రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శిద్దా రాఘవరావు
దర్శి( ప్రకాశం): రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ సమావేశం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు జీతాలు ఇవ్వాలా లేదా కమీషన్ పెంచాలా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో రేషన్ డీలర్లకు ఏ విధంగా జీతాలు లేదా కమీషన్ ఇస్తున్నారు అనే నివేదికలు తెప్పించిన తరువాత స్పష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ విషయంపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా అందరి సమన్యాయం చేస్తూ పాలన చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రన్న కానుకలు, చంద్రన్న పెళ్లి కానుకలు, సిమెంటు రోడ్డులు, నదుల అనుసంధానం వంటి పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అందరూ సహకరించాలన్నారు. దర్శి మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ నియమనిబంధనల ప్రకారం నిత్యావసర సరుకులు ప్రజలకు పాదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఖర్చులు పెరిగినందన గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించాలని లేదా కమీషన్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సూరె సుబ్బారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment