రేషన్..పరేషాన్..!
ఒంగోలు టూటౌన్ : చౌకదుకాణాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడం లేదు. రేషన్ షాపులను ఎప్పుడు తీస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కార్డుదారులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తుండటంతో వారంతా అవస్థపడుతున్నారు.
జిల్లాలో 2,202 చౌకడిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 8,90,587 వరకు రేషన్‌కార్డులున్నాయి. వీటిలో 6,73,999 తెల్లకార్డులుండగా, 52,152 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మరో 1,032 అన్నపూర్ణ కార్డులున్నాయి. వీరందరికి ప్రభుత్వం ప్రతి నెలా రాయితీపై బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యం రూపాయి లెక్కన చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తోంది. దానికోసం 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి అన్ని చౌకడిపోలకు చేరతాయి. బియ్యంతో పాటు నీలికిరోసిన్, రాయితీపై ఇస్తున్న తొమ్మిది రకాల వస్తువులైన పంచదార, పామోలిన్ ఆయిల్, కందిపప్పు, గోదుమలు, గోదుమపిండి, కారంపొడి, చింతపండు, పసుపు, అయోడైజ్డ్ ఉప్పు అందిస్తోంది.
ఇందుకోసం కోట్లాది రూపాయలను ప్రతి నెలా పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నిత్యవసర వస్తువుల చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజాపంపిణీ వ్యవస్థ విధానం 2008 ఉత్తర్వులకనుగుణంగా జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నడుస్తోంది. కానీ, పేదల కోసం కోట్ల రూపాయిల సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వస్తువులు బడావ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి.
భారత ఆహార సంస్థ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరిన బియ్యం మరుక్షణమే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. జిల్లాలోని వై.పాలెం, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో పెద్దఎత్తున ఈ వ్యాపారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకుగానూ ఎవరికి చెందాల్సిన ముడుపులు వారికి పక్కాగా అందడంతో పాటు లక్షల లీటర్ల నీలికిరోసిన్, గోదుములు, కందిపప్పు, తదితర నిత్యవసర వస్తువుల సరఫరా అవుతున్నాయి.
దుకాణాలు తెరవాల్సింది ఇలా...
ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా బియ్యం, కిరోసిన్, నిత్యవసర వస్తువులను కార్డుదారులకు అందించాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచాలి. మళ్లీ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలి. అమ్మకాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలి. రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. ఈ విధానాన్ని మూడొంతుల డీలర్లు అమలుచేయడంలేదు.
జరుగుతుంది ఇలా...
ప్రతి నెలా 20 నుంచి 25వ తేదీలోపు డీలర్లంతా బియ్యం, సరుకులకు డీడీలు తీయాలి. నెలాఖరుకు నిత్యవసర వస్తువులను ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు స్థానిక రెవెన్యూ అధికారులు చేర్చాలి. సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలా జరగడం లేదు. డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చౌకధరల దుకాణాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చౌకధరల దుకాణాల సమయపాలన అస్తవ్యస్తంగా తయారైంది.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు...
వారంరోజుల క్రితం కొత్తపట్నం మండలంలో పలు చౌకధరల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడంలేదు. దుకాణాలు తెరిచి ఉంచాల్సిన సమయంలో అన్ని షాపులు మూతపడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని షాపుల తాళాలు పగులగొట్టి తనిఖీలు చేశారు. అక్కడ నిల్వలకు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు లేవు.
నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. పాదర్తి గ్రామంలోని 11వ నంబర్ దుకాణంలో 45.5 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల పంచదార, 66 కిలోల ఉప్పు, 40 లీటర్ల కిరోసిన్ నిల్వల్లో వ్యత్యాసంను అధికారులు గుర్తించారు. 10వ నంబర్ దుకాణాంలో 72 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల ఉప్పులో తేడాలున్నాయి. కె.పల్లెపాలెంలోని 7వ నంబర్ దుకాణంలో 27.9 క్వింటాళ్ల బియ్యం, 97 ప్యాకెట్ల ఉప్పులో వ్యత్యాసం ఉంది. 8వ నంబర్ దుకాణంలో 95 బస్తాల బియ్యంలో తేడాలు గుర్తించారు. ఏ దుకాణంలోనూ నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా ఉండటాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆయా నిల్వలను స్వాధీనం చేసుకుని స్థానిక వీఆర్వోలకు అప్పగించారు. డీలర్లపై 6ఏ కేసులకు సిఫార్సు చేశారు.
ఇదే విధంగా గత నాలుగు నెలలుగా జిల్లాలోని పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక అక్రమ నిల్వలు వెలుగుచూశాయి. కొంతమంది డీలర్లు రూపాయి బియ్యాన్ని రూ.10కి వ్యాపారులకు అమ్ముకుని తక్కువ కాలంలోనే లక్షాధికారులవుతున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా రాయితీ సరుకులు పేదల దరిచేరడంలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చౌకధరల దుకాణాలు సమయపాలన పాటించేలా, పేదలకు సక్రమంగా సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.