ఉట్నూర్ మండలం సుద్దగూడ రేషన్‌షాపులో ఐరిస్ నమోదు చేస్తున్న డీలర్
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుంది. వేలిముద్రలు ఈపాస్ యంత్రాల్లో సరిపోలకపోవడంతో రేషన్ దుకాణం వద్ద గంటలతరబడి నిలబడాల్సి వచ్చేది. ఇక నుంచి ఐరిస్‌తో సమస్య తీరనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈపాస్ విధానం నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈవిధానం ద్వారా గతంలో జరిగిన బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం ఈపాస్ విధానం సక్సెస్ అయింది. ఈ తరుణంలో తలెత్తిన వేలిముద్రల సమస్య కొంత ఇబ్బందులకు గురి చేసింది.
ఈపాస్ విధానంతో పరికరంపై వేలిముద్ర తీసుకొని బియ్యం సరఫరా చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు కూలీ, వ్యవసాయ, వయసు పైబడడంతో ఈపాస్ పరికరంపై వేలిముద్రలు సరిగా పడకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూశాఖ వీఆర్‌వోల వేలిముద్రలతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయడం మొదలెట్టింది. ఈ తరుణంలో వీఆర్‌వో వేలిముద్రల ద్వారా బియ్యం అక్రమాలకు గురవుతున్నాయని అక్కడక్కడ వెల్లువెత్తిన ఆరోపణలతో ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసింది. ఈ తరుణంలో నేరుగా లబ్ధిదారుడికే నిత్యావసర సరుకులు అందించాలనే యోచనతో ఏకంగా ఐరిస్ పరికరాలు అందుబాటులో తీసుకువచ్చారు. లబ్ధిదారుడి కంటి చూపు ద్వారా ఇక సులువైన పద్ధతిలో బియ్యాన్ని తీసుకునేలా సులువైన విధానం రావడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అక్రమాలకు మరింత అడ్డుకట్టపడనుంది.
మూడు జిల్లాలకు 1077 ఐరిస్ పరికరాలు పంపిణీ
ఉమ్మడి జిల్లాలోని కొమురంభీం మినహా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకుగాను మొత్తం 1077 పరికరాలు పంపిణీ అయ్యాయి. ఈ ఐరిస్ పరికరాల వినియోగం ద్వారా జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 15,276 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. దీంతో ప్రతీనెల వేలిముద్రల వినియోగంతో ఇబ్బందులుపడే లబ్ధిదారుల సమస్య పరిష్కారం కావడంతో అంతటా సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోనే 2500 క్వింటాళ్లు బియ్యం పంపిణీ కాగా మిగతా ఏడురోజుల్లో 6 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ కానున్నట్లు అధికారుల అంచనా. కాగా ఈ పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ప్రస్తుతం వినియోగంలో భాగంగా మొత్తం 16 జిల్లాల్లో ఐరిస్ సేవలు ప్రారంభించారు. మునుముందు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరికరాలు అందుబాటులోకి తెచ్చిసేవలు అందించనున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 355 నిత్యవసర సరుకుల దుకాణాలు ఉండగా అందులో 321 కొనసాగుతుండగా 34 ప్రస్తుతం సెల్‌సిగ్నల్స్ తదితర సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఈపాస్ ప్రారంభనెలలో జిల్లాలోని 18 మండలాలకు 2,200 క్వింట్లాళ్ల బియ్యం పక్కదారి పట్టకుండా మిగిలాయి. ప్రభుత్వం కిలోకు రూ.24 చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తుండగా దాదాపు ప్రారంభనెలలో రూ.50 లక్షలు ఆదాయం మిగులుతోంది. ఇలా ఈ పాస్ విధానం ప్రారంభనెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారుల అంచనా.
ఇక కిరోసిన్ కూడా ఆన్‌లైన్‌లోనే..
కిరోసిన్ అంటేనే కొంత మంది వ్యాపారులకు బిజినెస్‌గా మారింది. వివిధ వాహనాల వినియోగానికి కిరోసిన్ విచ్చలవిడిగా వాడేవారు. దుకాణాల్లోనూ ఎలాంటి అడ్డూఅదుపు లేకపోవడంతో గతంలో డ్రమ్ములు నింపి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికీ చెక్ పెట్టింది. జనవరి నుంచి కిరోసిన్ కూడా ఆన్‌లైన్ చేస్తోంది. ఈ తరుణంలో సరుకులు తీసుకుంటున్న విధంగానే ఇక కిరోసిన్ కూడా ఈపాస్ ద్వారానే లబ్ధిదారుడికి అందించనుంది. దీంతో కిరోసిన్ కూడా అడ్డదారిన వెళ్లకుండా అడ్డుకట్ట పడనుంది. కిరోసిన్ పంపిణీ త్వరలో ప్రారంభించనుండడంతో ఈనెల15న గడువుకావడంతో ఇంకో రెండుమూడురోజులు పెంచి కిరోసిన్ పంపిణీకి యోచిస్తున్నారు.
ఇంతటి ఈపాస్ కార్యక్రమాన్ని ఓయాసిస్ బృందం ఆధ్వర్యంలో ఈపాస్ జిల్లా మేనేజర్ అశోక్, టెక్నిషియన్‌లు టీం సభ్యులు సీహెచ్ నాగరాజు, ఈ.రాందాస్, ఎస్‌ఏ రాజు, టి. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరు నాలుగు మండలాల్లో పరికరాల పని తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తున్నారు. అన్నిరంగాల్లో టెక్నాలజీపరంగా దూసుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈపాస్ విధానంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతోపాటు ఏళ్లనాటి అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితాలు తెచ్చిపెట్టనుంది.
ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు..
ఈపాస్ విధానం ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాని రానురాను ఇబ్బందులు తొలగాయి. ముఖ్యంగా వేలిముద్రలు పడని వారికి రేషన్ అందించడానికి ఇబ్బందిగా ఉండే. వేరే గ్రామాల నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోయే వారు. ప్రస్తుతం ఐరిస్ ద్వారా బియ్యం అందిస్తుండడంతో ఎవరిని కూడా తిరిగి పంపించకుండా అందరికీ బియ్యం అందిస్తున్నాం. దీంతో ఇబ్బందులు తప్పినాయి. – ఆత్రం తిరుపతి, రేషన్ డీలర్‌సుద్దగూడ
అక్రమాలకు అడ్డుకట్ట
రేషన్ దుకాణాల్లో అందించే సరుకులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఈపాస్ విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారులకు సరఫరా అవుతున్నాయి. వేలిముద్ర ఇబ్బందులు గుర్తించి ఐరిస్ పరికరాలు అందుబాటులోకి తెచ్చి సరుకులు అందిస్తున్నాం. అంతేకాకుండా కిరోసిన్ కూడా ఈపాస్ ఆన్‌లైన్ ద్వారానే పంపిణీ అవుతుంది. – అశోక్, ఈపాస్, జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment