Sidda raghavarao
-
ఎన్నికలొస్తున్నాయని...
పామూరు/వేటపాలెం (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మండలంలోని దూబగుంట్ల గ్రామంవద్ద ట్రిపుల్ఐటీ కళాశాలకు భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్, ఎమ్మెల్యే కదిరి బాబూరావులు పరిశీలించారు. ఈసందర్భంగా హెలీప్యాడ్, భూమిపూజ ప్రాంతం, పైలాన్ నిర్మాణపనులు, బహిరంగసభ వేదికలను పరిశీలించి ఏర్పాట్లపై వారు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతుందన్నారు. అదేవిధంగా వేటపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30కు రామన్నపేట హెలిప్యాడ్‌కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేజీ బజారులో ఏర్పాటు చేస్తున్న మగ్గాన్ని జేసీ నాగలక్ష్మి పరిశీలించారు. -
రేషన్ డీలర్ల సమస్యలకు త్వరలోనే పరిష్కారం
దర్శి( ప్రకాశం): రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ సమావేశం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు జీతాలు ఇవ్వాలా లేదా కమీషన్ పెంచాలా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో రేషన్ డీలర్లకు ఏ విధంగా జీతాలు లేదా కమీషన్ ఇస్తున్నారు అనే నివేదికలు తెప్పించిన తరువాత స్పష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా అందరి సమన్యాయం చేస్తూ పాలన చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రన్న కానుకలు, చంద్రన్న పెళ్లి కానుకలు, సిమెంటు రోడ్డులు, నదుల అనుసంధానం వంటి పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అందరూ సహకరించాలన్నారు. దర్శి మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ నియమనిబంధనల ప్రకారం నిత్యావసర సరుకులు ప్రజలకు పాదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఖర్చులు పెరిగినందన గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించాలని లేదా కమీషన్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ సూరె సుబ్బారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రికి అర్హత ఉందా?
శిద్దాను ప్రశ్నించిన బీవీ రాఘవులు ఒంగోలు టౌన్: ‘జిల్లాలోని దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎనాడైనా ప్రశ్నించారా? కుల వివక్ష గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారా? అవన్నీ చేయకుంటే అంబేద్కర్ విగ్రహానికి దండవేసే అర్హత లేదంటూ తప్పుకోవాలని’ అని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు హితవు పలికారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సభ గురువారం స్థానిక నెల్లూరు బస్టాండులోని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద జరిగింది. కేవీపీఎస్ నాయకుడు జాలా అంజయ్య అధ్యక్షత వహించారు. రాఘవులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయాలని ప్రయత్నిస్తే మంత్రి శిద్దా వచ్చేవరకు ఆగాలంటూ పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా నియమితులైన కారం శివాజీ గతంలో దళితుల సమస్యల గురించి ఏవిధంగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. భూ బ్యాంకు పేరుతో బలవంతపు సేకరణ రాష్ట్ర ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో దళితుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తుందని బీవీ రాఘవులు విమర్శించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని దళితుల భూముల్లో సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, వారి భూములు కాకుండా అగ్రవర్ణాల భూముల్లో సోలార్ లైట్లు వెలగవా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం కాలువకు సేకరిస్తున్న భూముల్లో అగ్రవర్ణాల వారికి ఎకరాకు రూ. 30లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం, దళితులకు కేవలం రూ. 3లక్షలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి బీ రఘురామ్, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, దళిత కవి కత్తి కల్యాణ్, దళిత మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పాలడుగు విజేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సుందరయ్య భవన్ నుండి సభావేదిక వరకు ప్రదర్శన నిర్వహించారు. -
సమ్మె కొనసాగిస్తే ఎస్మా ప్రయోగిస్తాం
ఒంగోలు: సమ్మె కొనసాగిస్తే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సులపై సంస్థ కార్మికులు దాడి చేస్తే ఆరెస్ట్ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అయితే దినసరి వేతనం ఇచ్చే ఒప్పందంపై వచ్చిన డ్రైవర్, కండక్టర్లతో బస్సులు నడపాలని నిశ్చయించారు. అందులోభాగంగా డిపోల నుంచి బస్సులు వెలుపలకు తీసుకు రాగా ఆర్టీసీ కార్మికులు బస్సులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శిద్ధా రాఘవరావుపై విధంగా స్పందించారు. -
రవాణాపన్నుపై న్యాయపోరాటం: ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ సర్కార్ పన్ను విధించడం సరికాదని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్‌కు రాకపోకలపై ఏపీకి కూడా హక్కుంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య అని పేర్కొన్నారు. అయితే దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావట్లేదన్నారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని, అయినా ఇప్పటికీ ఆయన స్పందించలేదని అన్నారు. రవాణా మంత్రి మహేందర్ రెడ్డిని కూడా సంప్రదించామని, ఆయన చర్చలకు వచ్చేది లేదని చెప్పారని రాఘవరావు తెలిపారు. చర్చలకు రమ్మని మరోసారి ఆహ్వానిస్తున్నామని.. అప్పటికీ రాకుంటే న్యాయపోరాటం చేయాలన్నదానిపై ఆలోచిస్తామని ఆయన అన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ వల్ల ఏపీ- తమిళనాడు మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయని, చెన్నైలో కొన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తగలబెట్టారని చెప్పారు. దీనివల్ల ఆర్టీసీకి రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. చర్చల కోసం రాష్ట్ర రవాణా అధికారులను తమిళనాడుకు పంపినట్లు ఆయన తెలిపారు. -
రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు
గుంటూరు : రాజధాని గ్రామాల్లో త్వరలో సిటీ బస్సులు నడుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. వచ్చే నెలలో సుమారు 200 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆయన ఆదివారమిక్కడ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఆర్టీసీకి కొత్తగా 100 కొత్త బస్సులు
విజయవాడ : ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రమాదాలు, నష్టాలు లేని సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. రిపబ్లిక్ డే రోజున 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా ప్రారంభిస్తామని శిద్దా తెలిపారు. ఆర్టీసీ విభజన ప్రక్రియకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని శిద్దా రాఘవరావు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రానికి 700 కొత్త బస్సులు రానున్నాయని ఆయన ప్రకటించారు. ఇకపై రోడ్ల నాణ్యతను అధునాతన పరికరాలతో తనిఖీ చేయనున్నామని శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. -
బాలికలపై వేధింపుల నిరోధానికి చర్యలు
ఒంగోలు వన్‌టౌన్ : బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, రోడ్లు, భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో బాలికల రక్షణ కోసం అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ (ఐఫియా), ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మౌర్య కాన్ఫరెన్స్ హాలులో ‘బాలికల విద్య, రక్షణ, ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, ఐఫియా అధ్యక్షుడు బ్రిజునందన్శర్మ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్యామ్‌సుందరరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ బాలికల విద్య, వారి మేలు కోసం ప్రభుత్వం ఏం చేయాలో ఉపాధ్యాయులు తమ దృష్టికి తెస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో జీవననైపుణ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా విద్యార్థినులకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సెమినార్లో బాలికల విద్య, రక్షణ గురించి చర్చించటం ఆనందంగా ఉందన్నారు. వక్తల సూచనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బాలికలకు విద్యనందించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని ఉపాధ్యాయులను మంత్రి కోరారు. పేదరికాన్ని నిర్మూలించాలి సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. కుటుంబ పేదరికాన్ని నిర్మూలించాలని, విద్య అవసరాన్ని అందరికీ తెలియజేయాలని, సామాజిక స్పృహతో కూడిన విద్యనందించి బాలికలకు చైతన్యవంతుల్ని చేయాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలని, స్త్రీలకు రక్షణ కల్పించాలని, బాలికలకు పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. బూర్జువా, ఉగ్రవాద సంస్కృతిని ప్రేరేపించే కార్యక్రమాలను నిలుపుదల చేయాలన్నారు. మహిళల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని కోరారు. విద్య కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 6 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించి మెరుగైన విద్యనందించాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మంత్రి శిద్దా రాఘవరావుకు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఐఫియా కార్యవర్గ సభ్యులు ఎం.రాఘవరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు, ఐఫియా ప్రధాన కార్యదర్శి వివేకానంద దాస్, శ్రీప్రసాద్ జాదవ్, శివకుమార్, పీఆర్టీఎఫ్ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, సాలిగ్రామ్ బిరూడ్ (మహారాష్ట్ర) కమల్ లోచన్ బిశ్వాల్, కిరణ్‌జ్యోతి, మాధవ్‌శర్మ, జి.సత్యనారాయణ, ఎ.సదాశివరావు, ఎం.విశ్వభారతి, కె.వెంకటేశ్వరరావు, శైలజా, శివలీల, సీహెచ్ వెంకటకుమారి, పీవీ సుబ్బారావు తదితరులు మాట్లాడారు. -
'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు'
ఆర్టీసీకి రోజకు 2.70 కోట్ల నష్టం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. నష్టాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ... త్వరలో ఆర్టీసీలో కొత్త బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఇంధన పొదుపుపై దృష్టి సారించినట్లు వివరించారు. నవ్యాంధ్రలో మొత్తం 13 జిల్లాలను సమాన ప్రాతిపదిక అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే రాజధాని నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టుతోపాటు దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తానని సీఎం చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని శిద్దా రాఘవరావు తెలిపారు. -
ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి
ఒంగోలు వన్‌టౌన్: ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర రవాణ శాఖ, రహదారులు, భవనాల శాఖా మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏపీటీసీఏ నాయకులు వచ్చి కలిస్తే విద్యాశాఖా మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరింపజేస్తానని చెప్పారు. స్థానిక మాంటిస్సోరి హైస్కూలులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) జిల్లాశాఖ నూతన కార్యవర్గం పదవీ స్వీకార ప్రమాణోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమావేశానికి ఏపీటీసీఏ నాయకులు ఏ.బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు యాజమాన్యాలు ఫీజుల్లో రాయితీలు ఇవ్వాలని సూచించారు. అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని, నూతన రాష్ట్ర నిర్మాణానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీటీసీఏ రాష్ట్ర నాయకుడు మాంటిస్సోరి ప్రకాశరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫైర్ సర్టిఫికెట్ల నుంచి విముక్తి కల్పించాలని, 10వ తరగతి గ్రేడ్ పాయింట్ల విషయంలో ఇంగ్లిషు, హిందీ సబ్జక్టులో మార్కులు తగ్గించాలని, 2015 మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్ష పత్రాలపై స్పష్టత ఇవ్వాలని, సెప్టెంబర్ 5న జిల్లాలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించేందుకు సహకరించాలని మంత్రిని కోరారు. ఎస్ఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత వై.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అన్ని యాజమాన్యాలు కలిసిమెలసి స్నేహితులుగా ఉండాలని సూచించారు. శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీటీసీఏ నూతన కమిటీ ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏపీటీసీఏకు విశేష సేవలందించిన ఏఎస్ఆర్ మూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యావేత్త సీహెచ్‌జీ కృష్ణంరాజు, ఉప విద్యాధికారులు ఈ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, జయకుమార్, తాళ్లూరు రమణారెడ్డి, విజేత రమణ, చీరాల విద్యోదయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీటీసీఏ నూతన అధ్యక్షునిగా బొమ్మల శ్రీనివాసరావు, కార్యదర్శిగా డి.నాగేశ్వరరెడ్డి, కోశాధికారి జాయ్జోసెఫ్లతో మాంటిస్సోరి ప్రకాష్ ప్రమాణస్వీకారం చేయించారు. -
విద్యాభివృద్ధికి ప్రైవేట్ పాఠశాలల కృషి
ఒంగోలు ఒన్‌టౌన్ : విద్యాభివృద్ధికి ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న కృషి గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రైవేటు పాఠశాలల అధినేతల గౌరవ సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రైవేటు పాఠశాలలను నిర్వహణ చాలా కష్టసాధ్యమన్నారు. అయినప్పటికీ పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న యాజమాన్యాలను అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చైతన్య హరిబాబు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల విస్తరణ వల్ల స్వయం ఉపాధి కోసం ఏర్పాటుచేసుకున్న చిన్న చిన్న పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో విద్యాశాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ సబ్జెక్ట్లపై అవగాహనతో బోధించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై శ్రద్ధ చూపకపోతే అది ఉపాధ్యాయుల లోపమేనన్నారు. ఒంగోలు ఉప విద్యాధికారి ఈ.సాల్మన్ మాట్లాడుతూ అసోసియేషన్ చేస్తున్న సత్కార కార్యక్రమం వల్ల పాఠశాల కరస్పాండెంట్ల బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. తొలుత మంత్రి శిద్దాను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, ఉప విద్యాధికారి సాల్మన్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 20 ఏళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న 72 మంది అధినేతలను మంత్రి, డీఈవో, డిప్యూటీ డీఈవోలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నార్నె నాగభూషణం, జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్ రమాశివప్రసాద్, డి.లక్ష్మీనారాయణ, ఎస్కె. కరిముల్లా, బి.హనుమంతరావు, కె.ప్రభాకరరావు, ఎల్.శ్రీనివాసులు, యు.చంద్రరావు, కొల్లూరి శ్రీనివాసరావు, కొల్లా మాధవరావు, ఎన్.రాజారావు, రాధాకృష్ణ, సుబ్రహ్మణ్యం, మధుసూదనరెడ్డి, దర్శి కేశవరెడ్డి, భాస్కరరెడ్డి, కూనపరెడ్డి రమేష్‌బాబు, వాణి రాంబాబు, ధనుంజయ, కందులూరు వెంకటరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. -
కమిషనర్ తీరుపై కన్నెర్ర
ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహారం ప్రజాప్రతినిధులకు సైతం అసహనం తెప్పించింది. సోమవారం విద్యుత్ స్తంభంపై నుంచి పడి చనిపోయిన వెంకటేశ్వర్లు బంధువులు, గ్రామస్తులు ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా ... శాంతింపజేయాల్సింది పోయి కమిషనర్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఎక్కడున్నారో తెలియనీయకుండా తప్పించుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మొదలు ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ వరకు కమిషనర్‌కు ఫోన్లు చేస్తున్నా నో రెస్పాన్స్. దీంతో కలెక్టర్‌కు ఫోన్‌చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించడంతో కలెక్టర్ జోక్యం చేసుకోవల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ముక్తినూతలపాడు పంచాయతీలో కాంట్రాక్టు వర్కర్‌గా అదే గ్రామానికి చెందిన సూదనగుంట వెంకటేశ్వర్లు(32) సోమవారం కరెంట్ పోల్ ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషయం విదితమే. వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆవరణలోనే మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ నాయకులు కలుగజేసుకొని రూ.15 లక్షల పరిహారం, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌కు ఫోన్‌చేసి కమిషనర్ మొండి వైఖరిని వివరించారు. మరో వైపు వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జోక్యం చేసుకొని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వివరించారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి నేరుగా కలెక్టర్‌తో మాట్లాడారు. మరో వైపు మంత్రితోపాటు ఎమ్మెల్యే కూడా కమిషనర్‌తో మాట్లాడేందుకు యత్నించగా ఆమె ఎక్కడున్నారో తెలియరాలేదు . కనీసం ఫోన్లు కూడా పని చేయకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడాల్సి వచ్చింది. క్యాంపులో ఉన్న జిల్లా ఉప కార్మికశాఖ అధికారి అఖిల్ విషయం తెలుసుకొని కార్మికశాఖ తరుపున తప్పక న్యాయం జరిగేలా చూస్తానంటూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమాదేవి ద్వారా ఆందోళన చేస్తున్నవారికి తెలియజేశారు. ఆ హామీతో సంతృప్తి చెందని ఆందోళనకారులు చర్చిసెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. పరారైన కమిషనర్‌ను పిలిపించాలంటూ ఆగ్రహించారు. ఒంగోలు టూటౌన్ సీఐ సూర్యనారాయణ అక్కడకు చేరుకొని కలెక్టర్‌తో చర్చించడానికి రావాలంటూ కొంతమందిని పంపించారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తప్పకుండా కమిషనర్‌నుంచి వివరణ కోరతానని కలెక్టర్ విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మృతుని భార్యకు ప్రభుత్వ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తానని...పర్మినెంట్ చేసే అవకాశాలు పరిశీలిస్తానన్నారు. వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్టు, పీఎఫ్ ఇతరత్రా మొత్తం న్యాయబద్ధంగా ఎంత రావాలో అంత మొత్తాన్ని త్వరితగతిన ఇప్పిస్తామంటూ కలెక్టర్ వివరించడంతో శాంతించి మృతదేహాన్ని చర్చిసెంటర్నుంచి తీసుకొని వెళ్లారు. మున్సిపల్ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం... వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ కాదని, హెల్పర్‌గా మాత్రమే తీసుకున్నట్లు మున్సిపల్ డీఈ గోపాల్ కలెక్టర్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ ఆగ్రహించారు. నాన్ టెక్నికల్ కింద ఉద్యోగం ఇచ్చి టెక్నికల్ పనులు ఎందుకు చేయించుకుంటున్నారు...అతనిని ఏ విభాగం కింద తీసుకున్నారో రిపోర్టు పంపండంటూ మండిపడ్డారు. ఆరుగంటలపాటు అందుబాటులోకి రాని కమిషనర్ చర్చలు ముగిశాయని తెలుసుకొని రాత్రి 8 గంటల తరువాత ప్రత్యక్షమయ్యారు. చీమకుర్తికి వెళ్లడంతో ఫోన్ స్విచాఫ్ అయిందని చెప్పడం గమనార్హం.