Ration dealers problems
-
మీకు కడుపు నిండా భోజనం పెడతాం: మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్ : మంత్రి చొరవ తీసుకొని రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను సోమవారం పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి ముందుగా నేను రావాలని అనుకోలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ వాటాదారులు. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ తప్పింది. అందుకు కారణం మీరే. మంత్రివర్గ సమావేశంలో మీకు శుభవార్త తీసుకు వస్తా.. ఈ మేరకు సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. మీకు కడుపునిండా భోజనం పెడతాం’ అని పేర్కొన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పగా.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. సమిష్టిగా సేవ చేస్తున్న రేషన్ డీలర్ల కష్టానికి తగిన ఫలం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 7000 వేలు రేషన్ డీలర్లు సేవ చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. -
రేషన్ ఇక సులువు
ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం కానుంది. వేలిముద్రలు ఈపాస్ యంత్రాల్లో సరిపోలకపోవడంతో రేషన్ దుకాణం వద్ద గంటలతరబడి నిలబడాల్సి వచ్చేది. ఇక నుంచి ఐరిస్‌తో సమస్య తీరనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈపాస్ విధానం నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈవిధానం ద్వారా గతంలో జరిగిన బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం ఈపాస్ విధానం సక్సెస్ అయింది. ఈ తరుణంలో తలెత్తిన వేలిముద్రల సమస్య కొంత ఇబ్బందులకు గురి చేసింది. ఈపాస్ విధానంతో పరికరంపై వేలిముద్ర తీసుకొని బియ్యం సరఫరా చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు కూలీ, వ్యవసాయ, వయసు పైబడడంతో ఈపాస్ పరికరంపై వేలిముద్రలు సరిగా పడకపోవడంతో డీలర్లకు తలనొప్పిగా మారింది. ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూశాఖ వీఆర్వోల వేలిముద్రలతో లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేయడం మొదలెట్టింది. ఈ తరుణంలో వీఆర్వో వేలిముద్రల ద్వారా బియ్యం అక్రమాలకు గురవుతున్నాయని అక్కడక్కడ వెల్లువెత్తిన ఆరోపణలతో ప్రభుత్వం మరోఅడుగు ముందుకేసింది. ఈ తరుణంలో నేరుగా లబ్ధిదారుడికే నిత్యావసర సరుకులు అందించాలనే యోచనతో ఏకంగా ఐరిస్ పరికరాలు అందుబాటులో తీసుకువచ్చారు. లబ్ధిదారుడి కంటి చూపు ద్వారా ఇక సులువైన పద్ధతిలో బియ్యాన్ని తీసుకునేలా సులువైన విధానం రావడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అక్రమాలకు మరింత అడ్డుకట్టపడనుంది. మూడు జిల్లాలకు 1077 ఐరిస్ పరికరాలు పంపిణీ ఉమ్మడి జిల్లాలోని కొమురంభీం మినహా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకుగాను మొత్తం 1077 పరికరాలు పంపిణీ అయ్యాయి. ఈ ఐరిస్ పరికరాల వినియోగం ద్వారా జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 15,276 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరిగింది. దీంతో ప్రతీనెల వేలిముద్రల వినియోగంతో ఇబ్బందులుపడే లబ్ధిదారుల సమస్య పరిష్కారం కావడంతో అంతటా సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోనే 2500 క్వింటాళ్లు బియ్యం పంపిణీ కాగా మిగతా ఏడురోజుల్లో 6 వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ కానున్నట్లు అధికారుల అంచనా. కాగా ఈ పరికరాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాల్సి ఉండగా ప్రస్తుతం వినియోగంలో భాగంగా మొత్తం 16 జిల్లాల్లో ఐరిస్ సేవలు ప్రారంభించారు. మునుముందు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరికరాలు అందుబాటులోకి తెచ్చిసేవలు అందించనున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 355 నిత్యవసర సరుకుల దుకాణాలు ఉండగా అందులో 321 కొనసాగుతుండగా 34 ప్రస్తుతం సెల్‌సిగ్నల్స్ తదితర సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. ఈపాస్ ప్రారంభనెలలో జిల్లాలోని 18 మండలాలకు 2,200 క్వింట్లాళ్ల బియ్యం పక్కదారి పట్టకుండా మిగిలాయి. ప్రభుత్వం కిలోకు రూ.24 చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తుండగా దాదాపు ప్రారంభనెలలో రూ.50 లక్షలు ఆదాయం మిగులుతోంది. ఇలా ఈ పాస్ విధానం ప్రారంభనెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారుల అంచనా. ఇక కిరోసిన్ కూడా ఆన్లైన్లోనే.. కిరోసిన్ అంటేనే కొంత మంది వ్యాపారులకు బిజినెస్‌గా మారింది. వివిధ వాహనాల వినియోగానికి కిరోసిన్ విచ్చలవిడిగా వాడేవారు. దుకాణాల్లోనూ ఎలాంటి అడ్డూఅదుపు లేకపోవడంతో గతంలో డ్రమ్ములు నింపి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికీ చెక్ పెట్టింది. జనవరి నుంచి కిరోసిన్ కూడా ఆన్లైన్ చేస్తోంది. ఈ తరుణంలో సరుకులు తీసుకుంటున్న విధంగానే ఇక కిరోసిన్ కూడా ఈపాస్ ద్వారానే లబ్ధిదారుడికి అందించనుంది. దీంతో కిరోసిన్ కూడా అడ్డదారిన వెళ్లకుండా అడ్డుకట్ట పడనుంది. కిరోసిన్ పంపిణీ త్వరలో ప్రారంభించనుండడంతో ఈనెల15న గడువుకావడంతో ఇంకో రెండుమూడురోజులు పెంచి కిరోసిన్ పంపిణీకి యోచిస్తున్నారు. ఇంతటి ఈపాస్ కార్యక్రమాన్ని ఓయాసిస్ బృందం ఆధ్వర్యంలో ఈపాస్ జిల్లా మేనేజర్ అశోక్, టెక్నిషియన్లు టీం సభ్యులు సీహెచ్ నాగరాజు, ఈ.రాందాస్, ఎస్ఏ రాజు, టి. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరు నాలుగు మండలాల్లో పరికరాల పని తీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తున్నారు. అన్నిరంగాల్లో టెక్నాలజీపరంగా దూసుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈపాస్ విధానంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతోపాటు ఏళ్లనాటి అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలితాలు తెచ్చిపెట్టనుంది. ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఈపాస్ విధానం ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాని రానురాను ఇబ్బందులు తొలగాయి. ముఖ్యంగా వేలిముద్రలు పడని వారికి రేషన్ అందించడానికి ఇబ్బందిగా ఉండే. వేరే గ్రామాల నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోయే వారు. ప్రస్తుతం ఐరిస్ ద్వారా బియ్యం అందిస్తుండడంతో ఎవరిని కూడా తిరిగి పంపించకుండా అందరికీ బియ్యం అందిస్తున్నాం. దీంతో ఇబ్బందులు తప్పినాయి. – ఆత్రం తిరుపతి, రేషన్ డీలర్సుద్దగూడ అక్రమాలకు అడ్డుకట్ట రేషన్ దుకాణాల్లో అందించే సరుకులు పక్కదారి పట్టకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఈపాస్ విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారులకు సరఫరా అవుతున్నాయి. వేలిముద్ర ఇబ్బందులు గుర్తించి ఐరిస్ పరికరాలు అందుబాటులోకి తెచ్చి సరుకులు అందిస్తున్నాం. అంతేకాకుండా కిరోసిన్ కూడా ఈపాస్ ఆన్లైన్ ద్వారానే పంపిణీ అవుతుంది. – అశోక్, ఈపాస్, జిల్లా మేనేజర్ -
రేషన్ డీలర్ల సమస్యలకు త్వరలోనే పరిష్కారం
దర్శి( ప్రకాశం): రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ సమావేశం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు జీతాలు ఇవ్వాలా లేదా కమీషన్ పెంచాలా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో రేషన్ డీలర్లకు ఏ విధంగా జీతాలు లేదా కమీషన్ ఇస్తున్నారు అనే నివేదికలు తెప్పించిన తరువాత స్పష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా అందరి సమన్యాయం చేస్తూ పాలన చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రన్న కానుకలు, చంద్రన్న పెళ్లి కానుకలు, సిమెంటు రోడ్డులు, నదుల అనుసంధానం వంటి పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అందరూ సహకరించాలన్నారు. దర్శి మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ నియమనిబంధనల ప్రకారం నిత్యావసర సరుకులు ప్రజలకు పాదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఖర్చులు పెరిగినందన గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించాలని లేదా కమీషన్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సూరె సుబ్బారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
డీలర్లను తొలగించేందుకు కుట్ర
టేక్మాల్(మెదక్): రేషన్ డీలర్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని టేక్మాల్ జెడ్పీటీసీ ఎం.ఏ. ముక్తార్ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రమైన టేక్మాల్‌లో విలేకరులతో మాట్లాడారు. 40 ఎళ్లుగా డీలర్లుగా సేవలందిస్తున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి వారికి మానసిక క్షభను మిగిల్పిందని ధ్వజమెత్తారు. ఇక డీలర్లకు రూ.400 కోట్లకు పైగా బకాయి చెల్లించకుండా వారిని తొలగిస్తామనడం సరికాదన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే వారిపై వేటు వేస్తామనడం సరైన విధానం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం నియోజకవర్గంలోనే డీలర్ ఆత్మహ్యతకు యత్నించినా స్పందించికపోవడంతో దారుణమన్నారు. డీలర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వం స్పందించకుంటే పార్టీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు యాదయ్య, జేఏసీ జిల్లా నాయకులు మల్లయ్య, అన్వర్‌పాషా, శంకర్ తదితరులు ఉన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): రేషన్‌డీలర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు టీపీసీసీ సభ్యులు, ఖేడ్ ఎంపీపీ పట్లోళ్ల సంజీవర్రెడ్డి వెల్లడించారు. ఆదివారం పేటలో సమ్మె చేస్తున్న డీలర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లకు రూ.415 కోట్ల కమీషన్ బకాయిలు చెల్లించడం లేదని, వారి వేతనాన్ని రూ.30 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమలో అన్ని వర్గాలుపాల్గొన్నాయని, వారిలో డీలర్లకు కూడా ఉన్నారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో వారి సమస్యలపై ఉద్యమిస్తుంటే దానికి అణచివేయాలని యత్నంచడం దుర్మార్గమన్నారు. సీఎం నియోజకవర్గంలోనే డీలర్ నజీర్‌ఖాన్ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమన్నారు. ఇక కొత్త కార్డులు మంజూరు చేయకపోగా, అంత్యోదయకు బియ్యాన్ని తగ్గిస్తున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సీడీసీ డైరెక్టర్ కుంట్ల సంగయ్య, డీలర్ల సంఘం అ«ధ్యక్షుడు కిష్టయ్య, శివరాజ్, కుమార్, భాస్కర్, పండరి, వినోద్, కుచ్చకుమార్, ప్రతాప్‌గౌడ్ తదితరులున్నారు. -
ఎన్నికల్లో సత్తా చూపుతాం
జనగామ: ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు హెచ్చరించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ వేతనంపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో వచ్చే పంచాయతీ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పాస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. నెలకు రూ.30 వేల గౌరవ వేతనంతోపాటు హెల్త్ కార్డులు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే విధంగా ప్రకటన చేయాలని కోరారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రూ.20.19 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. వే బ్రిడ్జిపై కాంటా వేసిన తర్వాతనే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్‌కు బియ్యాన్ని పంపించాలని సూచించారు. త్వరలో హైదరాబాద్ లేదా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై ఒకటి నుంచి నిరవధిక బంద్ పాటిస్తూ, తిరుగుబాటు చేయాలని తీర్మానం చేశారు. -
డీలర్లు పరేషాన్
అరకొర కమీషన్.. గోడౌన్లలో తక్కువ తూకాలతో బియ్యం సరఫరా.. బయోమెట్రిక్ యంత్రాల నిర్వహణ ఖర్చు.. అందని మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలకు సరఫరా చేసే బియ్యం బిల్లులు.. దుకాణా ల్లో సౌకర్యాల లేమి.. వెరసి ముప్పావలా కోడి పిల్లకు మూడు రూపాయల పందిపిల్లను దిష్టి తీసిన చందంగా మారింది చౌకదుకాణ డీలర్ల పరిస్థితి. ఫలితంగా డీలర్లకు కష్టాలు.. నష్టాలు మిగులుతున్నాయి. చిత్తూరుటౌన్: జిల్లాలోని చౌకదుకాణల డీలర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చౌకదుకాణాలను నష్టాలతో నడుపుతూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దుకాణాల్లో సౌకర్యాల లేమితో కష్టాలు తప్పడం లేదు. దీనికితోడు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 2,970 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటికి బియ్యం సరఫరా చేయడానికి 29 మండల నిల్వ కేంద్రాలున్నాయి. ఇందులో ఏ గోదాములోనూ బయోమెట్రిక్ వేయింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో బస్తాకు 51 కిలోల బియ్యానికి బదులు డీలర్లకు 48 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. ఒక బస్తాకు 3 కిలోల వరకు డీలర్ల నష్టపోతున్నారు. అయితే డీలర్లు మాత్రం బయోమెట్రిక్ తూనికల మిషన్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. బయోమెట్రిక్ భారమూ డీలర్లదే డీలర్లకు బయోమెట్రిక్ తూనికల యంత్రాన్ని ప్రభుత్వం అందజేసింది. అయితే దాని నిర్వహణకు సంవత్సరానికి రూ.900 ఆ కంపెనీ డీలర్ల వద్ద నుంచి వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ తూనికల యంత్రానికి మూడేళ్ల ఉచిత సర్వీసు చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నా దాన్ని పాటించడం లేదు. ఈ యంత్రానికి సంబంధించిన బ్యాటరీలు కూడా డీలర్ల సొంత ఖర్చులతో మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.25 కోట్ల బకాయిలు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న బియ్యం బిల్లులు దాదాపు రూ.25 కోట్ల మేరుకు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఆ బిల్లుల ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ఆ బకాయిలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ఇంతకుముందు రేషన్ షాపుల్లో వివిధ రకాల సరుకులను కార్డుదారులకు పంపింణీ చేసేవారు. ఇప్పుడు ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో డీలర్లు ఒకటో తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీకే పరిమితమవుతున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను డీలర్లకు పంపిణీ చేసి, విలేజ్‌మాల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరకొర కమీషన్ చౌక దుకాణ డీలర్లు ఇంత చేసినా వారికి ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటోంది. దీంతో డీలర్లకు చౌకదుకాణం నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు డీలర్ షిప్ వదుకుంటున్నారు. కొందరు మాత్రం విధిలేక కొనసాగిస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి సానుకూలం
డీలర్లతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సానుకూలంగా ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో 2 రోజులుగా ఆయన వారితో చర్చలు జరిపారు. డీలర్ల కమీషన్ పెంపుతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పరిస్థితిలో మంచి వాతావరణాన్ని చెడగొట్టు కోవద్దని డీలర్లకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాము ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుందన్నారు. ‘రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించాం. భవిష్యత్తులో రేషన్ షాపులు మినీ బ్యాంకులుగా మారనున్నాయి. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు’ అని తెలిపారు. రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.30 వేలు చెల్లించాలని, డీడీ కట్టడానికి వడ్డీలేని రుణాలివ్వాలని, హెల్త్ కార్డులు సౌకర్యం కల్పించాలని, పోర్టబిలిటీ విషయాన్ని పునఃపరిశీలించాలని డీలర్లు.. కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. బత్తుల రమేశ్, మల్లేశం, వెంకటరమణ, నాయికోటి రాజు ఆధ్వర్యంలోని సంఘాలతో సీవీ ఆనంద్ చర్చలు జరిపారు.