంలో వీఆర్వో వేలిముద్రల ద్వారా బియ్యం అక్రమాలకు గురవుతున్నాయని అక్కడక్కడ వెల్లువెత్తిన ఆరోపణలతో ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసింది. ఈ తరుణంలో నేరుగా లబ్ధిదారుడికే నిత్యావసర సరుకులు అందించాలనే యోచనతో ఏకంగా ఐరిస్ పరికరాలు అందుబాటులో తీసుకువచ్చారు. లబ్ధిదారుడి కంటి చూపు ద్వారా ఇక సులువైన పద్ధతిలో బియ్యాన్ని తీసుకునేలా సులువైన విధానం రావడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అక్రమాలకు మరింత అడ్డుకట్టపడనుంది. మూడు జిల్లాలకు 1077 ఐరిస్ పరికరాలు పంపిణీ ఉమ్మడి జిల్లాలోని కొమురంభీం మినహా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకుగాను మొత్తం 1077 పరికరాలు పంపిణీ అయ్యాయి. ఈ ఐరిస్ పరికరాల వినియోగం ద్వారా జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 15,276 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. దీంతో ప్రతీనెల వేలిముద్రల వినియోగంతో ఇబ్బందులుపడే లబ్ధిదారుల సమస్య పరిష్కారం కావడంతో అంతటా సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోనే 2500 క్వింటాళ్లు బియ్యం పంపిణీ కాగా మిగతా ఏడురోజుల్లో 6 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ కానున్నట్లు అధికారుల అంచనా. కాగా ఈ పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ప్రస్తుతం వినియోగంలో భాగంగా మొత్తం 16 జిల్లాల్లో ఐరిస్ సేవలు ప్రారంభించారు. మునుముందు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరికరాలు అందుబాటులోకి తెచ్చిసేవలు అందించనున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 355 నిత్యవసర సరుకుల దుకాణాలు ఉండగా అందులో 321 కొనసాగుతుండగా 34 ప్రస్తుతం సెల్‌సిగ్నల్స్ తదితర సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఈపాస్ ప్రారంభనెలలో జిల్లాలోని 18 మండలాలకు 2,200 క్వింట్లాళ్ల బియ్యం పక్కదారి పట్టకుండా మిగిలాయి. ప్రభుత్వం కిలోకు రూ.24 చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తుండగా దాదాపు ప్రారంభనెలలో రూ.50 లక్షలు ఆదాయం మిగులుతోంది. ఇలా ఈ పాస్ విధానం ప్రారంభనెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారుల అంచనా. ఇక కిరోసిన్ కూడా ఆన్లైన్లోనే.. కిరోసిన్ అంటేనే కొంత మంది వ్యాపారులకు బిజినెస్‌గా మారింది. వివిధ వాహనాల వినియోగానికి కిరోసిన్ విచ్చలవిడిగా వాడేవారు. దుకాణాల్లోనూ ఎలాంటి అడ్డూఅదుపు లేకపోవడంతో గతంలో డ్రమ్ములు నింపి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికీ చెక్ పెట్టింది. జనవరి నుంచి కిరోసిన్ కూడా ఆన్లైన్ చేస్తోంది. ఈ తరుణంలో సరుకులు తీసుకుంటున్న విధంగానే ఇక కిరోసిన్ కూడా ఈపాస్ ద్వారానే లబ్ధిదారుడికి అందించనుంది. దీంతో కిరోసిన్ కూడా అడ్డదారిన వెళ్లకుండా అడ్డుకట్ట పడనుంది. కిరోసిన్ పంపిణీ త్వరలో ప్రారంభించనుండడంతో ఈనెల15న గడువుకావడంతో ఇంకో రెండుమూడురోజులు పెంచి కిరోసిన్ పంపిణీకి యోచిస్తున్నారు. ఇంతటి ఈపాస్ కార్యక్రమాన్ని ఓయాసిస్ బృందం ఆధ్వర్యంలో ఈపాస్ జిల్లా మేనేజర్ అశోక్, టెక్నిషియన్లు టీం సభ్యులు సీహెచ్ నాగరాజు, ఈ.రాందాస్, ఎస్ఏ రాజు, టి. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరు నాలుగు మండలాల్లో పరికరాల పని తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తున్నారు. అన్నిరంగాల్లో టెక్నాలజీపరంగా దూసుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈపాస్ విధానంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతోపాటు ఏళ్లనాటి అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితాలు తెచ్చిపెట్టనుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఈపాస్ విధానం ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాని రానురాను ఇబ్బందులు తొలగాయి. ముఖ్యంగా వేలిముద్రలు పడని వారికి రేషన్ అందించడానికి ఇబ్బందిగా ఉండే. వేరే గ్రామాల నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోయే వారు. ప్రస్తుతం ఐరిస్ ద్వారా బియ్యం అందిస్తుండడంతో ఎవరిని కూడా తిరిగి పంపించకుండా అందరికీ బియ్యం అందిస్తున్నాం. దీంతో ఇబ్బందులు తప్పినాయి. – ఆత్రం తిరుపతి, రేషన్ డీలర్సుద్దగూడ అక్రమాలకు అడ్డుకట్ట రేషన్ దుకాణాల్లో అందించే సరుకులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఈపాస్ విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారులకు సరఫరా అవుతున్నాయి. వేలిముద్ర ఇబ్బందులు గుర్తించి ఐరిస్ పరికరాలు అందుబాటులోకి తెచ్చి సరుకులు అందిస్తున్నాం. అంతేకాకుండా కిరోసిన్ కూడా ఈపాస్ ఆన్లైన్ ద్వారానే పంపిణీ అవుతుంది. – అశోక్, ఈపాస్, జిల్లా మేనేజర్ -
బినామీ డీలర్ల బియ్యం దందా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బినామీ రేషన్ డీలర్ల హవా కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానాలను భర్తీ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే 310 మంది బినామీ డీలర్లు ఉండడం గమనార్హం. బినామీ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని తొలగించి, రెగ్యులర్ డీలర్లను నియమించాలని కలెక్టర్ల సదస్సులో పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బినామీలను పక్కనపెట్టి, రెగ్యులర్ డీలర్లను నియమించేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులే బినామీ డీలర్ల అవతారం ఎత్తారు. సబ్సిడీ బియ్యం అక్రమ వ్యాపారంలో కొందరు తెలుగు తమ్ముళ్లకు నేరుగా భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బినామీ డీలర్లు రేషన్ దుకాణాల్లోనే లబ్ధిదారుల నుండి సబ్సిడీ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి దక్కుతున్నాయి. విదేశాలకు తరలుతున్న సబ్సిడీ బియ్యం రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సరఫరా చేస్తోంది. ఇందులో ప్రతినెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని బినామీ రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సబ్సిడీ బియ్యానికి పాలిష్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తెచ్చి కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సబ్సిడీ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పేరొకరిది.. నిర్వహణ మరొకరిది..
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో 1,739 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 7.61 లక్షల మంది తెల్లకార్డు దారులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. 659 దుకా ణాలకు డీలర్లు లేకపోగా.. ఇందులో 271 దుకాణాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కడప రెవెన్యూ డివిజన్లో 696 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 392 ఖాళీలు. ఇటీవలే 240 దుకాణాలకు సంబంధించి రాత పరీక్షలు నిర్వహించి ఇంటర్వూ్యల ద్వారా డీలర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల ఒత్తిడుల నేపథ్యం లో 40 మంది టీడీపీ నేతల అనుచరులను ఎంపిక చేశారని సమాచారం. రాజంపేట రెవెన్యూ డివి జన్‌లో 429 రేషన్ దుకాణాలు ఉండగా.. ఇందులో 51 ఖాళీలు ఉన్నాయి. 29 దుకాణాలు డీలర్లు కోర్టు మెట్లెక్కారు. ఇక జమ్మలమడుగు డివిజన్లో 614 రేషన్ దుకాణాలకు గానూ 216 ఖాళీలు ఉన్నాయి. 111 దుకాణాలపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. అక్రమాలకు బాధ్యులెవరు! నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలు జరిగితే బాధ్యులెవరనేదానికి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. దుకాణం గతంలో కేటాయించిన వ్యక్తుల పేరుతోనే ఉంటున్నందున తప్పులు గుర్తిస్తే అతనిపైనే కేసు నమోదు చేయాలి. దుకాణం నిర్వహించకుండా వదిలేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేస్తే అధికారులు స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గుర్తించిన అధికారులు దుకాణాల తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేస్తే 6ఏ కేసులు నమోదు చేసేందుకు కలిగే ఇబ్బందుల నేపథ్యంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 6ఏ కేసుల నమోదు సంఖ్య గణనీయంగా తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కన్నెత్తి చూస్తే ఒట్టు.. ఆర్ఐ, ఉప తహసీల్దార్, తహసీల్దార్ రేషను దుకాణాలను తనిఖీ చేసే అధికారం ఉంది. గతంలో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో తనిఖీల గురించి వివరాలు అడిగే వారు. ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడులు లేకపోవడంతో మండలస్థాయి అధికారులు కూడా తనిఖీలను గాలికొదిలేశారు. ఇళ్లకు రికార్డులు తెప్పించుకొని.. రేషన్ దుకాణాల పర్యవేక్షణ బాధ్యత ఆహార తనిఖీ అధికారులపై ఉంది. ఫిర్యాదులు అందినప్పుడో లేక ఒత్తిడులు వచ్చినప్పుడో మినహాయించి ఎఫ్ఐలు సైతం దుకాణాల తనిఖీల ఊసెత్తడం లేదు. కొందరు ఆహార తనిఖీ అధికారులైతే దుకాణాలకు సంబంధించిన రికార్డులను తమ ఇళ్లకు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డీటీల తనిఖీల జాడేది.. నాలుగైదు మండలాలకు ఒకరు చొప్పున ఎన్ఫోర్స్మెంట్ డీటీలను నియమించారు. ప్రతి నెలా చౌక దుకా ణాలను తనిఖీలు చేయాలి. నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించకున్నా, పంపిణీలో తేడాలున్నా సంబంధిత డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసి సంయుక్త కలెక్టర్‌కు నివేదించాలి. పౌర సరఫరాల శాఖ అధికారులు రేషను దుకాణాలను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. జిల్లాస్థాయి బృందాలు తనిఖీలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లో.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో టీడీపీ నేతలు రేషన్‌దుకాణాలపై కన్నేశారు. కొత్తగా డీలర్ల నియామకంలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిబంధనలు అధికారపార్టీ నేతలు గాలికొదిలేశారు. నయానో భయానో ఎంతో కాలం నుంచి షాపులను నిర్వహిస్తున్న డీలర్లు బెదిరించి వాటిని తమ బినామీల ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దుకాణాలు నిర్వహిస్తున్న వారిలో 40–45 శాతం బినామీలే ఉండటం గమనార్హం. గతంలో డీలర్లుగా పనిచేస్తున్న వారి పేరునే కొనసాగిస్తున్నా.. నిర్వహణ మాత్రం కొత్తవారు చేస్తున్నారు. దుకాణాల నిర్వహణకు సంబంధించి డీడీలు తీయడం, అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం వంటి పనుల్లో బినామీల హవా కొనసాగుతోందన్నది బహిరంగ సత్యం. పక్కదారి పడుతున్నా.. జిల్లా నుంచి రేషను బియ్యం ఇతర జిల్లాలకు భారీ ఎత్తున తరలుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ప్రజలకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పట్టుబడుతున్న బియ్యంతో వెళుతున్న వాహనాలే ఇందుకు నిదర్శనం. ప్రతినెలా వందల టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నా నిలువరించేందుకు పటిష్ట చర్యలు కరువయ్యాయి. కొన్ని చోట్ల పౌరసరఫరాల గోదాములు, మరికొన్ని చోట్ల డీలర్లే పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపాస్ విధానం అమలు చేయడంతో అక్రమాలకు అలవాటుపడిన వ్యక్తులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. కార్డుదారులతో వేలిముద్రలు తీసుకొని వారికి కొంత ముట్టజెప్పి బియ్యం డీలర్లే తీసుకుంటున్నారు. వీటిని అక్రమ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. -
అడ్డుకట్ట వేయలేరా..?
అడ్డూఅదుపులేని రేషన్‌బియ్యం అక్రమాలు సన్నబియ్యం సరఫరాలో దొడ్డుబియ్యం, కొత్తరకాలు కలిపినా కళ్లప్పగించి చూస్తున్న వైనం రేషన్ దుకాణాలనుంచి నెలవారీ మామూళ్లు తనిఖీలకు వెళ్లరు, లారీల వెంట ఎస్కార్ట్‌లను పెట్టరు గోదాంల నుంచే పక్కదారి పడుతున్న బియ్యం చౌటుప్పల్ : రేషన్‌డీలర్లు తామంతట తామే ముందుకు వచ్చి ఇదిగో అవినీతి చేశామని చెబితే తప్ప జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేట్టు లేదు. రేషన్‌డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు కలిసి, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నా పట్టడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే సన్నబియ్యంలోనూ రీసైక్లింగ్ బియ్యం, సన్నరకాలు కలిపి సరఫరా చేసినా, బాబోయ్ ఈ అన్నం తినలేమంటూ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా కాలు కదపడం లేదు. అధికార యంత్రాంగం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా, చేష్టలుడిగి చూస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అప్పుడే సిన్నబోయిన సన్న భోజనం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం(సూపర్ ఫైన్ బియ్యం)తో పెడుతున్న భోజనం అప్పుడే సిన్నబోయింది. సన్నబియ్యంలో రీసైక్లింగ్ దొడ్డు బియ్యం, సన్నబియ్యం రకాలను కలిపి సరఫరా చేయడమే దీనికి కారణం. ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో కూడిన భోజనం పథకాన్ని ప్రారంభించింది. అంతకుముందు దొడ్డు బియ్యంతో పెట్టేవారు. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యాన్నే పాఠశాలలకు, హాస్టళ్లకు డీలర్ల ద్వారా సరఫరా చేసేవారు. సన్నబియ్యం సరఫరాలో అక్రమాలు జరగనీయొద్దని ఈ నెల నుంచి నేరుగా ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. అవసరమైన సన్నబియ్యం సేకరణను కూడా రైస్‌మిల్లర్ల నుంచే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు. జనవరి మాసంలో సన్నబియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసిన మిల్లర్లు, రెండో నెలలోనే అక్రమాలకు తెరలేపారు. రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యాన్ని సివిల్‌సప్లయ్, ఎఫ్‌సీఐల ద్వారా సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లు, మధ్యాహ్న భోజన సన్నబియ్యాన్ని కూడా వారే సరఫరా చేస్తున్నారు. రేషన్ డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ గోదాంల ఇన్‌చార్జ్‌లు అంతా కుమ్మక్కై, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ లారీల కొద్దీ బియ్యాన్ని తీసుకెళ్లి, మిల్లులో మళ్లీ నూర్పిడి చేసి, మళ్లీ సివిల్సప్లయ్కే సరఫరా చేయడం ఒక ఎత్తయితే, సన్నగా మరపట్టి, సూపర్‌ఫైన్ బియ్యంలో కలిపి అమ్మడం మరొక ఎత్తు. మిక్సింగ్ బియ్యంతో వండిన అన్నం ముద్దగా, చితికినట్లు అవుతుండడంతో, విద్యార్థులు తినలేం బాబోయ్ అంటున్నారు. గత నెల 14వ తేదీన ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీకి వచ్చారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన సన్నబియ్యంలో దొడ్డు బియ్యం కలిసి ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపినా, ఇంత వరకు అతీగతీ లేదు. జిల్లా అధికారుల్లోనూ చలనం లేదు. లారీల కొద్దీ బియ్యం పక్కదారి.. గతంలో రేషన్ దుకాణాలనుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఈ క్రమంలో పట్టుబడుతుండేవారు. కానీ, కొంతకాలంగా నేరుగా గోదాంల నుంచే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన చౌటుప్పల్ మండలం తంగడపల్లి వద్ద రేషన్ బియ్యం సరఫరా చేసే లారీని ఆపి, ఈ తంతును ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో, అప్పటి చౌటుప్పల్ గోదాం ఇన్చార్జ్ని సస్పెండ్ చేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనే రాకపోవడంతో, ప్రస్తుతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రేషన్ దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు..? రేషన్ దుకాణాల నుంచి నెలనెలా సివిల్‌సప్లయ్, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ప్రాంతానికో రేటును పెట్టి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయకట్టు మండలాల్లో రేషన్ దుకాణానికి సరఫరా అయ్యే బియ్యానికి క్వింటాల్‌కు రూ.10చొప్పున, నాన్‌ఆయకట్టు మండలాల్లో క్వింటాల్‌కు రూ.14చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులే గోధుమలను అమ్మేశారు.. రేషన్ బియ్యంలాగే గోధుమలు కూడా నెలనెలా లారీల కొద్దీ పక్కదారి పడుతున్నాయి. కొన్నిచోట్ల డీలర్లే అమ్ముకుంటుంటే, మరికొన్ని చోట్ల డీలర్లతో నిమిత్తం లేకుండా అధికారులే డీలర్ల పేర డీడీలు కట్టి, కాంట్రాక్టర్లు, గోదాం ఇన్చార్జలతో కుమ్మక్కై గోదాంకు తేకుండానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. సాక్షి దినపత్రికలో అక్టోబర్ మాసంలో ‘గోధుమలది అదే దారి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులు విచారించి, రిపోర్టులు పంపమని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయన నామమాత్రంగానే తనిఖీ చేశారు. ఆ కొద్ది కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడంతో, విషయం మరుగున పడిపోయింది. -
రేషన్..పరేషాన్..!
ఒంగోలు టూటౌన్ : చౌకదుకాణాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడం లేదు. రేషన్ షాపులను ఎప్పుడు తీస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కార్డుదారులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తుండటంతో వారంతా అవస్థపడుతున్నారు. జిల్లాలో 2,202 చౌకడిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 8,90,587 వరకు రేషన్‌కార్డులున్నాయి. వీటిలో 6,73,999 తెల్లకార్డులుండగా, 52,152 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మరో 1,032 అన్నపూర్ణ కార్డులున్నాయి. వీరందరికి ప్రభుత్వం ప్రతి నెలా రాయితీపై బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యం రూపాయి లెక్కన చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తోంది. దానికోసం 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి అన్ని చౌకడిపోలకు చేరతాయి. బియ్యంతో పాటు నీలికిరోసిన్, రాయితీపై ఇస్తున్న తొమ్మిది రకాల వస్తువులైన పంచదార, పామోలిన్ ఆయిల్, కందిపప్పు, గోదుమలు, గోదుమపిండి, కారంపొడి, చింతపండు, పసుపు, అయోడైజ్డ్ ఉప్పు అందిస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలను ప్రతి నెలా పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నిత్యవసర వస్తువుల చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజాపంపిణీ వ్యవస్థ విధానం 2008 ఉత్తర్వులకనుగుణంగా జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నడుస్తోంది. కానీ, పేదల కోసం కోట్ల రూపాయిల సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వస్తువులు బడావ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. భారత ఆహార సంస్థ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన బియ్యం మరుక్షణమే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. జిల్లాలోని వై.పాలెం, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో పెద్దఎత్తున ఈ వ్యాపారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకుగానూ ఎవరికి చెందాల్సిన ముడుపులు వారికి పక్కాగా అందడంతో పాటు లక్షల లీటర్ల నీలికిరోసిన్, గోదుములు, కందిపప్పు, తదితర నిత్యవసర వస్తువుల సరఫరా అవుతున్నాయి. దుకాణాలు తెరవాల్సింది ఇలా... ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా బియ్యం, కిరోసిన్, నిత్యవసర వస్తువులను కార్డుదారులకు అందించాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచాలి. మళ్లీ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలి. అమ్మకాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలి. రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. ఈ విధానాన్ని మూడొంతుల డీలర్లు అమలుచేయడంలేదు. జరుగుతుంది ఇలా... ప్రతి నెలా 20 నుంచి 25వ తేదీలోపు డీలర్లంతా బియ్యం, సరుకులకు డీడీలు తీయాలి. నెలాఖరుకు నిత్యవసర వస్తువులను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు స్థానిక రెవెన్యూ అధికారులు చేర్చాలి. సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలా జరగడం లేదు. డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చౌకధరల దుకాణాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చౌకధరల దుకాణాల సమయపాలన అస్తవ్యస్తంగా తయారైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు... వారంరోజుల క్రితం కొత్తపట్నం మండలంలో పలు చౌకధరల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడంలేదు. దుకాణాలు తెరిచి ఉంచాల్సిన సమయంలో అన్ని షాపులు మూతపడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని షాపుల తాళాలు పగులగొట్టి తనిఖీలు చేశారు. అక్కడ నిల్వలకు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు లేవు. నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. పాదర్తి గ్రామంలోని 11వ నంబర్ దుకాణంలో 45.5 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల పంచదార, 66 కిలోల ఉప్పు, 40 లీటర్ల కిరోసిన్ నిల్వల్లో వ్యత్యాసంను అధికారులు గుర్తించారు. 10వ నంబర్ దుకాణాంలో 72 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల ఉప్పులో తేడాలున్నాయి. కె.పల్లెపాలెంలోని 7వ నంబర్ దుకాణంలో 27.9 క్వింటాళ్ల బియ్యం, 97 ప్యాకెట్ల ఉప్పులో వ్యత్యాసం ఉంది. 8వ నంబర్ దుకాణంలో 95 బస్తాల బియ్యంలో తేడాలు గుర్తించారు. ఏ దుకాణంలోనూ నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా ఉండటాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆయా నిల్వలను స్వాధీనం చేసుకుని స్థానిక వీఆర్వోలకు అప్పగించారు. డీలర్లపై 6ఏ కేసులకు సిఫార్సు చేశారు. ఇదే విధంగా గత నాలుగు నెలలుగా జిల్లాలోని పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక అక్రమ నిల్వలు వెలుగుచూశాయి. కొంతమంది డీలర్లు రూపాయి బియ్యాన్ని రూ.10కి వ్యాపారులకు అమ్ముకుని తక్కువ కాలంలోనే లక్షాధికారులవుతున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా రాయితీ సరుకులు పేదల దరిచేరడంలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చౌకధరల దుకాణాలు సమయపాలన పాటించేలా, పేదలకు సక్రమంగా సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.